స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలి – జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మరియు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అమోయ్ కుమార్

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మరియు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అమోయ్ కుమార్ తెలిపారు.

శుక్రువారం కలెక్టరేట్ లోని కోర్ట్ హాల్ లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ విషయమై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల ఆదేశాల మేరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రెండు స్థానిక ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీలు ఏర్పడబోతున్నాయని, వీటి ఎన్నికకు ఈ నెల 9వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసిందని తెలిపారు. అదేరోజు నుండి ఎన్నికల ప్రవర్తనా నియమావళి కూడా అమలులోకి వచ్చిందని వెల్లడించారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కు ఈ నెల 16న నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుందని ,23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24న నామినేషన్ల పరిశీలన, 26న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని, డిసెంబర్ 10న ఉదయం 8 నుండి సాయంత్రం 4 గంటల వరకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉంటుందని, డిసెంబర్ 14 న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు.
స్థానికి సంస్థల ఎంఎల్ సి ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు ఇదివరకే నోడల్ అధికారులను నియమించి సమావేశం కూడా నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాను ఈ నెల 15వ తేదీన ప్రచురించడం జరుగుతుందని, ఓటర్ల జాబితాపై 15 నుండి 20 వరకు అభ్యంతరాలను స్వీకరించి, 21, 22 తేదీలలో వాటిని పరిశీలించడం జరుగుతుందని,తుది జాబితాను ఈనెల 23న ప్రకటించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలిపారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో జరుగుతాయని, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఓటర్లుగా ఉంటారని తెలిపారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని, ఇవన్నీ కూడా ఆయా రెవెన్యూ డివిజన్ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం లేదా గుర్తించిన ఇతర కార్యాలయం ఏర్పాటు చేయడం జరుగుతుందని వెల్లడించారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి పై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 9వ తేదీ నుండి డిసెంబర్ 16 వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా ఏలాంటి బ్యానర్లు, పోస్టర్లు,ఫ్లెక్సీ లు ఉండరాదని ఆయన తెలిపారు.
ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే జడ్పిటిసి, ఎంపీటీసీలు,కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందర్నీ కలుపుకొని ప్రాథమికంగా 1302 ఉన్నట్లు గుర్తించడం జరిగిందని,పూర్తి జాబితాను త్వరలోనే తయారు చేయడం జరుగుతుందని వెల్లడించారు.

అన్నీ ఎన్నికల మాదారిగానే ఈ ఎన్నికలను కూడా సక్రమంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పక్షాలు జిల్లా ఎన్నికల అధికారికి పూర్తి సహకారం అందించాల్సిందిగా పునరుద్ఘాటించారు.
ఈ సందర్భంగా ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వివరాలు, ఓటర్లు, ఎన్నికల ప్రవర్తన నియమావళి తదితర అంశాల పైసందేహాలను నివృత్తి చేసుకున్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టరులు ప్రతీక్ జైన్, తిరుపతి రావు,డిఆర్ఓ హరిప్రియ, ఆర్డీఓలు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, బిజెపి, బిఎస్పి, పార్టీల తరఫున ఆ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Share This Post