ప్రచురణార్ధం
మహబూబాబాద్, ఆగస్ట్ – 15:
స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తిని కొనసాగిస్తూ వారి ఆశయాల బాటలో జిల్లా ప్రగతి ప్రయాణం కొనసాగించాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
సోమవారం భారత స్వాతంత్ర వేడుకలను అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా జిల్లాలో ఘనంగా నిర్వహించారు.
ఉదయం 10-30 గంటలకు స్థానిక ఎన్.టి.ఆర్. స్టేడియంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఎం.పి. మాలోతు కవిత, ఎమ్మేల్యే శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ కె. శశాంక, ఎస్పీ శరత్ చంద్ర పవార్ లతో కలిసి జాతీయ పతాకావిష్కరణ గావించారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లా పోలీసు శాఖ పరేడ్ కమాండర్ నుండి గౌరవ వందనం స్వీకరించారు.
మంత్రి మాట్లాడుతూ, జిల్లాలో నలుదిశలా అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, పల్లెలు పట్టణాలు పచ్చదనం జలకళతో విరాజిల్లు తున్నాయని, నూతన లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ లు అందించడం జరుగుతుందని, జిల్లా అభివృద్ధిలో ప్రజలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు సమిష్టి కృషితో నూతనంగా ఏర్పాటు చేసుకున్న జిల్లాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు.
స్వాతంత్య్రం పొంది 75 వసంతాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.సి.ఆర్. నిర్ణయించి యావత్ ప్రజలను స్వాతంత్ర్య పోరాట యోధులను స్మరిస్తూ, వారి స్ఫూర్తితో ప్రగతి ప్రయాణం కొనసాగించాలని, కొత్తతరం వారికి స్వాతంత్య్ర పోరాట ఘటనలు తెలియ చేయాలని, వారిలో దేశభక్తి జాతీయ సమైఖ్యతా భావాలు పెంపొందించుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను అద్భుతంగా నిర్వహించుకోవడం జరుగుతున్నదని తెలిపారు.
గత ఎనిమేదేళ్లుగా అన్ని వర్గాల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలుపు తున్నాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాగా ఏర్పాటు చేసుకొని, ఏరియా వైద్యశాలను జిల్లా వైద్యశాలగా అప్ గ్రేడ్ చేసుకున్నామని, అలాగే ప్రభుత్వ వైద్య, నర్సింగ్ కళాశాలలను మంజూరు చేసుకొని ప్రస్తుత 100 పడకల జిల్లా వైద్యశాలను 330 పడకల ప్రభుత్వ సాధారణ వైద్యశాలగా అప్ గ్రేడ్ చేసుకున్నామని, నూతన ప్రభుత్వ వైద్యశాల కొరకు 40 కోట్లు మంజూరి చేయడం జరిగిందని తెలిపారు.
గడచిన 4 నెలలలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు 55 శాతం నుండి 67 శాతం వరకు వృద్ధి అయినాయని, సిజేరియన్ ప్రసవాలు 6 శాతం వరకు తగ్గాయన్నారు. గర్భిణీ స్త్రీలకు ఆర్ధిక, ఆరోగ్య ప్రోత్సాహకములతో పాటు సుఖ ప్రసవం జరుగుట కొరకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కె.సి.ఆర్. కిట్ ను ప్రారంభించిన తర్వాత నెలకు సుమారు 300 పై చిలుకు ప్రసవాలు జరుగుతున్నాయని, తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ ద్వారా 56 పరీక్షలను ప్రజలకు ఉచితంగా చేస్తున్నామన్నారు. కోవిడ్ నియంత్రణలో భాగంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, జిల్లా ఆసుపత్రిలో కోవిడ్ టీకాలు, బూస్టర్ డొస్ లుఇస్తున్నామని తెలిపారు.
మన ఊరు మన బడి, మన బస్తీ ద్వారా జిల్లాలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో మొదటి దశలో 316 పాఠశాలలను ఎంపిక చేసి పిల్లల సౌకర్యార్ధం సౌకర్యాలు కల్పించుటకు చర్యలు తీసుకొని, మెరుగైన విద్యను అందిస్తున్నామని తెలిపారు.
ప్రొఫేసర జయశంకర్ బడి బాట, వ్యవసాయ శాఖ, రైతు బంధు, రైతు భీమా, రైతు వేదికలు, ఉద్యాన, పట్టు పరిశ్రమ, పశువైద్య, పశు సంవర్ధక శాఖ, తదితర శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ వివరాలను ఈ సందర్భంగా తెలిపారు.
అనంతరం స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. జిల్లాలోని స్వాతంత్ర్య సమరయోధుల సేవలను గుర్తు చేస్తూ వారి సేవలను కొనియాడుతూ, పోరాట పటిమలను గుర్తు చేస్తూ రాపర్తి యాదగిరి, సింగు సత్యాన్న, నూకల లింగారెడ్డి, నూకల దామోదర్ రెడ్డి, ఆరె పెళ్లి చంద్రన్న లకు శాలువాలు కప్పి వారిని మంత్రి, కలెక్టర్, ఎస్పీలు ఘనంగా సన్మానించారు.
జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా, పోలీస్ శాఖ కళాకారులు పాటలు పాడారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కేజీబీవీ లు బయ్యారం, తొర్రూర్, నర్సింహులపేట, విద్యా భారతి హై స్కూల్ జమండ్లపల్లి, సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హైస్కూల్, మహబూబాబాద్, హెల్త్ డిపార్ట్మెంట్ ఆశా కార్యకర్తలు, పోలీస్ కళాబృందం కళారూపాలు ఏర్పాటు చేయగా దేశభక్తిని చాటే విధంగా చిన్నారులు చేసిన ప్రదర్శనలు ఆకర్షణీయంగా బాగున్నాయని, ప్రతిభ కనపరిచిన చిన్నారులైన కేజీబీవీ బయ్యారం, విద్యా భారతి , సోషల్ వెల్ఫేర్ లకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సేవలు, సంక్షేమ అభివృద్ధి పథకాలపై ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శనను వీక్షించి, శకటాల ప్రదర్శన అబ్బురపరిచే విధంగా ఉన్నాయనీ కొనియాడారు. ఉమెన్స్ చైల్డ్ వెల్ఫేర్, ఐ సి డి ఎస్ , డి ఆర్ డి ఎ , ఎస్సీ కార్పొరేషన్ శకటాలకు ఎంపిక కాగా సర్టిఫికేట్ ప్రధానం చేశారు.
నూతనంగా జిల్లాలో అందిస్తున్న వివిధ రకాల ఆసరా పెన్షన్ దారులకు గుర్తింపు కార్డ్ లను, చెక్కులను వారికి అందజేశారు.
వివిధ శాఖలలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు అవార్డులు అందజేసారు. చివరగా వివిధ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ లను మంత్రి సందర్శించారు. వ్యాఖ్యాతగా వ్యవహరించిన గార్ల ఎం.పి.డి. ఓ. రవీందర్ కు ప్రశంసా పత్రం అందజేశారు.
ఉదయం 9 గంటలకు కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో, 9-30 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక పతాకావిష్కరణ గావించి జిల్లా అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్.టి.ఆర్. స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎం.పి. మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, జెడ్పి చైర్ పర్సన్ అంగోతు బింధు, మునిసిపల్ చైర్మన్ పాల్వాయి రాం మోహన్ రెడ్డి, అదనపు కలెక్టర్ లు అభిలాష్ అభినవ్, అదనపు కలెక్టర్ ఎం డేవిడ్, ఏ ఎస్పీ యోగేష్ గౌతమ్, వైస్ చైర్మన్ ఫరీద్, ఆర్డిఓ కొమురయ్య, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది విద్యార్థినీ, విద్యార్థులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.