స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్పరెన్సు : రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్

పత్రికా ప్రకటన.      తేది:10.11.2021. వనపర్తి.

పారదర్శకంగా స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, కార్యచరణ రుపొందించాలని, సంబంధిత అధికారులకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ ఆదేశించారు.
బుధవారం హైదరాబాద్ నుండి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్పరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం  షెడ్యుల్ విడుదల చేసిందని తెలిపారు. నవంబర్ 16వ. తేదీన ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆయన సూచించారు. నవంబర్ 16వ. తేది నుండి నవంబర్ 23వ. తేది వరకు నామినేషన్ల స్వీకరణ, నవంబర్ 24న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 26వ. తేదిలోపు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుందని, డిసెంబర్ 10న పోలింగ్, డిసెంబర్ 14న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు  సంబంధించి ఆదిలాబాద్, కరీంనగర్, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం, మెదక్,  రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారని ఆయన సూచించారు. రిటర్నింగ్ అధికారులు మిగిలిన జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ పకడ్భందిగా ఎన్నికలు నిర్వహించాలని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి 9 జిల్లాల పరిధిలో  ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుందని, దీన్ని పకడ్భందిగా అమలు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటర్లుగా ఎంపిటిసిలు, జడ్పీటిసిలు, కౌన్సిలర్లు, కార్పోరేటర్లు వ్యవహరిస్తారని ఆయన సూచించారు. పోలింగ్  నిర్వహణకు అనువైన కేంద్రాలను గుర్తించాలని, జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి, పోలింగ్ కేంద్రాల తుది జాబితాను పంపాలని ఆయన అధికారులను ఆదేశించారు.  ఉమ్మడీ జిల్లాల కలెక్టర్లు, జిల్లాల వారిగా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్  రిటర్నింగ్ అధికారుల జాబితా తయారు చేసి పంపాలని ఆయన అధికారులకు సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ తో నిర్వహిస్తామని, బ్యాలెట్ బాక్సులను సిద్దం చేసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలలో పకడ్భందిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలని ఆయన అన్నారు.
కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను జారీ చేసిందని, వాటిని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ సమయంలోను అమలు చేయాలని ఆయన తెలిపారు. హుజురాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల సమయంలో అమలు చేసిన విధి విధానాలను యథావిధంగా అమలు చేయాలని అధికారులకు ఆయన సూచించారు. భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ప్రచారం నిర్వహించాలని, అంతర్గత సమావేశాలకు 200 మంది, బహిరంగ ప్రదేశాలకు 500 మంది కంటే అధికంగా ప్రజలు హజరుకావద్దని ఆయన తెలిపారు. బైక్ ర్యాలీ, కార్ల ర్యాలీలకు అనుమతి ఉండదని, ఇంటి ఇంటి క్యాంపేయిన్ 5 మంది, వీడియో వ్యాన్ క్యాంపెయిన్ 50 మంది, 72 గంటల ముందుగానే ప్రచారం నిలిపివేయాలని అధికారులకు ఆయన సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించే సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి, కరోనా మార్గదర్శకాలపై అవగాహన కల్పించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి అధికారులకు ఆదేశించారు. ఎన్నికల సమయంలో నియమాలను పాటిస్తు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచారం చేసుకునే విధంగా వారికి ముందస్తుగా అనుమతులు జారీ చేసెందుకు అవసరమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పి) అపూర్వ రావు, జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
………….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయడమైనది.

Share This Post