హుజురాబాద్ ఉప ఎన్నికల గురించి వివిధ రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశం లో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, సి పి సత్యనారాయణ.

 

ఎన్నికలు స్వేచ్ఛగా సజావుగా పారదర్శకంగా నిర్వహణ

ఎన్నికల ప్రవర్తనా నియమావళి కఠినంగా అమలు చేస్తాం

హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల

మంగళవారం నుండే ఎన్నికల కోడ్ అమల్లోకి

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికల నిర్వాహణ

రాజకీయ పార్టీల నాయకులతో సమావేశంలో కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్

000
హుజురాబాద్ అసెంబ్లీ నియోజక వర్గానికి ఉప ఎన్నికల నిర్వాహణను కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా స్వేచ్ఛగా సజావుగా పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు తమ వంతు సహకారం అందించాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఆర్. వి. కర్ణన్ అన్నారు.

మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో హుజురాబాద్ ఉప ఎన్నికల నిర్వాహణ పై ఏర్పాటు చేసిన సమావేశంలో పోలీస్ కమీషనర్ వి.సత్యనారాయణ తో కలిసి అయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికల నిర్వాహణకు మంగళవారం షెడ్యూల్ విడుదల అయిందని, అక్టోబర్ 01 న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయబడుతుందని తెలిపారు. అక్టోబర్ 08 నామినేషన్ల స్వీకరనకు చివరి తేదీ అని కలెక్టర్ తెలిపారు. అక్టోబర్ 11 న నామినేషన్ల పరిశీలన ఉంటుందని అన్నారు. అక్టోబర్ 13 న నామినేషన్ల ఉప సంహరణ చివరి తేదీ తెలిపారు. అక్టోబర్ 30 వ తేదీన హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికల పోలింగ్ ఉంటుందని తెలిపారు. నవంబర్ 02 న ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు ప్రకటిస్తారని కలెక్టర్ తెలిపారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల పై క్రిమినల్ కేసులు ఉంటే వాటి పరంగా సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి పబ్లిక్ మీటింగ్ లు నిర్వహించడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఇన్ డోర్ సమావేశాలలో 200 మందికి మించరాదని, బహిరంగ సమావేశాలలో స్టార్ కాంపెయినర్స్ సమావేశం లో 1,000 మందికి మించకుండా సాధారణంగా 500 మంది కి మించకుండా సమావేశాలు నిర్వహించుకోవాలని వీటిని ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని కలెక్టర్ తెలిపారు. రాజకీయ పార్టీలు వాహనం ద్వారా వీడియో ప్రదర్శనకు 50 మంది కంటే ఎక్కువ మించకుండా చూసుకోవాలని తెలిపారు. మొత్తంగా 20 వాహనాలకు మించకుండా ఉండాలని తెలిపారు. పోలింగ్ రోజుకు 72 గంటల ముందే ఎన్నికల ప్రచారం సమాప్తం అవుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికలలో పాల్గొనే వారందరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోని ఉండాలని, ఎన్నికల లో పాల్గొనే అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు సర్టిఫికేట్లు తప్పని సరిగా సమర్పించాలని కలెక్టర్ తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గంనకు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినందున మంగళవారం నుండే ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎన్నికల కోడ్) అమల్లోకి వచ్చిందని కలెక్టర్ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు,ఆదేశముల మేరకు హుజురాబాద్ ఎన్నికలలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, సానిటైజర్ తో గాని శుభ్రపరుచుకుంటూ, భౌతిక దూరం పాటిస్తూ కోవిడ్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని కలెక్టర్ సూచించారు. కొత్త ఓటర్ జాబితాలను రాజకీయ పార్టీలకు అక్టోబర్ 08 న అందజేస్తామని తెలిపారు. నామినేషన్ ముందు మరియు తరువాత ఊరేగింపు సమయంలో బహిరంగ సమావేశం నిషేధించబడిందని, నామినేషన్ కోసం ఎలాంటి ఊరేగింపులు అనుమతించబడవు అని కలెక్టర్ తెలిపారు.

పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం హుజురాబాద్ శాసన సభ నియోజకవర్గానికి షెడ్యూల్ ప్రకటించినందున వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని నిస్పక్షపాతంగా, కఠినంగా అమలు చేస్తామని ఆయన తెలిపారు. ఎన్నికల నిర్వాహణ సందర్భంగా ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరుగకుండా శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించుటకు పోలీస్ యంత్రాంగం పకడ్బందీగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, కాంగ్రెస్ పార్టీ నుంచి మడుపు మోహన్, కోమటి రెడ్డి పద్మాకర్ రెడ్డి, సి.పి.ఐ. పార్టీ నుంచి సృజన్, సురెందర్ రెడ్డి, సి.పి.ఎం. పార్టీ నుంచి గుడికందుల సత్యం, టి.డి.పి. పార్టీ నుంచి కళ్యాడపు ఆగయ్య, టి.ఆర్.ఎస్. నుంచి చీటి రాజెందర్ రావు, బి.జె.పి. నుంచి నాంపెల్లి శ్రీనివాస్, ఎం.ఐ.ఎం. నుంచి సయ్యద్ బర్కతలీ, మహ్మద్ అకీల్, తదితరులు పాల్గొన్నారు.

 

 

Share This Post