సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన “గ్రీవెన్స్ డే”లో జిల్లా పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై జిల్లా కలెక్టర్ అర్జీలను సమర్పించారు. జిల్లా స్థాయిలో పరిష్కారమయ్యే అర్జీలను సంబంధిత శాఖల జిల్లా అధికారులను సత్వర చర్యలకై ఆదేశిస్తూ అదేవిధంగా మండల స్థాయికి సంబంధించిన అర్జీల పరిష్కార చర్యలకై మండల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ప్రచురణార్ధం

ఆగష్టు 23 ఖమ్మం –

ప్రజా ఫిర్యాదుల సత్వర పరిష్కారానికై జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ జిల్లాలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే “గ్రీవెన్స్ డే” కు ప్రజలు అధికంగా మండల స్థాయి అర్జీలను సమర్పిస్తుండడం పట్ల నేరుగా సంబంధిత మండల తహశీల్దారుతో పాటు మండల స్థాయి అధికారులతో ప్రజా ఫిర్యాదుల పరిష్కార చర్యలపై జిల్లా పరిషత్లో జరిగిన “గ్రీవెన్స్ డే” నుండే నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులు తీసుకున్న చర్యలపై కలెక్టర్ సమీక్షించి సత్వర పరిష్కార చర్యలకై ఆదేశిస్తున్నారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన “గ్రీవెన్స్ డే”లో జిల్లా పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై జిల్లా కలెక్టర్కు  అర్జీలను సమర్పించారు. జిల్లా స్థాయిలో పరిష్కారమయ్యే అర్జీలను సంబంధిత శాఖల జిల్లా అధికారులను సత్వర చర్యలకై ఆదేశిస్తూ అదేవిధంగా మండల స్థాయికి సంబంధించిన అర్జీల పరిష్కార చర్యలకై మండల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఖమ్మం రూరల్ మండలం చిన్న వెంకటగిరి గ్రామ పంచాయితీలో ముందస్తు ప్రణాళిక లేకుండా నిర్మించిన మురుగుకాలువలు పూడిపోయినవని పల్లె ప్రగతిలో కూడా ఇట్టి పనులు చేపట్టలేదని గ్రామంలో మురుగు కాలువల శుభ్రతపట్ల తగు చర్యలు తీసుకొనగలరని సమర్పించిన అర్జీపై జిల్లా పంచాయితీ అధికారిని, పంచాయితీరాజ్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరును స్థానికంగా పర్యటించి వెంటనే సత్వర చర్యలు గైకొనాలని కలెక్టర్ ఆదేశించారు. నేలకొండపల్లి పి.ఏ.సి. ఎస్. ఋణాల పంపిణీలో అవకతవకలు జరిగాయని, విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకోగలరని పి.ఏ.సి. ఎస్ డైరెక్టర్లు మన్నెకృష్ణారావు, తీగ రమణారెడ్డి యం శంకర్లు సమర్పించిన ఫిర్యాదుపై విచారణ చేసి తగు చర్య తీసుకోవాలని జిల్లా సహకార శాఖాధికారిని కలెక్టర్ ఆదేశించారు. కొణిజర్ల మండలం కొండనవమాల గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ గృహాల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని, అర్హులకు ఇండ్లు కేటాయించబడలేదని ఇట్టి విషయమై తగు విచారణ చేసి తనకు న్యాయం చేయగలదని కంచర్ల కృష్ణకుమారి సమర్పించిన దరఖాస్తును పరిశీలించి తదుపరి నివేదిక సమర్పించాలని జిల్లా రెవెన్యూ అధికారి, సంబంధిత తహశీల్దారును కలెక్టర్ ఆదేశించారు. కల్లూరు మండలం లోకవరం నుండి వచ్చిన పిట్టల ఆదినారాయణ తన అసైన్డ్ భూమికి పట్టా ఇప్పించగలరని దరఖాస్తు సమర్పించగా, పరిశీలన చేసి తదుపరి చర్యకై అదనపు కలెక్టరు కు సూచించారు. ముదిగొండ మండలం పెద్దమండవకు చెందిన చిన్న కేశవ బ్రహ్మం సర్వేనెం. 53లో గల 1 ఎకరం 18 గుంటల భూమిలో 18 గుంటల భూమి పాస్ బుక్లో నమోదు కాబడలేదని, సరిచేయించగలరని సమర్పించిన దరఖాస్తును పరిష్కార చర్యకై సంబంధిత తహశీల్దారును కలెక్టర్ ఆదేశించారు. పెనుబల్లి మండలం కర్రాలపాడు గ్రామ పంచాయితీకి కేటాయించబడిన 40 లక్షల రూపాయల నిధులను సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ కార్యదర్శి గ్రామ అభివృద్ధికి వినియోగించకుండా. దుర్వినియోగపరుస్తున్నారని విచారణ జరిపించి బాధ్యులపై తగు చర్యలు తీసుకొనగలరని గ్రామ పంచాయితీ ప్రజలు సమర్పించిన దరఖాస్తుపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని జిల్లా పంచాయితీ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. తిరుమలాయపాలెం మండలం సుల్లెడు నుండి వచ్చిన మందడి విజ్ఞాన్ విద్యార్థి తాను గత మే-2021లో 10 వ తరగతి ఉత్తీర్ణత పొందియున్నానని తనకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యాభ్యాసానికి గాను రెసిడెన్షియల్ కళాశాలలో అడ్మిషన్ ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును తదుపరి చర్యకై రీజినల్ కో-ఆర్డినేటర్ను కలెక్టర్ ఆదేశించారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్టుపై సత్వర చర్యలు తీసుకొన గలరని జిల్లా బార్ అసోషియోషన్ సభ్యులు సమర్పించిన విన్నపాన్ని పరిశీలించి తదుపరి చర్య తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

అదనపు కలెక్టర్ ఎన్ మధుసూధన్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అప్పారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు “గ్రీవెన్స్ డే”లో పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post