హరితహారం లో భాగస్వాములు కావాలి, పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

జిల్లాలో తెలంగాణకు హరితహారం కార్యక్రమం కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించడంతో పాటు, పూర్వ వైభవాన్ని తీసుకువచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించి ఆ దిశగా పనులు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం రోజున నేరడిగొండ, ఇచ్చోడ మండలాల్లోని జాతీయ రహదారులు, గ్రామాలలో మొక్కలను నాటి, జాతీయ రహదారికి ఇరువైపులా మల్టి లేయర్ క్రమంలో నాటుతున్న మొక్కల పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, 44 వ నంబర్ జాతీయ రహదారి జిల్లాలో 85 కిలో మీటర్ల మేర విస్తరించి ఉందని, గతంలో హరితహారం కార్యక్రమం కింద మొక్కలు నాటి సంరక్షించడం జరిగిందని తెలిపారు. గతంలో నాటిన మొక్కలు చనిపోయిన, వంగిపోయిన వాటి స్థానంలో కొత్తగా 38542 మొక్కలు నాటడానికి చర్యలు చేపట్టడం జరిగి, ఇప్పటి వరకు సుమారు 30 వేల వరకు గుంతలు తవ్వి పెద్ద మొక్కలు నాటుతున్నామని తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాలలో కూలీలలకు గుంతలు తవ్వే పనులను అప్పగించి నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు. ఇందులో మున్సిపల్ పరిధిలో సుమారు 16200 మొక్కలు నాటడం జరుగుతున్నదని వివరించారు. ఆదిలాబాద్ అడవుల జిల్లాగా పేరు గాంచిందని, జిల్లాలో అడవులను, పచ్చదనాన్ని సంతరించుకొని పూర్వ వైభవాన్ని తీసుకువచ్చే విధంగా ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజల సహకారంతో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. జాతీయ రహదారికి ఇరువైపులా మల్టి లేయర్ పద్దతిలో మొక్కలు నాటుతూ, సాంకేతిక పరమైన సలహాలు, సూచనలు, అటవీ శాఖ అధికారుల ద్వారా క్షేత్ర సిబ్బందికి అవగాహన కల్పిస్తూ పనులు చేపడుతున్నామని తెలిపారు. అనంతరం ఆరవెల్లి జాతీయ రహదారికి ఇరువైపులా ఉపాధి హామీ కూలీలు గుంతల తవ్వకం పనులను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం నేరడిగొండ పల్లె ప్రకృతి వనంలో కలెక్టర్ మొక్కలను నాటారు. ప్రకృతి వనంలో సంరక్షిస్తున్న మొక్కల వివరాలను, సాంకేతిక సలహాలు అందించాలని జిల్లా అటవీ శాఖ అధికారి కి సూచించారు. ఈ సందర్బంగా జిల్లా అటవీ అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ, ప్రకృతి వనంలో ఒకే విధమైన మొక్కలను నాటడం సరికాదని, ఈ ప్రాంతంలో నెల స్వభావాన్ని బట్టి రావి, మర్రి, దువ్వి వంటి మొక్కలను నాటడం వలన శాశ్వతమైన ఎదుగుదల ఏర్పడుతుందని అన్నారు. మూడు లేయర్ లలో మొక్కలు నాటాలని సూచిస్తూ, మొదటి లైన్ లో సుమారు రెండు మీటర్ల ఎత్తు గల మొక్కలు, రెండవ లేయర్ లో నేరడి, జామ వంటి పండ్లనిచ్చే మొక్కలు, మూడవ లేయర్ లో వివిధ రకాల పూల మొక్కలను పెంచడం వలన పల్లె ప్రకృతివనం సుందరంగా తీర్చిదిద్దవచ్చని అన్నారు. మొక్కల ఎదుగుదలకు పనికి రాని కొమ్మలను కట్ చేయాలనీ సూచించారు. తద్వారా మొక్కలు సుందరంగా కనపడుతాయని వివరించారు. కొమ్మలు కట్ చేసే విధాన్ని అటవీ శాఖ సిబ్బంది ప్రత్యక్షంగా నిర్వహించారు. పల్లె ప్రకృతి వనం సమీపం లోని అటవీ క్షేత్రం పరిధిలోని చెక్ డ్యామ్ ను పరిశీలించి తగిన సహకారం అందించాలని గ్రామస్తులు కోరగా, కావలసిన సహకారం అందించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిని ఆదేశించారు. అనంతరం జాతీయ రహదారి నుండి కోకాస్ మన్నూర్ గ్రామానికి వెళ్లే రహదారికి ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమం లో భాగంగా కలెక్టర్ మొక్కలను నాటారు. ఇచ్చోడ మండలం కోకాస్ మన్నూర్ గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని, స్మశాన వాటికలు నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమం లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులు, గ్రామస్థాయి అధికారులు, సర్పంచ్ లు, ఎంపీపీలు, జడ్పీటీసీ లు, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….  జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post