స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు పటిష్ట ఏర్పాట్లు:: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా. శశాంక్ గోయల్

ప్రచురణార్థం-1
రాజన్న సిరిసిల్ల, డిశంబర్ 8: ఈ నెల 10 న జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా. శశాంక్ గోయల్ తెలిపారు. బుధవారం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియపై అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 10 న పోలింగ్ ఉదయం 8.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని అన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం సామాజిక దూరం పాటించాలని, శానిటైజర్లు, మాస్కులు, హెల్త్ వర్కర్లను నియమించాలని తెలిపారు. ఎన్నికల పోలింగ్ కేంద్రాల లోపలికి సెల్ ఫోన్లను అనుమతించకూడదని ఆయన తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలన్నారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించుటకు అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్ లు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఎన్నికల నిర్వహణకు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ల కు సూచించారు. పోలింగ్ సామాగ్రితో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రాలకు వెళ్లేటప్పుడు, పోలింగ్ ముగిసాక బ్యాలెట్ బాక్స్ లతో రిసెప్షన్ సెంటర్ కు వచ్చేటప్పుడు బందోబస్తుతో రావాలని అన్నారు. ఓటర్ల గుర్తింపు కార్డులు లేదా భారత ఎన్నికల సంఘం సూచించిన 11 గుర్తింపు కార్డులలో ఏదేని ఒకటి పరిశీలించాకే ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని తెలిపారు. పోలింగ్ అధికారులు ఇచ్చే వయోలెట్ పెన్నుతోనే బ్యాలెట్ పేపర్ పై ప్రాధాన్యత క్రమంలో అంకెలు వేసేలా ఓటర్లకు చెప్పాలని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని ఏఎన్ఎం లను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈనెల 14వ తేదీన జరిగే కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ బి.కె. రాహుల్ హెగ్డే, ఇంచార్జి జిల్లా రెవెన్యూ అధికారి టి. శ్రీనివాస రావు, జెడ్పి సిఇఓ గౌతం రెడ్డి, డీఎస్పీ చంద్రశేఖర్, తహశీల్దార్ విజయ్ కుమార్, మున్సిపల్ కమీషనర్ సమ్మయ్య, టౌన్ సీఐ అనిల్ కుమార్, రూరల్ సీఐ ఉపేందర్, స్పెషల్ బ్రాంచ్ సీఐ సర్వర్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post