స్థానిక సంస్థల నియోజక వర్గ ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాటు పూర్తి-జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరీష్

స్థానిక సంస్థల నియోజక వర్గ ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాటు పూర్తి-జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరీష్

మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగే మెదక్ స్థానిక సంస్థల నియోజక వర్గ ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాటు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరీష్ చెప్పారు. సోమవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో ఓట్ల లెక్కింపు అధికారులతో, అనంతరం తన ఛాంబర్ లో పార్టీ అభ్యర్థులు, ఏజెంట్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, ఓట్ల లెక్కింపుకు నాలుగు టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నామని, ఒక్కో టేబుల్ కు ముగ్గురు సిబ్బంది ఉంటారని, అభ్యర్థులు ఒక్కో టేబుల్ కు ఒక్కో ఏజెంట్ చొప్పున నియమించుకోవచ్చని, వారంతా మంగళవారం ఉదయం 7.30 వరకెల్లా రావలసి ఉంటుందని, వారి సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ నుండి బ్యాలట్ బాక్సులు కౌంటింగ్ కేంద్రానికి తీసుకెళ్తామని అన్నారు. పూర్తిగా కోవిడ్ నిబంధనలకనుగుణంగా నిర్వహించే కౌంటింగ్ లో అధికారులు బ్యాలెట్ బాక్సు అకౌంట్ ప్రకారం ప్రతి బ్యాలెట్ బాక్సు లో పోలైన ఓట్లు సరిగ్గా ఉన్నాయా అని ప్రాథమికంగా ఓట్ల లెక్కింపు చేసి సరి చూసిన తరువాత 25 బ్యాలట్ పేపర్ల చొప్పున బండిల్స్ కట్టి డ్రమ్ములో వేసి కలుపుతారని అన్నారు. అనంతరం ఎన్నికల అధికారి సమక్షంలో చెల్లుబాటు అయిన, చెల్లుబాటు కానీ ఓట్లను విడివిడిగా వేరు చేసి , చెల్లుబాటు అయిన ఓట్లను తిరిగి 25 బ్యాలట్ పేపర్ల చొప్పున బండిల్స్ కట్టి అన్ని టేబుళ్ళకు అభ్యర్థి వారీగా లెక్కింపు నిమిత్తం అందజేస్తారని అన్నారు. వారు అభ్యర్థి వారీగా ఏర్పాటు చేసిన ట్రె లలో బ్యాలట్ పేపర్లు వేసి లెక్కిస్తారని అన్నారు. వాలిడ్ ఓట్లలో సగం కన్నా ఒకటి ఎక్కువ వచ్చిన ఆ అభ్యర్థి విజేతగా పరిగణిస్తారని, ఒక వేళ అన్ని ప్రాధాన్యత ఓట్లు రాకపోతే తక్కువ ప్రాధాన్యత ఓట్లు వచ్చిన మూడవ అభ్యర్థిని ఎలిమినేట్ చేసి అతనికి రెండవ ప్రాధాన్యతగా వచ్చిన ఓట్లను ఇరువురు అభ్యర్థులకు కలిపి లెక్కించి విజేత అభ్యర్థిని ప్రకటించి ధ్రువపత్రం అందజేస్తామని అన్నారు. ఈ ప్రక్రియ మధ్యాన్నం 12 గంటల లోగా పూర్తి కావచ్చని హరీష్ తెలిపారు. అనంతరం బ్యాలట్ పేపర్లను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరుస్తామని అన్నారు. ఇదంతా వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల కమీషన్ పరిశీలిస్తుందని, కాబట్టి ఎంతో జాగరూకతో కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రధానంగా చెల్లుబాటు కానీ ఓట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అంకెల రూపంలో రాసిన ఓట్లే చెల్లు బాటు అవుతాయని, మొదటి ప్రాధాన్యత రాయకుండా 2, 3 ప్రాధాన్యతలు రాసిన, అక్షరాలలో రాసిన, లేదా క్రాస్ మార్కు, రైట్ టిక్కు మార్కు పెట్టినా చెల్లుబాటు కావని అన్నారు. అదేవిధంగా వైలెట్ కలర్ పెన్నుతో వేసిన ఓట్లే చెల్లుబాటు అవుతాయని అన్నారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, స్వీప్ నోడల్ అధికారి రాజి రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్, కౌంటింగ్ అధికారులు, ఎలక్షన్ సూపరింటెండెంట్ శైలేంద్ర, రాజకీయ పార్టీ అభ్యర్థి యాదవ రెడ్డి, ఏజెంట్ మామిళ్ళ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post