*హరితహారం లక్ష్యం నిర్దేశించడానికి ప్రభుత్వ శాఖల వారీగా వివరాలు సమర్పించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

*హరితహారం లక్ష్యం నిర్దేశించడానికి ప్రభుత్వ శాఖల వారీగా వివరాలు సమర్పించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

*ప్రచురణార్థo-2
*నాటిన ప్రతీ మొక్క సంరక్షించేలా తగిన చర్యలు చేపట్టాలి*

రాజన్న సిరిసిల్ల, జనవరి 10: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా 2022-23 సంవత్సరానికి సంబంధించి జిల్లా యొక్క లక్ష్యం నిర్దేశించుటకు గాను ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో అటవీ శాఖ అధికారులు, వివిధ ప్రభుత్వ విభాగాల శాఖల జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రానున్న 8 వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లా యొక్క లక్ష్యం నిర్దేశించడానికి డీఆర్డీఏ, నీటి పారుదల, మున్సిపల్, పంచాయితీ, సంబంధిత ప్రభుత్వ శాఖల పరిధిలో ఎన్ని మొక్కలు పెంచడానికి అవకాశం ఉన్నదో అట్టి వివరాలను సమర్పించాలని అన్నారు. రెండు రోజుల్లోగా ఈ వివరాలను సంబంధిత శాఖలు సమర్పించాలని, వాటిని జిల్లా యొక్క లక్ష్యం కింద లెక్కచేయడం జరుగుతుందని అన్నారు. ఇప్పటివరకు 7 విడతల్లో భాగంగా నాటిన మొక్కల్లో ఏవైనా చనిపోయి ఉంటే వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటాలని సూచించారు. అవెన్యూ ప్లాంటేషన్ లో రోడ్లకు ఇరువైపులా భాగంగా నాటిన మొక్కలను పరిశీలించి, ఎక్కడైనా మొక్కలు లేకపోతే వాటి స్థానంలో కొత్తవి వచ్చే విడతలో నాటాలని అన్నారు. నాటిన ప్రతీ మొక్క సంరక్షించేలా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

*కార్మికులందరినీ ఈ-శ్రమ్ పోర్టల్ లో నమోదు చేయాలి :: జిల్లా కలెక్టర్*
జిల్లాలో అసంఘటిత రంగాల్లో పని చేస్తున్న కార్మికులందరూ కేంద్ర ప్రభుత్వ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ద్వారా చేపట్టబడుతున్న ఈ-శ్రమ్ పోర్టల్ లో నమోదయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఉపాధి హామీ పనులు చేసేవారు, చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, ఉద్యానవన పనివారు, నర్సరీలు, పాడి పరిశ్రమ కార్మికులు, ఉమ్మడి వ్యవసాయదారులు, మత్స్య కార్మికులు, భవన, భవన అనుబంధ రంగాలలో పనిచేసేవారు, తాపీ మెస్త్రీలు, రాళ్లు కొట్టేవారు, సెంట్రింగ్, రాడ్ బెండింగ్, ప్లంబింగ్, సానిటరీ, పెయింటర్స్, టైల్స్, ఎలక్ట్రీషియన్స్, వెల్డింగ్, ఇటుక, కాంక్రీట్ మిక్సింగ్, బావుల త్రవ్వడం, చేనేత కార్మికులు, వడ్రంగులు, వార్తా పత్రికల విక్రేతలు, పాల కార్మికులు, ఆశ, అంగన్వాడీ కార్మికులు, రిక్షా కార్మికులు, వీధి వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, పశు సంరక్షక కార్మికులు, చిన్న వర్తకులు, బీడీ రోలింగ్ కార్మికులు మొదలగు వారందరు నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ పధకంలో నమోదు చేసుకున్న ప్రతి కార్మికునికి ప్రధానమంత్రి సురక్షా భీమా యోజన (PMSBY) క్రింద 2 లక్షల రూపాయల ప్రమాద భీమా/అంగవైకల్య భీమా ఒక సంవత్సరం పాటు ఉచితంగా కల్పించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ పథకంలో చేరడానికి 16 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు వయస్సు ఉండి, ఆదాయపు పన్ను చెల్లించని వారు, ఇపీఎఫ్, ఇఎస్ఐ సదుపాయం లేని కార్మికులు అర్హులని ఆయన అన్నారు. ఇట్టి పథకం అన్ని సి.ఎస్.సి. కేంద్రాల్లో ఉచిత నమోదుతో పాటు, స్మార్ట్ ఫోన్ ద్వారా register.eshram.gov.in వెబ్ సైట్ ద్వారానూ నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. పథకంలో నమోదు ద్వారా ప్రతి అసంఘటిత కార్మికునికి 12 అంకెల ప్రత్యేక గుర్తింపు కార్డ్ (UAN) ఇవ్వడం జరుగుతుందని, ఈ కార్డుతోనే ప్రభుత్వం అందించే అన్ని రకాల సామాజిక భద్రత పధకాలు, వివిధ సంక్షేమ పథకాలు వర్తింపజేయడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

*ఉచిత సహాయ పరికరాలు అందించేందుకు నిర్వహించబోయే క్యాంపులను దివ్యాంగులు, వయోవృద్ధులు సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్*

జిల్లాలో దివ్యాంగులు, వయోవృద్ధులకు ఉచిత ఉపకరణాలు, సహాయ పరికరాలను అందించేందుకు గాను జిల్లాలో ఈ నెల 17 వ తేదీ నుండి 25 వ తేదీ వరకు నిర్వహించబోయే క్యాంపులను జిల్లాలోని దివ్యాంగులు, వయోవృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. ఇందులో భాగంగా దివ్యాంగులకు చేతికర్రలు, వినికిడి యంత్రాలు, మూడు చక్రాల సైకిల్, ఎంఎస్ఐడి కిట్ ,స్మార్ట్ చేతి కర్ర ,కృత్రిమ అవయవాలు, బ్యాటరీ ఆపరేటడ్ మోటారైజ్డ్ ట్రై సైకిళ్లు, అలాగే 60 సంవత్సరాలు నిండిన వయోవృద్ధులకు చేతికర్రలు వీల్ చైర్స్, వాకర్స్, వాష్రూమ్ వీల్ చైర్, నడుము పట్టి ,మెడపట్టి, కంటి అద్దాలు, వినికిడి యంత్రాలు, ఫుట్ కేర్ యూనిట్, వాకింగ్ స్టిక్ విత్ సెట్, కృత్రిమ దంతాలు, నీ బ్రేస్, రోలెటర్ విత్ బ్రేక్ అందజేయడం కోసం అర్హులైన వారిని గుర్తించేందుకు ఈ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని, 17 వ తేదీ బోయినిపెల్లి రైతు వేదిక, 18 వ తేదీ ఇల్లంతకుంట రైతు వేదిక, 19 నుండి 21 వ తేదీ వరకు వేములవాడ పట్టణంలోని సినారె కళామందిర్, 22 నుండి 25 వ తేదీ వరకు సిరిసిల్ల పట్టణంలోని సినారె కళామందిర్ లో ఇట్టి క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సదరం వైద్య ధ్రువీకరణ పత్రం లేదా ఏదైనా వైద్యుడు ఫిజిషియన్ ఇచ్చిన 40 శాతం వైకల్యం మించినట్లు ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, రెండు ఫోటోలు తీసుకుని క్యాంపులకు వెళ్ళాలని కలెక్టర్ సూచించారు. దీనికి సంబంధించి తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారిని బాలామణి, వేములవాడ ఆర్డీఓ వి. లీల, డీఆర్డీఓ కె. కౌటిల్య, డీపీఓ రవీందర్, మున్సిపల్ కమీషనర్లు సమ్మయ్య, శ్యామ్ సుందర్ రావు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, టౌన్ ప్లానింగ్ అధికారులు అన్సార్, అంజయ్య, సహాయ లేబర్ అధికారి రఫీ తదితరులు పాల్గొన్నారు.

Share This Post