స్వచ్చతా ఫిల్మోకా అమృత్ మహోత్సవ్ పోటీల్లో ఔత్సాహికులు పాల్గొనాలి:: జిల్లా కలెక్టర్ కె. నిఖిల
జనగామ, ఆగష్టు 07, 2021: స్వచ్ఛత ఫిల్మో కా అమృత్ మహోత్సవంలో భాగంగా జాతీయ లఘు చిత్రాల పోటీల్లో ఔత్సాహికులు పాల్గొనాలని జిల్లా కలెక్టర్ కె. నిఖిల ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ త్రాగునీరు, పారిశుద్ధ్య శాఖ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించవడుతున్నట్లు ఆమె అన్నారు. ఈ లఘు చిత్రాలు గ్రామాలలో తడి, పొడి చెత్త నిర్వహణ, ప్లాస్టిక్, ద్రవ వ్యర్థాల నిర్వహణ, ప్రవర్తనలో మార్పు (ప్రేరణ) తీసుకొచ్చే విధానంకి సంబంధించి వుండాలన్నారు. గ్రామ పంచాయతీ నుండి గ్రామస్తులు, అధికారులు, సిబ్బంది, మహిళా సంఘాలు, స్వచ్చంద సంస్థలు, యువజన సంఘాలు, స్కూల్ విద్యార్థులు, టీచర్లు, ఔత్సాహికులు ఎవరైనా ఈ పోటీల్లో పాల్గొనవచ్చని కలెక్టర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమె చిత్రీకరణ చేయాలని, లఘు చిత్రాల్లో వాయిస్ ఓవర్స్, డైలాగ్స్, మ్యూజిక్, పాటలు చాలా స్పష్టంగా వుండాలని హిందీ, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ రావాలని ఆమె అన్నారు. పైన తెలిపిన అంశాలకు సంబంధించిన లఘు చిత్రాలు ఒకటి నుంచి ఐదు నిమిషాలలోపు నిడివి కలిగి ఉండాలని ఆమె అన్నారు. ఔత్సాహికులు తమ లఘు చిత్రాలను ఈ నెల 14 లోగా పంపాలని ఆమె అన్నారు. ఈ పోటీలలో ఉత్తమ చిత్రాలుగా ఎంపిక అయిన వాటికి మొదటి బహుమతి ఒక లక్ష 60 వేల రూపాయలు, మొదటి రన్నర్ కు 60 వేల రూపాయలు, రెండవ రన్నర్ కు 30 వేల రూపాయలు అందజేస్తారని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. మరింత సమాచారం కోసం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, స్వచ్ఛ భారత్ విభాగం జిల్లా కో-ఆర్డినేటర్ కరుణాకర్ ను 9121221928 నెంబర్ ద్వారా సంప్రదించవచ్చని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారీ చేయనైనది.