సోమవారం నుండి గ్రామాల్లో అవగాహనా సదస్సులు:: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 6: జిల్లాలోని పోడు భూముల సమస్యలున్న 67 గ్రామాల్లో రేపటి నుండి (సోమవారం) అవగాహనా సదస్సులు నిర్వహించాలని జిల్లా అనురాగ్ జయంతి అన్నారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపిడివోలు, మండల తహశీల్దార్లతో పోడు భూముల అంశంపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో పోడు సమస్యలున్న 8 మండలాల్లోని 67 గ్రామాల్లో గ్రామ సర్పంచ్ అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి, గ్రామ రెవిన్యూ సహాయకులు, అటవీ బీట్ అధికారి, మండల సర్వేయర్ లతో 67 టీములు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఇట్టి టీములు సోమవారం నుండి వారి వారి గ్రామాల్లో సదస్సులు నిర్వహించి, పోడు భూముల విషయంలో అర్జీల సమర్పణ గురించి పోడు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఆర్జి సమర్పించాల్సిన ఫారం, ఎలా వివరాలు పొందుపర్చాలి అన్న విషయాన్ని పోడు రైతులకు విశదీకరించాలన్నారు. మండల స్థాయి అధికారులు వారి పరిధిలోని గ్రామాల్లో సదస్సుల్లో పాల్గొనాలన్నారు. ప్రక్రియలో మొదటగా అవగాహన కల్పించడం, తర్వాత అర్జీలు స్వీకరించడం, క్షేత్ర స్థాయిలో వాస్తవిక పరిస్థితుల పరిశీలన చేయడం ఉంటుందన్నారు. ప్రక్రియ విషయంలో ప్రభుత్వం మార్గదర్శకాలను విధిగా పాటించాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) బి. సత్యప్రసాద్, ఇంచార్జ్ జిల్లా రెవిన్యూ అధికారి టి. శ్రీనివాసరావు, జెడ్పి సిఇఓ గౌతమ్ రెడ్డి, డిపివో రవీందర్, కలెక్టరేట్ ఏవో గంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Share This Post