స్థానిక సంస్థల బలోపేతం దిశగా అధికారులు కృషి చేయాలి : జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

జిల్లాలో స్థానిక సంస్థల బలోపేతం దిశగా అభివృద్ధి పనుల కొరకు ప్రభుత్వం 8 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో అభివృద్ధి దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వొడపెల్లి గార్డెన్స్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన జిల్లా ప్రజా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మీ, శాసనమండలి సభ్యులు పురాణం సతీష్‌, జిల్లా అటవీ అధికారి శాంతారామ్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ స్థానిక సంస్థల బలోపేతం దిశగా అధికారులు కృషి చేయాలని, జిల్లా విద్యాశాఖ పరిధిలో జిల్లాలో జీతం తీసుకుంటూ డిప్యూటేషన్‌పై ఇతర జిల్లాలలో పని చేయుచున్న వారిని వెంటనే తిరిగి జిల్లాకు రప్పించడం జరుగుతుందని, జిల్లా ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యాధికారులు, సిబ్బంది హాజరు కొరకు బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ ఏర్పాటు చేసి నవంబర్‌ మాసం నుండి ప్రారంభించేలా చర్యలు తీసుకోవడంతో పాటు వెయిటింగ్‌ గదులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. 19 మందికి శిక్షణ ఇచ్చి త్వరలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పోస్టుల భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రజల సహాయ, సహకారాలతో పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్యంపై వారంలో రెండు రోజులు డైవ్‌ డే పాటించి వ్యాధులు ప్రబలకుండా పరిసరాల పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు జిల్లాలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం 100 శాతం పూర్తి చేసే అధికారులు దృష్టి సారించాలని తెలిపారు. జిల్లాలోని మోవాడ్‌ గ్రామానికి రోడ్డు నిర్మాణానికి గాను రోడ్డు-భవనాల శాఖకు చోర్‌పల్లి వరకు అటవీ అనుమతులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా కేంద్రంలోని జూబ్లీ మార్కెట్‌, సావిత్రి సామిల్‌ తరలింపు విషయంలో ప్రణాళికాబద్దంగా వ్యవహరించి చట్ట ప్రకారంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. శాసన మండలి సభ్యులు మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక ప్రాంతం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వానికి 140 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు పంపించడం జరిగిందని, జోడెఘాట్‌ ప్రాంతం అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం 25 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఆదివాసీల ఆరాధ్యదైవం కుమ్రంభీం విగ్రహంతో పాటు మ్యూజియం ఏర్పాటు చేయడం జరిగిందని, జోడెఘాట్‌లో పర్యాటకుల సౌకర్యార్థం కాటేజీలు ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు తయారు చేయడంతో పాటు హోటళ్ళ ఏర్పాటు కొరకు ప్రతిపాదనలు కేంద్రానికి పంపించడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి రత్నమాల, జెద్‌.పి.టి.సి.లు, ఎం.పి.పి.లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post