హుజురాబాద్ ఉప ఎన్నికల నిర్వహణపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ .వి కర్ణన్

లక్షకు పైగా బ్యాంకు ఖాతాల లావాదేవీల పై నిఘా

ఇతర నియోజకవర్గంలోని ఎన్నికల ప్రచారం ఖర్చులు లెక్కిస్తాం :

ఉప ఎన్నికలు స్వేచ్చగా ప్రశాంతంగా నిర్వహించుటకు రాజకీయ పార్టీలు సహకరించాలి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

-000-
హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని వివిధ బ్యాంకులలో లక్షకు పైగా బ్యాంకు ఖాతాల నుండి లావాదేవీలు జరిపితే అట్టి ఖాతాల పై నిఘా ఉంచి తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎస్.హెచ్. ఎలమురుగు జి తో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల ప్రచార ఖర్చులు, నిర్వాహణ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా నియోజకవర్గం పరిధిలో వివిధ బ్యాంకులలో అక్కౌంట్ ల నుండి అనుమానితంగా ఇంతవరకు జరగని విధంగా ఒకే సారి లక్ష రూపాయలకు పైగా డబ్బులు డ్రా చేసిన జమ చేసిన అక్కౌంట్ల పై నిఘా పెడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే ఓటర్లను ప్రభావితం చేయుటకు ఒక అక్కౌంట్ ద్వారా వివిధ అక్కౌంట్లకు యు.పి.ఐ. ద్వారా గూగుల్ పే, ఫోన్ పే ఇతర యాప్ ల ద్వారా డబ్బులు జమ చేసినచో వాటి పై కూడా నిఘా ఉంచి సంబంధిత పార్టీల పై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. హుజురాబాద్ ఉప ఎన్నికలను ప్రశాంత వాతావరణంలొ స్వేచ్చగా నిర్వహించుటకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కోరారు.
హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం పక్క నియోజకవర్గంలో నిర్వహించినచో అట్టి సభలు, సమావేశాల ఖర్చులను సంబంధిత పార్టీ అభ్యర్థుల ఎన్నికల ఖాతాలో ఖర్చులు జమ చేస్తామని తెలిపారు. హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోనే అమలులో ఉన్నందున ఉప ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థులు సమీప నియోజకవర్గంలో అభ్యర్థి ఫోటో, గుర్తు తో ఎన్నికల ప్రచారం నిర్వహించినచో సంబంధిత సమావేశానికి అయిన ఖర్చులు అభ్యర్థి ఖాతాలో జమ చేయబడుతుందని తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గంలో 2,36,859 ఓటర్లు ఉన్నారని, ఇందులో 149 సర్వీస్ ఓటర్లు, 8,246 పి.డబ్ల్యూ.డి. ఓటర్లు, 4,454 మంది 80 సంవత్సరములు పైబడిన వారు. 18 – 19 సంవత్సరముల మధ్య గల యువ ఓటర్లు 4,988 మంది ఉన్నారని కలెక్టర్ తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గంలో 306 పోలింగ్ స్టేషన్లను, 168 లోకేషన్లలో గలవని తెలిపారు. ఇందులో 4 పోలింగ్ స్టేషన్లు ఒకే లోకేషన్లలో 10 చోట్ల గలవని, 3 పోలింగ్ స్టేషన్లు ఒకే చోట 17 చోట్ల గలవని తెలిపారు. మిగిలినవి ఒకటి, రెండు పోలింగ్ స్టేషన్ లోకేషన్ గలవని కలెక్టర్ తెలిపారు. ఒకే చోట 3 కు పైగా పోలింగ్ స్టేషన్లు ఉన్న దగ్గర పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇంతవరకు నామినేషన్ల పరిశీలన అనంతరం 41 మంది అభ్యర్థులు గలరని, నామినేషన్ల ఉప సంహరణ తర్వాత ఎన్నికల బరిలో ఎంత మంది అభ్యర్థులు ఉంటారో తెలుస్తుందని అన్నారు. ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే ఎక్కువ బ్యాలెట్ యూనిట్స్ అవసరమవుతాయని, వాటిని ఇతర పక్క జిల్లాల నుంచి తెప్పిస్తామని అన్నారు. వచ్చిన ఈవియం లను మొదటి విడుత చెకింగ్, రెండవ విడుత చెకింగ్ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షములో ర్యాండమైజేషన్ చేస్తామని తెలిపారు.

ఆర్.టి.పి.సి.ఆర్. నెగిటివ్ రిపోర్ట్ తో ఏజెంట్లకు అనుమతి:
కెంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్ధుల ప్రతినిధులు మొదటి డోస్ కొవిడ్ టీకా తీసుకున్న వారు పోలింగ్, కౌంటింగ్ కు 72 గంటల ముందు ఆర్.టి.పి.సి.ఆర్. నెగిటివ్ రిపోర్టు సమర్పిస్తే ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్లుగా విధులు నిర్వహించుటకు అనుమతిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తెలిపారు. అలాగే ఇంతవరకు ఒక్క డోస్ కూడా కోవిడ్ టీకా తీసుకోకున్న ఉన్న వారు 48 గంటల ముందు ఆర్.టి.పి.సి.ఆర్. నెగిటివ్ రిపోర్టు సమర్పిస్తే ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ విధులు నిర్వహించుటకు అనుమతిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.

2022 ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమానికి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తెలిపారు. నవంబర్ 01 న డ్రాప్ట్ పబ్లికేషన్ చేయబడుతుందని తెలిపారు. నవంబర్ 01 నుండి 30 వరకు క్లెమ్స్ అండ్ అబ్జెక్షన్స్ కు ధరఖాస్తుల స్వీకరణ ఇందులో వివిధ పార్టీలకు చెందిన బూత్ స్థాయి ఏజెంట్లు క్లెమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరిస్తారని తెలిపారు. డిసెంబర్ 20 వరకు ధరఖాస్తుల పరిశీలన అభ్యంతరాలను పరిష్కరిస్తారని తెలిపారు. 2022 జనవరి 05 న తుది ఓటర్ల జాబితాను ప్రచురించబడుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, మానకొండూర్, చొప్పదండి, కరీంనగర్ రిటర్నింగ్ అధికారులు, జిల్లా పరిషత్ సి.ఈ.వో. ప్రియాంక, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలత, కరీంనగర్ రెవెన్యూ డివిజనల్ అధికారి ఆనంద్ కుమార్, టి.ఆర్.ఎస్., కాంగ్రెస్, పిడిపి, బిజెపి, సిపిఐ, రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొనారు.

Share This Post