సుల్తానాబాద్ మండలంలోని రైతు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్


వరికి ప్రత్యామ్నాయ పంటల సాగు పై అవగాహన:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు
రైతులు కోరిన విత్తనాలు అందుబాటులో ఉంచాలి
సుల్తానాబాద్ మండలం లోని యాదవ్ నగర్ లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్
పెద్దపల్లి, డిసెంబర్ 7:-
యాసంగిలో వరికి ప్రత్యామ్నాయ పంటల పై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. మంగళవారం సుల్తానాబాద్ మండలంలోని యాదవ్ నగర్ ఆవాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ పంటల అవగాహన సదస్సులు కలెక్టర్ పాల్గొన్నారు. యాసంగి లో పంట సాగు ప్రణాళిక పై కలెక్టర్ రైతులతో చర్చించి వారి సందేహాలను నివృత్తి చేశారు. యాసంగి లో ఎఫ్ సి ఐ ద్వారా వడ్లు కొనుగోలు చేయనందున యాసంగి లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని అన్నారు. రైతులు తమ సొంత భరోసా మరియు మిల్లర్లు, సీడ్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న రైతులు మాత్రమే వరి పంట వేసుకోవాలని సూచించారు. ఒప్పందం చేసుకోని రైతులు వరి పంట వేసుకుంటే ధాన్యాన్ని సొంతంగానే అమ్ముకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వరికి బదులు మినుములు కందులు, జొన్నలు, నువ్వులు తదితర లాభసాటి పంటలు వేసుకోవాలని కలెక్టర్ రైతులకు సూచించారు. ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి సరిపడా విత్తనాలను రైతులకు అందిస్తామని కలెక్టర్ తెలిపారు. రైతులు కోరిన ఇతర పంట విత్తనాలు రేపటి వరకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. పంట మార్పిడి కి తగిన సూచనలు సలహాలు కూడా రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా అందిస్తామని కలెక్టర్ అన్నారు. కుంటల ప్రాంతంలో నీళ్లు జాలుపడే పొలాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అవగాహన కల్పిస్తారని కలెక్టర్ తెలిపారు. భవిష్యత్తులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలు ప్రోత్సహిస్తుందని, రైతులు దీనిని గమనించి ప్రత్యామ్నాయ సాగు కు సహకరించాలని కలెక్టర్ కోరారు. రైతులు తమ సొంత భరోసాతో మాత్రమే వరి సాగు చేసుకోవాలని కలెక్టర్ స్ప‌ష్టం చేశారు.

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తిరుమల ప్రసాద్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share This Post