హ‌రిత‌హారంలో భాగంగా 8వ. విడ‌తలో నిర్దేశించిన లక్ష్యాల ప్రణాళికలు సిద్ధం చేయాలి : రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేష్ కుమార్, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రిక ప్రకటన.    తేది:29.04.2022, వనపర్తి.

హ‌రిత‌హారంలో భాగంగా 8వ. విడ‌తలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు.
శుక్రవారం హైదరాబాద్ నుండి తెలంగాణకు హరితహారం, దళితబంధు, వరి ధాన్యం కొనుగోలు, వానాకాలం పంటల సాగు తదితర అంశాలపై అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, అధికారుల‌తో సి.ఎస్. వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 8వ విడత హరితహారం జూన్, జులై నెలల్లో ప్రారంభించి, ఆగస్టు మాసం చివరికల్లా పూర్తి అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసి, చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో ప్రభుత్వ ఖాళీ స్థలాలు గుర్తించి, అక్కడ మొక్కలు నాటేవిధంగా చూడాలని ఆయన తెలిపారు. నదీ పరివాహక ప్రాంతం, కాలువలు, కెనాల్ వెంబడి విస్తృతంగా మొక్కలు నాటేవిధంగా చర్యలు తీసుకోవాలని, పల్లె ప్రకృతి, పట్టణ ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు గ్రౌండింగ్ అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. మే 7వ. తేదీలోగా హరితహారం కింద చేపట్టవలసిన పనుల ప్రణాళికలు సిద్ధంచేసి రిపోర్టులు అందించాలని ఆయన తెలిపారు.
దళితబంధు పథకంలో భాగంగా నియోజకవర్గాల వారిగా మంజూరైన వాటితోపాటు, ప్రత్యేక మండలాలను ఎంపిక చేసి దళితబంధు యూనిట్లు వెంటనే గ్రౌండింగ్ చేయాలని అధికారులకు ఆయన సూచించారు. వానాకాలం పంటసాగు ప్రణాళికపై ఆయన మాట్లాడుతూ వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసే విధంగా రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు.  పెసర్లు సాగు చేయటం వలన దిగుబడితో పాటు భూమి సారవంతంగా ఉంటుందని, కంది పంటసాగు పెంచాలని, ఎరువులను మోతాదుకు మించి వాడకుండా అవగాహన కల్పించాలని, వరి పంట విత్తనాలు వేసే విధానంపై అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. వ్యవసాయ విస్తీర్ణాధికారులు రైతు వేదికలలో ఉండి విధులు నిర్వహించే విధంగా చూడాలని, రైతు వేదికలు 100 శాతం రైతులకు ఉపయోగపడేలా చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు ఆయన ఆదేశించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిచాలని, వచ్చిన ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేసేవిధంగా చర్యలు చేపట్టాలని, ధాన్యం కొనుగోలు వివరాలు అదేరోజు ఆన్ లైన్ లో నమోదు చేయాలని, జిల్లా కలెక్టర్లు కొనుగోలు కేంద్రాలను సందర్శించి, సమస్యలు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష మాట్లాడుతూ జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసేలా ప్రణాళిక సిద్దం చేస్తామని ఆమె వివరించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, వ్యవసాయ అధికారులు రైతు వేదికలలో సమావేశాలను నిర్వహించేలా చర్యలు చేపడతామని, వానాకాలం ధాన్యం సేకరణ కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేసి నివేదికలు అందిస్తామని ఆమె తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్, (రెవెన్యూ) డి.వేణుగోపాల్, డి ఆర్ డి ఓ. నరసింహులు, వ్యవసాయ అధికారి సుధాకర్, రామకృష్ణ, పౌరసరఫరాల శాఖ అధికారి అనిల్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
………
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయనైనది.

Share This Post