సెప్టెంబర్ 1 నుండి పాఠశాలలను పునః ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందున అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను ఈ నెల 30 లోగా పరిశుభ్రం చేయించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు.

సెప్టెంబర్ 1 నుండి పాఠశాలలు పునఃప్రారంభిస్తున్న నేపథ్యంలో మంగళవారం ఆమె  హైదరాబాద్ నుండి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో కలిసి  అన్ని జిల్లాల  జిల్లా పరిషత్ చైర్మన్లు,మున్సిపల్ చైర్మన్లు,జిల్లాకలెక్టర్లు, విద్య, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కరోనా కారణంగా  గత 16 నెలల నుండి పాఠశాలలు మూసి ఉంచడం జరిగిందని, సెప్టెంబర్ 1నుండి పాఠశాలలు పునః ప్రారంభిస్తున్న దృష్ట్యా  పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శానిటేషన్  చర్యలు తీసుకోవాలని  చెప్పారు. ఈనెల 30 నాటికి అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు శుభ్రం చేయాలని,సెప్టెంబర్ 1 నుండి జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి సెప్టెంబర్ 30 వరకు ప్రతిరోజు పర్యవేక్షించాలని తెలిపారు.  గ్రామ పంచాయితీ స్థాయి లోని అన్ని ప్రభుత్వ సంస్థల  పరిశుభ్ర బాధ్యత గ్రామ పంచాయతిలదేనని అన్నారు.ప్రభుత్వ పాఠశాలలతో పాటు, ప్రైవేట్ పాఠశాలలను కూడా పర్యవేక్షణ చేయాలని, అంతేకాక ప్రైవేట్ పాఠశాలల బస్ రవాణా పై కూడా పర్యవేక్షించి అవగాహన కల్పించాలని అన్నారు. ఒకవేళ ఎవరికైనా కరోనా సోకినట్లైతే సంబంధిత హెడ్మాస్టర్ బాధ్యత తీసుకొని ఆ విద్యార్తిని తక్షణమే ఆస్పత్రికి తీసుకెళ్లడం, తల్లిదండ్రులకు అప్పగించడం చేయాలని అన్నారు.

పాఠశాలలు,అంగన్వాడీ కేంద్రాలు,ఇతర విద్య సంస్థల పరిశుభ్రత,శానిటేషన్  కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, ఇతర సంబంధిత ప్రజా ప్రతినిధులు భాగస్వాములు కావాలని ఆమె కోరారు.

        పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ వివిధ వర్గాల అభిప్రాయాలు,ఇతర రాష్ట్ర నివేదికల  మేరకు పాఠశాల పునః  ప్రారంభించడం జరుగుతున్నదని తెలిపారు .ఇప్పటివరకుపాఠశాలలు లేనందున విద్యార్థులు, విద్యార్థులు తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారని ,ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని సెప్టెంబర్ 1 నుండి పాఠశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అందువల్ల రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ,అంగన్వాడీ కేంద్రాలు 30వ తేదీలోగా పరిశుభ్రం చేసి సిద్ధం చేయాలని అన్నారు.అన్ని  పాఠశాలల్లో తప్పనిసరిగా నల్లా కనెక్షన్  ఉండాలని, అవసరమైతే మిషన్ భగీరథ నుండి నిధులు ఇస్తామని తెలిపారు. సర్పంచులు పంచాయితీ కార్యదర్శులు గ్రామాలలో ఇదే పనిపై ఉండాలని, ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మాస్కు ధరించి పాఠశాలకు వచ్చేలా చూడాలని, పాఠశాలను పునః ప్రారంభిస్తున్న నేపథ్యంలో పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులతో, పూర్వ విద్యార్థుల తో కమిటీ ఏర్పాటు చేయాలని ,పాఠశాలలకు వల్లే,రంగులు వేయించేందుకు పూర్వ విద్యార్థుల తో డొనేషన్లు సేకరించి  వేయించాలని అన్నారు. ఏ ఒక్క విద్యార్థి కరోనా బారినపడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ సీరియస్ గా తీసుకోవాలని, ఎవరైనా నిర్లక్ష్యం వహించి నట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో డి పి వో లు, పాఠశాల హెడ్మాస్టర్ లు సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు.

 

Share This Post