*సొసైటీలు ఏర్పాటు చేసి మినీ డెయిరీ యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలి :: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

*సొసైటీలు ఏర్పాటు చేసి మినీ డెయిరీ యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలి :: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

*ప్రచురణార్థం-2*

రాజన్న సిరిసిల్ల, జనవరి 12: జిల్లాలో సొసైటీలు ఏర్పాటు చేసి మంజూరయిన మినీ డెయిరీ యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సంబంధిత ప్రభుత్వ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, ఎంపీడీఓలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాకు 2 వేల మినీ డెయిరీ యూనిట్లు మంజూరయినట్లు, ఒక్కో యూనిట్ ధర 2 లక్షల రూపాయలు ఉన్నట్లు తెలిపారు. యూనిట్ ధరలో 70 శాతం సబ్సిడీ, 30 శాతం బ్యాంకు ఋణం ఉంటుందన్నారు. లబ్ధిదారుల గుర్తింపు, నమోదు ఇతర ఆర్థిక చేయూత పథకాల్లో అనుసరించిన విధంగానే చేపట్టాలన్నారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతో పాటు అన్ని మండలాల నుండి 516 దరఖాస్తులు ఆన్ లైన్ లో రిజిస్టర్ అయ్యాయని అధికారులు కలెక్టర్ కు వివరించారు. పాలు సేకరించడానికి కేంద్రాలను ఏర్పాటు చేయాలని, దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ రూపొందించాలని కలెక్టర్ సూచించారు. అలాగే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బల్క్ కూలింగ్ కేంద్రం ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని, దీనికి సంబంధించిన నివేదిక రెండు రోజుల్లోగా తమకు సమర్పించాలని ఎంపీడీఓను కలెక్టర్ ఆదేశించారు.

*ఉచిత సహాయ పరికరాలు అందించేందుకు నిర్వహించే క్యాంపుల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి*
జిల్లాలో దివ్యాంగులు, వయోవృద్ధులకు ఉచిత ఉపకరణాలు, సహాయ పరికరాలను అందించేందుకు గాను ఈ నెల 17 వ తేదీ నుండి 25 వ తేదీ వరకు నిర్వహించబోయే క్యాంపులను జిల్లాలోని దివ్యాంగులు, వయోవృద్ధులు సద్వినియోగం చేసుకునే విధంగా అధికారులు క్షేత్ర స్థాయిలో విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. ఆలింకో సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు చేతికర్రలు, వినికిడి యంత్రాలు, మూడు చక్రాల సైకిల్, ఎంఎస్ఐడి కిట్, స్మార్ట్ చేతి కర్ర , కృత్రిమ అవయవాలు, బ్యాటరీ ఆపరేటడ్ మోటారైజ్డ్ ట్రై సైకిళ్లు, అలాగే 60 సంవత్సరాలు నిండిన వయోవృద్ధులకు చేతికర్రలు వీల్ చైర్స్, వాకర్స్, వాష్రూమ్ వీల్ చైర్, నడుము పట్టి , మెడపట్టి, కంటి అద్దాలు, వినికిడి యంత్రాలు, ఫుట్ కేర్ యూనిట్, వాకింగ్ స్టిక్ విత్ సెట్, కృత్రిమ దంతాలు, నీ బ్రేస్, రోలెటర్ విత్ బ్రేక్ అందజేయడం కోసం అర్హులైన వారిని గుర్తించేందుకు ఈ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ నెల 17 వ తేదీ బోయినిపెల్లి రైతు వేదిక, 18 వ తేదీ ఇల్లంతకుంట రైతు వేదిక, 19 నుండి 21 వ తేదీ వరకు వేములవాడ పట్టణంలోని సినారె కళామందిర్, 22 నుండి 25 వ తేదీ వరకు సిరిసిల్ల పట్టణంలోని సినారె కళామందిర్ లో ఇట్టి క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సదరం వైద్య ధ్రువీకరణ పత్రం లేదా ఏదైనా వైద్యుడు ఫిజిషియన్ ఇచ్చిన 40 శాతం వైకల్యానికి మించినట్లు ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, రెండు ఫోటోలు తీసుకుని క్యాంపులకు వచ్చే విధంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో ఈడీ వినోద్ కుమార్, లీడ్ బ్యాంక్ మేనేజర్ రంగారెడ్డి, జిల్లా సహకార అధికారి బుద్ధనాయుడు, సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, విజయ డైరీ డీడీ గోపాల్ సింగ్, అన్ని మండలాల ఎంపీడీఓ లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post