పత్రిక ప్రకటన–1 తేదీ : 09–08–2021
=======================================
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సమన్వయంతో విజయవంతమయ్యేలా చూడాలి
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని అధికారులందరి సహకారంతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి విజయవంతమయ్యేలా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి అన్నారు.
సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ శ్యాంసన్తో కలిసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలపై జిల్లాలోని ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల విషయంలో ప్రభుత్వం నుండి మార్గదర్శకాలు మరికొన్ని రావాల్సి ఉందని అంతకు ముందే జిల్లాలో ఏర్పాట్లపై అందరూ అధికారులు సిద్దంగా ఉండాలని తెలిపారు. అలాగే కరోనా నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా జిల్లా కలెక్టరేట్ ప్రాంగణం ఆవరణలోనే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నామని అందుకు అనుగుణంగా వేదిక, బ్యారీకేడ్లు, కలెక్టరేట్ బయటికి, లోపలికి వెళ్ళేదారిని ఇబ్బందులు లేకుండా బాగు చేయించాలని అధికారులకు సూచించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు వచ్చే అతిధికి పోలీస్ గౌరవ వందనంతో పాటు బందోబస్తు ఏర్పాట్లను చూడాలని పోలీస్ శాఖ కి సూచించినారు ,పట్టణమంతా శుభ్రంగా ఉండేలా చూడాలని, రోడ్ల వెంట ముళ్ల పొదలను తొలగించాలని, మైదానంలో వాటరింగ్ చేయాలని డి పి ఓ అధికారులను ఆదేశించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు వచ్చే అతిధి ప్రసంగించే చోటుతో పాటు వేదిక వద్ద రంగురంగుల పూలతో అలంకరించాలని ఉద్యానవన శాఖ అధికారులకు తెలిపారు. దీంతో పాటు ఆరోజున విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ట్రాన్స్కో అధికారులకు తెలిపారు. కార్యక్రమానికి హాజరయ్యే అతిధితో పాటు అందరికీ వినిపించేలా మైక్, సౌండ్ బాక్సులను ఏర్పాటు చేయాలని ఐ &పి ఆర్ అధికారులకు వివరించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను మొత్తం మీద అన్ని శాఖల అధికారులు తమకు అప్పగించిన పనులను పూర్తి చేసేలా, వేడుకలు విజయవంతంగా నిర్వహించి విజయవంతం చేయాలని తెలిపారు. జాతీయ పతాకావిష్కరణ, పోలీసుల గౌరవ వందనం అనంతరం కలెక్టరేట్ ఆవరణలో స్టాల్స్ను ఏర్పాటు చేసేందుకుగాను వ్యవసాయ, మహిళా, శిశు సంక్షేమ శాఖ, ఉద్యానవనశాఖ, గ్రామీణాభివృద్ది శాఖ, వైద్య, ఆరోగ్యశాఖ, పశు సంవర్ధక, మత్స్య శాఖ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేసుకొని అందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులచే దేశభక్తిని పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనబరచిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందచేసేందుకు అన్ని శాఖల అధికారుల వివరాలు సిద్ధంగా ఉంచాలని కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లుకు అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.