హుజురాబాద్ ఉప ఎన్నికల నిర్వహణ పై పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతన్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్ పాల్గొన్న సిపి. వి. సత్యనారాయణ.

 

హుజూరాబాద్ ఉప ఎన్నికలు స్వేచ్చగా పారదర్శకంగా నిర్వహణ

పోలింగ్ కు సర్వం సిద్ధం

పోలింగ్ కేంద్రాలలో కోవిడ్ నిబంధనలు పకడ్బంధీగా అమలు

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి.కర్ణన్

00000
కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యుల్ ప్రకారం ఈ నెల 30 న జరుగు హుజురాబాద్ ఉప ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ తెలిపారు.

శుక్రవారం హుజురాబాద్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో పోలిస్ కమిషనర్ వి.సత్యనారాయణ, రిటర్నింగ్ అధికారి సిహెచ్ రవీందర్ రెడ్డి తో కలిసి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ 30 న జరుగు హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గంలో 306 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఉప ఎన్నికలను కోవిడ్ నిబంధనల ప్రకారం నిర్వహిస్తామని తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఎలాంటి సభలు సమావేశాలు నిర్వహించడానికి వీలు లేదని తెలిపారు. ఉప ఎన్నికల నిర్వహణకు హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు పోలింగ్ సిబ్బంది వచ్చారని తెలిపారు. ఉప ఎన్నికలకు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. పోలింగ్ సిబ్బంది అందరూ రెండు డోస్ ల వ్యాక్సినేషన్ తీసుకున్నారని తెలిపారు. ఉప ఎన్నిక కోసం ఏర్పాటు చేసిన 306 పోలింగ్ కేంద్రాల్లో లైటింగ్ సౌకర్యం ఏర్పాటు చేశామని అలాగే సోలార్ లాంప్ లు, చార్జింగ్ లైట్లు అందుబాటులో ఉంచామని కలెక్టర్ తెలిపారు. ఓటర్లందరికీ ఓటర్ స్లిప్పులు పంపిణీ చేశామని, ఓటర్ స్లిప్ గుర్తింపుకార్డు కాదని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్ల అందరూ తప్పనిసరిగా కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన 12 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి తీసుకుని రావాలని అన్నారు. పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలకు సెల్ ఫోన్లు తీసుకురావద్దని సూచించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే లాగా నగదు మద్యం పంపిణీ చేసే వారిని సి- విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే వెంటనే పట్టుకొని చర్యలు తీసుకుంటామని తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గం లోని అన్ని మండలాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వైలెన్స్ టీములు సమర్థవంతంగా పని చేస్తున్నాయని తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల ప్రవర్తనా నియమావళిని) ను కఠినంగా అమలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఓటర్ లందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, ప్రలోభాలకు గురి చేసే వారిని గుర్తించి సమాచారం అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ మాట్లాడుతూ ఎం సి సి కింద ఇప్పటికే 130 కేసులు బుక్ చేశామని, 3.5 కోట్లు నగదు సీజ్ చేశామని తెలిపారు. సి విజిల్ యాప్ ద్వారా ప్రజల సమాచారం అందిస్తే 10 నిమిషాల్లో అక్కడికి చేరుకొని ప్రలోభాలకు గురి చేసే వారినీ పట్టుకుంటామని అన్నారు. ప్రజలు సమాచారం ఇవ్వకున్నా, ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు వారిని గుర్తించి పట్టుకుంటారని తెలిపారు. నకిలీ ఫిర్యాదులు ఇచ్చే వారిపై కూడా కేసులు బుక్ చేస్తామని తెలిపారు. హుజరాబాద్ నియోజకవర్గం లోని ఐదు మండలాల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, కేంద్ర పోలీస్ బలగాలను కూడా వినియోగిస్తున్నామని తెలిపారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే వారిని అలాగే ఓటు వేసేందుకు డబ్బులు అడిగే వారి పై కూడా అ కేసులు బుక్ చేస్తామని స్పష్టం చేశారు. డబ్బులు ఇవ్వడం మరియు అడగడం రెండు కూడా నేరమేనని అన్నారు. పోలింగ్ కు 72 గంటల ముందే ప్రచారం సమాప్తమైనది అని స్థానికేతరులు ఎవరు కూడా హుజూరాబాద్ నియోజకవర్గం లో ఉండకూడదని అన్నారు. ఇప్పటికే స్థానికేతరులు 4 వేల మందిని గుర్తించి నియోజకవర్గం నుంచి పంపించామని అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం లో సుమారు 107 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని ఇక్కడ అదనంగా బందోబస్తు ఏర్పాటు చేసి గట్టి నిఘా పెట్టామని తెలిపారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో స్వేచ్చగా తమ ఓటు హక్కుని వినియోగించుకొనుటకు 3,865 మందితొ పోలిస్ బందోబస్తు ఏర్పటు చేశామని తెలిపారు. ఇందులో 20 కంపెనీల కేంద్ర బలగాలు, 74 మంది ప్రత్యేక పోలిసులు, 700 మంది కరీంనగర్ జిల్లా పోలిసులు, 1471 మంది ఇతర జిల్లాల నుండి పోలిసులను ఎన్నికల బందోబస్తుకు నియమించినట్లు ఆయన తెలిపారు. ప్రజలు పుకార్లను నమ్మవద్దని తెలిపారు.

 

Share This Post