పత్రికా ప్రకటన తేది:19.7.2021
వనపర్తి.
పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిందని, త్వరితగతిన లక్ష్యం సాధించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో హరితహారంపై సంబంధిత అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లా కు 26 లక్షల 78 వేల మొక్కలను నాటేందుకు లక్ష్యం నిర్దేశించడం జరిందని, ఆదివారం వరకు (50%) 13 లక్షల 44 వేల మొక్కలను నాటడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. పెండింగ్ లో ఉన్న మొక్కలను ప్రతి ఇంటికి ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేయాలని సంబంధిత అధికారులకు ఆమె సూచించారు.
కళాశాలలు, వసతి గృహాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల ఆవరణల్లో మొక్కలు నాటాలని ఆమె అన్నారు. హరితహారం కింద పంపిణీ చేసే మొక్కలలో మునగ, కరివేప, బొప్పాయి, అలోవెరా మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆమె తెలిపారు. అదే విధంగా నాటిన ప్రతి మొక్కలు ఆన్ లైన్ లో నమోదు చేయాలని, వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, మొక్కల సంరక్షణ బాధ్యత చేపట్టాలని అధికారులకు ఆమె సూచించారు. ఈ వారంలో వర్షాలు మొదలయ్యే క్రమంలో మొక్కలు నాటినట్లయితే సత్ ఫలితాలను ఇస్తుందని జిల్లా కలెక్టర్ వివరించారు.
శ్రీరంగాపురంలోని శ్రీ రంగనాయక స్వామి దేవాలయం ఆవరణలో మొక్కలు నాటాలని ఆమె సూచించారు. అదేవిధంగా జిల్లాలోని ప్రభుత్వ ఖాళీ స్థలాలలో మొక్కలు పెంచి అందంగా ఉండేందుకు చర్యలు చేపట్టాలని, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) అంకిత్, జిల్లా అటవీశాఖ అధికారి రామకృష్ణ, డి.ఆర్.డి.ఓ. నరసింహులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
………………….
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.