సెప్టెంబర్ 1వ తేదీ నుండి అంగన్వాడి మొదలు అన్ని స్థాయిల్లోని పాఠశాలల్లో ప్రత్యక్ష విద్యాభ్యాసం జరిపేందుకు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా పాఠశాలలను సిద్ధం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రా రెడ్డి కలెక్టర్లను సూచించారు.

పత్రిక ప్రకటన

తేది: 24-8-2021

సెప్టెంబర్ 1వ తేదీ నుండి అంగన్వాడి మొదలు అన్ని స్థాయిల్లోని పాఠశాలల్లో ప్రత్యక్ష  విద్యాభ్యాసం జరిపేందుకు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా పాఠశాలలను సిద్ధం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రా రెడ్డి కలెక్టర్లను సూచించారు.  మంగళవారం ఉదయం హైద్రాబాద్ నుండి  రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, పంచాయతీ రాజ్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయ తో కలిసి  జిల్లా కలెక్టర్లు, జిల్లా పరిషత్ చైర్మన్ లు, మున్సిపల్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, అధికారులు, ఎంపిపిలు, జడ్పిటిసిలు తదితరులతో   వర్చువల్ విధానం ద్వారా మాట్లాడారు.  ఈ సందర్బంగా మంత్రి సబిత మాట్లాడుతూ కరోనా వల్ల  గత 16 నెలల నుండి అన్ని విద్యాలయాలు మూత  పడి ఉన్నాయని, ప్రస్తుతం రాష్ట్రం లో ఉన్న పరిస్తుతులను బేరీజు వేసుకుని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సెప్టెంబర్ 1 వ తేదీ నుండి అన్ని తరగతులకు ప్రత్యక్ష విధానం ద్వారా విద్యాభ్యాసం ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదన్నారు.  దీనికి అనుగుణంగా మూతబడిన అన్ని పాఠశాలలను ఈ నెల 30 వతేది లోగా పరిశుభ్రము చేసి అన్ని తరగతి గదులను, మరుగుదొడ్లు, పరిసరాలు శుభ్రం చేసే బాధ్యత పంచాయతీ రాజ్  శాఖ పై ఉందని, పట్టణంలో అయితే మేయర్లు, మున్సిపల్ చైర్మన్ ల పై ఉందని తెలియజేసారు.    అంగన్వాడీ పాఠశాల మొదలు అన్ని ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్, కెజిబివి తదితర అన్ని విద్యాలయాలను శుభ్రం చేయడం, మంచినీటి వసతి,  బ్లీచింగ్, ఫాగింగ్ వంటివి చేసి సర్వసిద్దంగా ఉంచేందుకు జిల్లా కలెక్టర్లు పంచాయతీరాజ్ ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, పంచాయతీ అధికారులు, వైద్య శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులను సమన్వయం చేసుకుంటూ పాఠశాలలను సిద్ధం చేయించే బాధ్యతలు తీసుకోవాలన్నారు.  30 వ తేదీన అందరూ హెడ్మాస్టర్లు తమ పాఠశాలను పంచాయతీ రాజ్ శాఖ ద్వారా అన్ని విధాలుగా శుభ్రం చేసి సిద్ధం చేయడం జరిగిందని ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుందన్నారు.  అదే సమయంలో మండల అభివృద్ధి అధికారులు తమ మండలంలో అన్ని పాఠశాలలు ప్రభుత్వ నిబంధనల మేరకు సిద్ధం చేయడమైనదని కలెక్టర్లకు ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుందన్నారు.  పాఠశాల కు వచ్చే విద్యార్థులకు మాస్క్ లు, శానిటైజేషన్ ఉండే విధంగా చూడాలన్నారు.  ప్రతిరోజు పిల్లలను పర్యవేక్షిస్తూ ఎవరికైనా జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి కరోనా పరీక్షలు చేయించే బాధ్యతలు హెడ్మాస్టర్లు తీసుకోవాలని ఆదేశించారు.  పాఠశాల ప్రారంభించిన అనంతరం సైతం ప్రతి రోజు పాఠశాలను శుభ్రం చేసి బాధ్యతలు పంచాయతీ రాజ్ శాఖ దే అని స్పష్టం చేశారు.  అన్ని ప్రయివేటు విద్యా సంస్థల్లో సైతం ఇదే విధంగా పారిశుధ్యం చేసి సిద్ధంగా ఉండే విధంగా డి.ఈ.ఓ లు చర్యలు తీసుకోవాలని,  మున్సిపల్ అధికారులు, మేయర్లు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ అన్ని విద్యాలయాలను పరిశుభ్రం చేయాల్సిన బాధ్యత పంచాయితీ రాజ్, మున్సిపల్ నూతన చట్టంలో నే ఉందని, దానికి అనుగుణంగానే అన్ని పాఠశాలాలను సిద్ధం చేయాలన్నారు.  అవసరం అనుకుంటే పంచాయతీలో తీర్మానం చేసి కొంత నిధులు ఖర్చు చేసి కొన్ని మరమ్మతులు చేయించుకోవాలని సూచించారు.  మల్టీ పర్పస్ సిబ్బందిని పెట్టి పాఠశాల పరిసరాల్లో పిచ్చి మొక్కల తొలగింపు, పాత నీళ్ల ట్యాన్క్ లు శుభ్రం చేయడం బ్లీచింగ్ చేయడం, ఆగి ఉన్న నీళ్లను తొలగించడం వంటి పనులు చేపట్టాలన్నారు.   సర్పంచులు, పంచాయతీ సెక్రెటరీలు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.  జడ్పిటిసిలు, ఎంపిపి లు తమ బాధ్యతగా తీసుకొని సమన్వయం తో పనులు చేయించాలన్నారు.  గ్రామ కమిటీలు, మండల కమిటీలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని కలెక్టర్లను సూచించారు.

సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి మాట్లాడుతూ ప్రభుత్వ ఇచ్చిన అన్ని సూచనలు, మార్గదర్శకాలు పాటించి 30 వ తేదీ లోగా పాఠశాకలలను సిద్ధం చేయించడం  జరుగుతుందని తెలియజేసారు.

పంచాయితీ రాజ్ కమిషనర్ రఘునందన్ రావు,డైరెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ, జిల్లా నుండి జడ్పి చైర్మన్ వనజమ్మ, మున్సిపల్ చైర్మన్ గందే అనసూయ, మక్తల్ వైస్ చైర్మన్ అఖిల రాజశేఖర్ రెడ్డి , డి.ఈ.ఓ లియాఖాత్ అలీ, డిపిఓ మురళి, డిఆర్డీఓ గోపాల్, ఎంపీ డివోలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post