స్వచ్ఛతా ఫిల్మోన్ కా అమృత్ మహోత్సవ పేరట జాతీయ లఘు చిత్రాల పోటీ- అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

పల్లెలలో స్వచ్ఛతపై పోటీ పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛతా ఫిల్మోన్ కా అమృత్ మహోత్సవ పేరట జాతీయ లఘు చిత్రాల పోటీని నిర్వహిస్తున్నదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ నేడొక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలను భారత ప్రభుత్వ తాగునీరు, పారిశుధ్య శాఖ నిర్వహిస్తున్నదని అన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్-గ్రామీన్ రెండవ దశ క్రింద ప్రజలలో జీవ వ్యర్థ పదార్థాల నిర్వహణ, వర్మీ కంపోస్ట్, ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు నిర్వహణ, ద్రవ్య వ్యర్థాల నిర్వహణ, బహిరంగ మల విసర్జన , వ్యక్తిగత పరిశుభ్రతపై వ్యక్తుల ప్రవర్తనలో మార్పు తదితర అంశాలపై అవగాహన కలిగించడంతో పాటు గ్రామాభివృద్ధి వంటి ఆరు అంశాల నేపధ్యవర్గం లో లఘు చిత్రాలు రూపొందించవలసి ఉంటుందని ఆమె సూచించారు. అదేవిధంగా భౌగోళిక పరంగా ఎడారి ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, తీర ప్రాంతాలు, మైదానాలు, వరద పీడిత ప్రాంతాల లో సంపూర్ణ స్వచ్ఛతా కార్యక్రమంలో భాగంగా ఘన, ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణకు సంబంధించి చేపట్టిన వినూత్న కార్యక్రమాలపై లఘు చిత్రాలు రూపొందించాలని అన్నారు.
రెండు క్యాటగిరీలలోని 11 అంశాలకు సంబంధించి ఒక నిమిషం నుండి 5 నిమిషాలలోపు నిడివి గల లఘు చిత్రాన్ని పక్కా గ్రామీణ నేపథ్యంలోనే షూటింగ్ చేసి ఉండాలని ఆమె తెలిపారు. తెలుగు, హిందీ లేదా ఆంగ్లంలో రూపొందించిన వీడియో లో వాయిస్ ఓవర్, డైలాగ్స్, మ్యూజిక్ , పాటలు స్పష్టంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ లఘు చిత్ర పోటీలలో 10 ఏళ్ళు పై బడిన ప్రతి ఒక్కరు పాల్గొనుటకు అర్హులని ఆమె తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలోని సంస్థలు, గ్రామస్థులు, పంచాయతీ సిబ్బంది, మహిళా సంఘాలు, యెన్.జి.ఓ.లు తద్ధితరులు ఎవరైనా పాల్గొనవచ్చని ఆమె స్పష్టం చేశారు.
మొదటి క్యాటగిరిలోని ఆరు అంశాలకు గాను ప్రతి అంశంలో ఎంపిక చేసిన లఘు చిత్రానికి మొదటి బహుమతిగా ఒక లక్షా 60 వేలు, మొదటి రన్నరప్ కు 60 వేలు, రెండవ రన్నరప్ కు 30 వేల చొప్పున నగదు ప్రోత్సాహకం అందజేయబడుతుందని అన్నారు. అదేవిధంగా భౌగోళిక వర్గానికి సంబంధించి 5 అంశాలకు గాను ఒక్కో భౌగోళిక ప్రాంతానికి సంబంధించి ఎంపిక చేసిన లఘు చిత్రానికి మొదటి బహుమతిగా రెండు లక్షలు, మొదటి రన్నరప్ కు ఒక లక్షా ఇరవై వేలు, రెండవ రన్నరప్ కు 80 వేల చొప్పున నగదు ప్రోత్సాహకం అందజేయబడుతుందని ప్రతిమ సింగ్ తెలిపారు. ఆసక్తి గల జిల్లాకు చెందిన ఔత్సాహికులు పై నేపథ్యంలో లఘు చిత్రాలను రూపొందించి ఆగస్టు 15 లోగా https://innovateindia.mygov.in/sbmginnovation-challange వెబ్ సైట్ నందు అప్ లోడ్ చేయవలసినదిగా ఆమె సూచించారు. మరిన్ని వివరాలకు, సహకారం కోసం జిల్లా స్వచ్ఛ భారత సమన్వయ కర్తలు సంతోష్-9700323494 లేదా ఇలియాస్ -9652424761 నెంబరుకు సంప్రదించాలని ఆమె తెలిపారు

Share This Post