సైబర్ నేరాలను అరికట్టేందుకై అడ్వాన్సుగా ఆధునిక పరిజ్ఞానంపై పోలీసులకు శిక్షణ – డీజీపీ మహేందర్ రెడ్డి

మారుతున్న నేరాలు, నేరాలలో వస్తున్నమార్పులకన్నా ముందుగానే తెలంగాణా పోలీసులు ఆయా రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని నేరాలను అడ్డుకట్ట వేస్తున్నారని డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి తెలిపారు. మహిళా భద్రతా విభాగం కార్యాలయంలో షీ భరోసా సైబర్ ల్యాబ్, ఎం.ఆర్.ఐ.  సెల్ కౌన్సెలింగ్ కేంద్రం,మానవ అక్రమ రవాణా నిరోధక కేంద్రం, మిస్సింగ్ పర్సన్స్ మానిటరింగ్ సెల్ కేంద్రాలను నేడు డీజీపీ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతి లక్రా, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమీషనర్లు అంజనీ కుమార్, మహేష్ భగవత్, స్టీఫెన్ రవీంద్ర, ఐజి. శివ శంకర్ రెడ్డి, డీఐజీ సుమతి, ఎస్.పి.రేమా రాజేశ్వరి లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీజీపీ మాట్లాడుతూ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీసింగ్ లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ పొందడం, సీసీటీవీ ల ఏర్పాటు తదితర కారణాల వల్ల గత ఆరేళ్లలో 58 శాతం నేరస్తులకు శిక్షలు పడ్డాయని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం లో మహిళల భద్రత పెంచడానికి ఉమెన్ సేఫ్ట్యి వింగ్ ఎంతగానో కృషి చేస్తోందని, దీనిలో భాగంగా మహిళ ల పై జరుగుతున్న నేరాలను సత్వరం పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన సైబర్ ల్యాబ్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మహిళల భద్రత మీద ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద పెట్టిందని, ఇందుకు గాను అడిషనల్ డీజీ నేతృత్వంలో ప్రత్యేకంగా మహిళా భద్రతా విభాగాన్ని ఏర్పాటు ఛేసిన విషయాన్ని డీజీపీ గుర్తు చేశారు. మహిళ లపై జరుగుతున్న నేరాలకు పూర్తిగా నిర్మూలించడానికి సైబర్ ల్యాబ్ పనిచేస్తుందని ఆశిస్తునట్లు అన్నారు. రాష్ట్రంలోని 800 పోలీస్ స్టేషన్లో నమోదైన మిస్సింగ్ కేసులను సైబర్ ల్యాబ్ మానిటరింగ్ చేస్తుందని వివరించారు. ప్రధానంగా  న్యాయస్థానాలలో నేరస్తులకు  శిక్షలు పడేలా చూసేందుకు సైబర్ ల్యాబ్ పనిచేస్తుందని పేర్కొన్నారు.

ప్రజలతో అనుసంధానం చేసుకుని మహిళ భద్రతకు ఉమెన్ సేఫ్ట్యి వింగ్ పనిచేస్తుందని అన్నారు. ఒక్క కెమెరా వంద పోలీసులతో సమానమని ఇప్పటివరకు హైదరాబాద్ లో 7 లక్షల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. నేరాలు జరగగానే ఈ సీసీ టీవీ ల ద్వారా దొరికి పోతామనే భయాన్నికల్పించామని తెలియచేసారు.

మహిళా భద్రతా విభాగం ఏడిజి స్వాతి లక్రా మాట్లాడుతూ, మహిళల పై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకై  ఉమెన్ సేఫ్ట్యి వింగ్ స్వచ్ఛంద సంస్థలు మహిళల నేరాలను నిర్మిలించడానికి పనిచేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు అన్నిజిల్లాలో 331 షీ టీమ్స్ ఏర్పాటు చేసామని చెప్పారు. టెక్నాలజీని ఉపయోగించి మహిళల పై జరుగుతున్న నేరాలను అరికడుతున్నామని, ఇందులోభాగంగా మహిళలపై జరుగుతున్నపలు రకాల నేరాలను అరికట్టేందుకు సైబర్ ల్యాబ్ ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు.సోషల్ మీడియా లో రోజురోజుకు మహిళల పై నేరాలు పెరుగుతున్నాయని, ఈ సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు గాను సైబర్ సేఫ్టీ నిపుణులతో కాలేజి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని అన్నారు.

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మాట్లాడుతూ,  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిటిజన్ సేఫ్ట్యి కోసం పోలీస్ శాఖ అనేక నూతన కార్యక్రమాలు చేపడుతుందని ప్రధానంగా టెక్నాలజీని ఉపయోగించి అనేక నేరాలను గుర్తించి నేరస్తులకు న్యాయస్థానాల్లో శిక్ష పడేలా చేస్తున్నామని అన్నారు.

రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ, మహిళల పై రోజురోజుకు పెరుగుతున్న నేరాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన షీ టీమ్ మహిళల్లో విశ్వాసం కలిగించిందని పేర్కొన్నారు.

సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ, మహిళల పై జరుగుతున్న నేరాలను నిరోధించడానికి సైబర్ ల్యాబ్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సందర్బంగా మహిళా భద్రతా అంశాలపై రూపొందించిన నాలుగు పుస్తకాలను డీజీపీ ఆవిష్కరించారు.

Share This Post