సెప్టెంబర్ 1 నుండి పాఠశాలల పున ప్రారంభం… వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి

సెప్టెంబర్ 1 నుండి పాఠశాలల పున ప్రారంభం… వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి  సబితా ఇంద్రారెడ్డి వెల్లడి

సెప్టెంబర్ 1 నుండి అన్ని రకాల విద్యాసంస్థలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించినందున విద్యాసంస్థలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలను శుభ్రం చేసి, శానిటైజ్ చేసి విద్యార్థులు పాఠశాలలకు వచ్చే విధంగా సుహృద్భావ వాతావరణం కల్పించుటకు చర్యలు తీసుకోవలసిందిగా రాష్ట్ర విద్యా శాఖామంత్రి సబితా ఇంద్రా రెడ్డి జిల్లా కలెక్టర్లు, జిల్లా పరిషద్ చైర్ పర్సన్, మునిసిపల్ చైర్మన్లు, అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. మంగళవారం అధికారులు, ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో పంచాయత్ రాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో కలిసి మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కోవిడ్ కారణంగా మూతపడిన విద్యాసంస్థలను 16 మాసాల సుదీర్ఘ విరామం తరువాత సెప్టెంబర్ 1 నుండి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. చాలా కాలం తరువాత పాఠశాలలు తెరుస్తున్నందున పాఠశాల ఆవరణ, మరుగుదొడ్లు, మంచినీటి ట్యాంకులలు శుభ్రం చేయాలనీ, సోడియం క్లోరైడ్, బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, తరగతి గదులను శానిటైజ్ చేయాలని, ఫర్నిచర్ ను శుభ్రం చేయాలని మంత్రి సూచించారు.
గ్రామాలు, పట్టణాలలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇట్టి నిర్వహణ భాద్యతను పంచాయతీ రాజ్, మునిసిపల్ శాఖాధికారులు చేపట్టాలన్నారు. ఈ కతృవులో పాఠశాల యాజమాన్యం తో పాటు, ఏం.పి టి.సి.లు, సర్పంచులు, ఏం.పి.డి.ఓలు, ఏం.పి ఓ.లు, ఏం.ఈ.ఓ.లు, గ్రామ కార్యదర్శులు చురుకైన పాత్ర వహిస్తూ అందరు సమన్వయంతో పని చేసి ఈ నెల 30 నాటికి పాఠాశాలలో మౌలిక వసతులు కల్పిస్తూ పూర్వ వైభవం తీసుకురావాలని సూచించారు. పిల్లలు మాస్కులు ధరించేలా చూడాలని, జ్వరం లేదా అనారోగ్యంతో ఉన్నట్లు కనిపిస్తే వెంటనే సమీపంలోని పి .హెచ్.సి. కి తరలించి వైద్యం అందించాలని సూచించారు.
పంచాయత్ రాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ పాఠశాలలో చిన్న చిన్న మరమ్మత్తు పనులను గ్రామ పంచాయతీ నిధులు, ఉపాధి హామీ పధకం నిధుల నుండి చేపట్టాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. పాఠశాలలో కిచెన్ షెడ్లు శుభ్రంగా ఉండాలని, దోమలు వ్యాప్తి చెందకుండా చూడాలని సర్పంచువులు, గ్రామ కార్యదర్శులు ప్రతి రోజు పాఠశాలను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించాలని, ప్రారంభానికి పాఠశాలలు సిద్ధంగా ఉన్నట్లు ఈ నెల 30 న ఏం.పి .డి.ఓ.లు సర్టిఫికెట్ లు ఇవ్వాలని, లేనిచో వారే భాద్యులని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలోని విద్యార్థులు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు పడకుండా గ్రామ పంచాయతీ, మునిసిపల్ శాఖా అధికారులు బాధ్యతతో పనిచేయాలని, పాఠశాలలో పండుగ వాతావరణం కనిపించాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 1,058 ఉన్నాయని , పిల్లలు సంతోషంగా బడులకు వచ్చి చదువుకునే విధంగా ఆహ్లాదకర వాతావరణం కల్పించుటకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రులకు వివరించారు. పాఠాశాలల లో మౌలిక వసతుల కల్పనతో పాటు పాఠశాలల ఆవరణ ,తరగతి గదుల శుభ్రత, మరుగుదొడ్ల శుభ్రత, మంచి నీటి ట్యాంకులు క్లోరినేషన్ , నీరు నిలువ ఉండకుండా, దోమలు వ్యాప్తి చెందకుండా చూడడం, వంటి వాటిపై దృష్టి పెట్టి ప్రత్యేక ఉద్యమంగా కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇందుకోసం క్లస్టర్ వారీగా అధికారుల బృందాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారుఅనంతరం

అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ పాఠాశాలల పున :ప్రారంభానికి చేపట్టవలసిన కార్యక్రమాలపై కార్యాచరణ రూపొందించి తక్షణమే అమలు చేసి రాబోయే మూడు రోజులలో పనులు పూర్తి చేయవలసినదిగా జిల్లా పరిషద్ సి.ఈ.ఓ., డి.పి ఓ. డి.ఈ.ఓ. లకు సూచించారు. సర్పంచులు, మునిసిపల్ కమీషనర్లు ప్రత్యేక చొరవ తీసుకొని పాఠశాలల ఆవరణ, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు,శౌచాలయాలు, మంచి నీటి ట్యాంకుల క్లోరినేషన్, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, కిచెన్ షెడ్, వంట సామాగ్రి దినుసుల శుభ్రతగా ఉండేలా చూడాలని, రవాణా సౌకర్యం ఏర్పాట్లు చూడాలన్నారు. ప్రతి పాఠశాలకు ఒక ఏ. యెన్.ఏం. ను అటాచ్ చేసి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని గమనించాలని డి.ఏం.అండ్ హెచ్.ఓ. వెంకటేశ్వర్ రావు కు, ఉపాధి హామీ పధకం క్రింద పాఠశాలకు రెండు మాసాలకు లేబర్ ను ఇవ్వాలని డి.ఆర్.డి.ఓ. కు , మంచి నీటి ఇబ్బంది లేకుండా చూడాలని మిషన్ భగీరథ అధికారులకు కలెక్టర్ సూచించారు. అధికారులందరూ బాధ్యతతో పనిచేస్తూ ప్రతి రోజు పాఠశాలలు సందర్శించి చేపట్టిన పనుల పురోగతిపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ హరీష్ అధికారులకు సూచించారు. పాఠాశాల ప్రారంభం రోజు మామిడి తోరణాలతో పండుగ వాతావరణం కలిగించాలని అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, జెడ్పి చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, మునిసిపల్ చైర్మన్ చంద్ర పాల్, జెడ్పి సి.ఈ.ఓ. శైలేష్, డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్, డి.పి .ఓ. తరుణ్ కుమార్, డి.ఈ.ఓ. రమేష్ కుమార్, బి.సి.అభివృద్ధి అధికారి జగదీశ్, ఎస్.సి.అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, ఆర్.డబ్ల్యూ.ఎస్.ఈ.ఈ. కమలాకర్, మునిసిపల్ కమీషనర్ శ్రీహరి, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post