హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలి:: జిల్లా కలెక్టర్ కె. నిఖిల

హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలి:: జిల్లా కలెక్టర్ కె. నిఖిల

జనగామ, ఆగస్టు 25: ఈ నెల 28 కల్లా తెలంగాణ కు హరితహారం క్రింద శాఖల వారీగా నిర్దేశిత లక్ష్యాన్ని ఆన్లైన్ నమోదుతో సహా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె. నిఖిల అన్నారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులు, ఎంపిడివోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులతో హరితహారం, సెగ్రిగేషన్ షెడ్లు, బృహత్ ప్రకృతి వనాలు, మినీ పల్లె ప్రకృతి వనాలు, పాఠశాలల పునఃప్రారంభంపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాకు ఈ సంవత్సరం 33 లక్షల 58 వేల మొక్కలు నాటుటకు లక్ష్యం నిర్దేశించినట్లు, ఇట్టి లక్ష్యాన్ని వివిధ శాఖల ద్వారా సాధించుటకుగాను ఆయా శాఖలకు లక్ష్యం ఇచ్చి పూర్తికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. లక్ష్యం చేరుకొనని శాఖలు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. మొక్కలు నాటడం లక్ష్యానికి చేరువలో ఉన్నప్పటికీ ఆన్లైన్ నమోదులు పూర్తి స్థాయిలో చేయలేదని, వెంటనే పూర్తి చేయాలని అన్నారు. వాచ్ అండ్ వార్డ్ చెల్లింపులు వెంట వెంటనే పూర్తి చేయాలన్నారు. సెగ్రిగేషన్ షెడ్లు అన్నిటిని పూర్తి స్థాయిలో వాడుకలో తేవాలని, నివేదికల మేరకు క్లస్టర్ కు ఒక ప్రత్యేక అధికారిని నియమించి సెగ్రిగేషన్ వాడుకను తనిఖీ చేయించనున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ రిజిస్టర్లు, వర్క్ ఫైళ్లు, జాబ్ కార్డులు, వర్క్ సైట్ బోర్డులు అప్ డేట్ ఉండాలన్నారు. గ్రామంలోని ప్రభుత్వ సంస్థల పారిశుద్ధ్య బాధ్యత సంబంధిత గ్రామ పంచాయతీదేనని కలెక్టర్ తెలిపారు. పాఠశాలల పునఃప్రారంభం దృష్ట్యా ఈ నెల 30 లోగా అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలు, వసతిగృహాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు. విద్యా సంస్థల ఆవరణలో పిచ్చి మొక్కల తొలగింపు, నిల్వ నీటి తొలగింపు, నీటి ట్యాoకుల శుభ్రం, నీటి పైపుల లీకేజీలు అరికట్టడం చేయాలన్నారు. పరిసరాల్లో ఎక్కడా నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. దోమల నియంత్రణకై ఫాగింగ్, యాంటీ లార్వా చర్యలు, ఈగల నియంత్రణకు మందుల పిచికారి చేయాలన్నారు. తరగతి గదులన్నీ సోడియం హైపోక్లోరైడ్ తో శుభ్రపరచడం చేయాలన్నారు. టాయిలెట్లు, వంటగదుల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా లేకుంటే, వెంటనే సంబంధిత ఏఇని సంప్రదించి సరఫరాకు చర్యలు చేపట్టాలన్నారు. చిన్న చిన్న మరమ్మతులకు గ్రామ పంచాయతీ నిధులను వినియోగించాలన్నారు. విద్యా సంస్థల పారిశుద్ధ్యం ప్రతిరోజూ చేపట్టాలని, విద్యా సంస్థల పారిశుద్ధ్యంపై ప్రతిరోజూ నివేదిక సమర్పించాలని కలెక్టర్ తెలిపారు. ప్రయివేటు విద్యా సంస్థల యాజమాన్యం పారిశుద్ధ్య చర్యలు చేపడుతోంది, లేనిది అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు ప్రతి మండలంలో స్థలాన్ని గుర్తించినట్లు, స్థల చదును తదితర పనులు ప్రారంభించాలన్నారు. ప్రతి మండలంలో 5 కి తక్కువ కాకుండా 5 ఎకరాల స్థలాన్ని తహసీల్దార్ తో సమన్వయం చేసుకొని స్థలాన్ని గుర్తించి మినీ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు నివేదికను సమర్పించాలన్నారు. లక్ష్య సాధనలో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని కఠిన చర్యలుంటాయని కలెక్టర్ అన్నారు. సమర్థవంతంగా పర్యవేక్షణ చేసి, లక్ష్యాల పూర్తికి చర్యలు తీసుకోవాలని, పర్యవేక్షణ లోపంపై అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్, డిఆర్డీవో జి. రాంరెడ్డి, డిపివో కె. రంగాచారి, జెడ్పి సిఇఓ ఎల్. విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post