అభ్యర్థులు ఎన్నికల ఖర్చు వివరాలు ఇవ్వాలి
జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం
00000
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ఖర్చులను విధిగా సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు.
గురువారం కలెక్టరేట్ సమావేశంలో ఉప ఎన్నికల పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోటీ చేసే అభ్యర్థులకు నగదు రూపకంగా డబ్బులు ఇవ్వవద్దని, చెక్కులు, డి.డి.లు, ఆన్ లైన్ క్యాష్ ట్రాన్స్ ఫర్ మాత్రమే చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పోటీ చేసే అభ్యర్థులు బ్యాంకులో ఖాతా ఉండాలని, అది జీరో బ్యాలెన్స్ గా ఉండాలని స్పష్టం చేశారు. బ్యాంకు ఖాతా నుంచే ఎన్నికల ఖర్చు లావాదేవీలు నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల ప్రకటన విడుదలైన తేదీ నుంచి వారం రోజుల లోపు స్టార్ క్యాంపెయిన్ కు వచ్చే వారి వివరాలను ముందుగానే అందించాలని సూచించారు. ఎన్నికల ప్రచారానికి ఉపయోగించే పోస్టర్లు, కర పత్రాల పై పబ్లిషర్ పేరు తప్పకుండా ముద్రించాలని అన్నారు. ఎన్నికల ఖర్చు వివరాలను ప్రతి రోజు రోజువారిగా ఎన్నికల పరిశీలకుడి కి అందించాలని తెలిపారు. ఎన్నికల ఖర్చుల పై ఎఫ్.ఎస్.టి., ఎస్.ఎస్.టి., వి.వి.టి., బృందాల నిఘా ఉంటుందని అన్నారు. అభ్యర్థుల పై క్రిమినల్ కేసులు ఉంటే సమాచారం ఇవ్వాలని, పత్రికలలో, సోషల్ మీడియాలో, వెబ్ సైట్లో ప్రకటించాలని తెలిపారు. భారత ఎన్నికల కమీషన్ విధించిన నిబంధనలను అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. స్టార్ క్యాంపెయినర్లు ప్రచారంలో పాల్గొంటే బహిరంగ సభలు అయితే 1,000 మంది వరకు ఇన్ డోర్ సమావేశాలకు 200 మందికి మించకుండా, సాధారణ సమావేశాలకు 500 మందికి మించకుండా సమావేశాలు నిర్వహించుకోవాలని తెలిపారు. రోడ్డు షో లకు బైక్, కార్లు, సైకిల్ ర్యాలీలకు అనుమతి లేదని తెలిపారు. అభ్యర్థి, అతడి రాజకీయ పార్టీ 20 వాహనాలను మాత్రమే వినియోగించుకొవాలని అన్నారు. ఎన్నికలకు 72 గంటల ముందు ప్రచారాన్ని ముగించాలని కలెక్టర్ తెలిపారు. కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొని ఉండాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, జిల్లా పరిషత్ సి.ఈ.వో. ప్రియాంక, రాము,ఉపసంచాలకులు,ఆడిట్ శాఖ, రవాణా శాఖ డిప్యూటీ కమీషనర్ చంద్రశేఖర్ గౌడ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు మడుపు మోహన్, కళ్యాడపు ఆగయ్య, మహ్మద్ అకిల్ ఫిరోజ్, నాంపెల్లి శ్రీనివాస్, చీటి రాజెందర్ రావు, చంద్ర శేఖర్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.