స్వచ్ఛత, పరిశుభ్రత విషయాల్లో జిల్లాను ప్రథమస్థానంలో నిలపాలి జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్

స్వచ్ఛత, పరిశుభ్రత విషయాల్లో జిల్లాను ప్రథమస్థానంలో నిలపాలి
జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాను స్వచ్చత, పరిశుభ్రత విషయాల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమంతో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, జలశక్తి అభియాన్, వాల్పెయింటింగ్ క్యాంపెయిన్, ఓడీఎఫ్, సముదాయక శౌచాలయ్ అభియాన్, ప్లాస్టిక్ మేనేజ్మెంట్, పరిశుభ్రత తదితర అంశాలపై డీఆర్డీఏ పీడీ, జడ్పీ సీఈవో, డీపీవో, మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్యాంసన్ మాట్లాడుతూ… జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం స్వచ్చత, పరిశుభ్రతతో పాటు ప్రభుత్వం చేపట్టే అన్ని రకాల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అర్హులైన వారందరికీ చేరేలా చూసే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రభుత్వం జిల్లాలో చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు ప్రత్యేక కమిటీ పర్యవేక్షించి పనితీరు ఆధారంగా ఆయా స్థానాలతో పాటు ర్యాంకులను కేటాయిస్తారని అదనపు కలెక్టర్ శ్యాంసన్ వివరించారు.
దీనిని దృష్టిలో ఉంచుకొని గ్రామస్థాయి అధికారుల నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఒక ఛాలెంజ్గా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే పరిశుభ్రత పాటించేలా చూడాలని ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద కనీస పని రోజులను కల్పిస్తున్నందున అర్హులైన వారికి ఉపాధి హామీ పథకం కింద పని కల్పించాలని అధికారులకు సూచించారు. జిల్లా స్థాయి అధికారులు, మండల ప్రత్యేక అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకొంటూ సమస్యలు లేకుండా చూడాలని అదనపు కలెక్టర్ శ్యాంసన్ వివరించారు. ఈ సమావేశంలో డీఆర్డీఏ పీడీ, జడ్పీ సీఈవో, డీపీవో, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post