హారితహారం లక్ష్యసాధనకు ప్రణాళికలు సిద్ధం చేయాలి…. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్
రాష్ట్రంలోని అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద, కాలువ గట్లపై పచ్చదనం పెంపు, అటవీ విస్తీర్ణం పెంచడమే ఎనిమిదవ విడత హరితహారం ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పేర్కొన్నారు.
8వ విడత హరితహారం ముందస్తు ప్రణాళిక పై శుక్రవారం సోమేష్ కుమార్ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ వర్షాకాలంతో 8వ విడత హరితహారం ప్రారంభమౌతుందని, అందుకు తగిన విధంగా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఈసారి 19.54 కోట్ల మొక్కలను రాష్ట్ర వ్యాప్తంగా నాటడం లక్ష్యంగా నిర్దారించినట్లు సీ. ఎస్ వెల్లడించారు.
అన్ని సాగునీటి ప్రాజెక్టులు, కాలువ గట్ల వెంట పచ్చదనం పెంచటం అత్యంత ప్రాధాన్యతా అంశమని, ఇందు కోసం వారం లోగా యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు.
అన్ని రహదారుల వెంట మల్టీ లెవల్ అవెన్యూ ప్లాంటేషన్ ను అభివృద్ధి చేయాలని సూచించారు. లక్ష్యం మేరకు అవసరమైన మొక్కలను అందుబాటులో పెట్టుకోవాలన్నారు.
పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపు కోసం ప్రతీ మున్సిపాలిటీకి ప్రణాళిక ఉండాలన్నారు. ఖాళీ స్థలాలను గుర్తించి, పచ్చదనం పెంచటం లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. హరితహారం మొక్కలకు వారంలో రెండు, మూడు సార్లు నీరు పట్టాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ 8వ విడత హరిత హారంలో జిల్లాలో 55.40 లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా కలదని, అందుకు అవసరమైన మొక్కలు అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లాకు కేటాయించిన లక్ష్యానికి మించి 20 శాతం పైగా మొక్కలు అధికంగా ఉన్నాయనీ సీఎస్ కు తెలిపారు. కావలసిన మొక్కలకు ఎలాంటి ఇబ్బంది లేదని, హరిత హారంలో నాటిన మొక్కల రక్షణకు చేపట్టిన చర్యల గురించి సిఎస్ కు వివరించారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో ఇండ్లలో పెట్టుకోవడానికి ప్రజలు కోరిన మొక్కలను తెప్పించి ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా నుండి కలెక్టర్ రాజర్షి షా, అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, డిపిఓ సురేష్ మోహన్ ,వ్యవసాయ శాఖ జెడి నరసింహారావు, డి ఆర్ డి ఓ శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ జెడి నరసింహారావు, నీటిపారుదల శాఖ అధికారులు , మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.