హెచ్ ఐసిసీ లో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించిన సి.ఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి

స్వతంత్ర భారత వజ్రోత్సవాల ప్రారంభ సమావేశం నిర్వహించే హెచ్ఐసీసీ వేదిక లో ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులతో కలసి నేడు సాయంత్రం పరిశీలించారు.  జీఏడీ కార్యదర్శి శేషాద్రి, , సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ,పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా,  అడిషనల్ డి.జి. జితేందర్, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళి, రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఎండి నర్సింహ రెడ్డి,  సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ తదితరులతో కలసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా సి.ఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఈ నెల 8 వ తేదీ నుండి 22 వ తేదీ వరకు నిర్వహించే స్వతంత్ర భారత వజ్రోత్సవాల ప్రారంభ సమావేశం 8 వతేదీన హెచ్ఐసీసీ లో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్య అతిధిగా హాజరవుతారని అన్నారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పిటీసీలు, ఎంపిపి లతో సహా ఇతర ప్రజా ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. తొలుత జాతీయ పతాకావిష్కరణతో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాల్లో భాగంగా 75 వీణ కళాకారులచే దేశ భక్తి గీతాల వాయిద్య ప్రదర్శన, స్వతంత్ర సమర యోధులను తలుచుకునే శాస్త్రీయ నృత్య ప్రదర్శన, ఫూజన్ డాన్స్ కార్యక్రమాలుంటాయని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుందని వివరించారు.

అత్యంత వైభవంగా నిర్వహించే ఈ స్వతంత్ర భారత వజ్రోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే వారందరికీ ప్రత్యేక ఇన్విటేషన్లు పంపిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి వచ్చే ఎంపిపి, జెడ్పిటిసీ లకు ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

Share This Post