02.08.2021 CM PROGRAMME AT HALIYA IN NALGONDA DIST.

150 కోట్లతో నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించారు.

సోమవారం నాడు నల్గొండ జిల్లా హాలియా మండల కేంద్రం లోని మార్కెట్ యార్డులో జరిగిన నాగార్జునసాగర్ నియోజకవర్గ సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నాగార్జునసాగర్ నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా R&B, పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధి, గ్రామాలలో సిసి రోడ్ల అభివృద్ధికి గాను 120 కోట్లు, అదే విధంగా నందికొండ, హాలియా మున్సిపాలిటీల అభివృద్ధి కోసం 15 కోట్లు చొప్పున 30 కోట్లు, మొత్తం కలిపి 150 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రగతి సమీక్ష కోసం తాను ముందే రావాల్సిన ఉండేదని, కానీ కరోనా పరిస్థితుల కారణంగా ఆలస్యమైందని అన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం వెనుకబాటుతనం, సమస్యలు తీర్చడానికి ఇదొక అవకాశం అని భావిస్తున్నట్లు అన్నారు. నియోజకవర్గంలో పెండింగ్ సమస్యలను, గ్రామాలలో పొలాలకు వెళ్లే డొంక దారులు, కాజువే మరమ్మతులకు ప్రాముఖ్యత ఇస్తున్నట్లు తెలిపారు. హాలియాను అద్భుతంగా తీర్చిదిద్దుతామని, రోడ్లు, డ్రైన్లు మరమ్మతులు చేయడం జరుగుతుందని తెలిపారు. నాగార్జునసాగర్ మున్సిపాలిటీ లోని ఇరిగేషన్ శాఖ భూములలో,క్వార్టర్ లలో నివసించే వారికి హక్కు పత్రాలు ఇవ్వడం జరుగుతుందని, వారి ఇళ్లను రెగ్యులరైజ్ చేయడం జరుగుతుందని, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటుతో ఒక నెల లోపు పట్టాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గుర్రంపోడు లిఫ్ట్ సంబంధించి సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నెల్లికల్ లిఫ్ట్ తో పాటు దీనిని కూడా సాంక్షన్ చేస్తున్నట్టు ప్రకటించారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం అధికారులను హైదరాబాద్ పిలిపించి సరైన కార్యాచరణతో ముందుకు వెళతామని తెలిపారు. కరోనా వచ్చిన తర్వాత ఆరోగ్యశాఖను మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 18000 ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, కొత్తగా 7 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినట్లు, 33 జిల్లా కేంద్రాల్లో 33 మెడికల్ కాలేజీల ఏర్పాటుతో, 500 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని, హైదరాబాదులో మరో నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో ప్రైమరీ హెల్త్ సెంటర్లను అప్ గ్రేడ్ చేస్తామని తెలిపారు. దేవరకొండ నియోజకవర్గ పరిధిలో ఐదు లిఫ్ట్ లు, మిర్యాలగూడలో 5 లిఫ్ట్ లు, నకిరేకల్, హుజూర్ నగర్ లలో ఒక్కొక్క లిఫ్ట చొప్పున మొత్తం 15 లిఫ్ట్ లు మంజూరు చేయడం జరిగిందని, రాబోయే సంవత్సరన్నర కాలంలో పూర్తి చేస్తామని తెలిపారు. నాగార్జునసాగర్ ఆయకట్టును అభివృద్ది చేస్తామని తెలిపారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ లేనందున భవన వసతి‌, సిబ్బంది ఏర్పాటుతో నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. హాలియాలో మినీ స్టేడియం కూడా మంజూరు చేస్తామని తెలిపారు. రెడ్డి కళ్యాణ మండపం నిమిత్తం రెండున్నర ఎకరాలు శాంక్షన్ చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా షాదీఖానాకు స్థలం మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా మంత్రి నేత్రృత్వంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుందని తెలిపారు. నాగార్జునసాగర్, హాలియా ఇంకా అభివృద్ధి కావాలని, కొద్దికాలంలో అవసరమైతే మళ్లీ వస్తానని, అవసరమని మంజూరు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత తీర్చామని‌, నిరాటంకంగా నాణ్యమైన విద్యుత్ అందించడం జరుగుతున్నదని, మిషన్ భగీరథ క్రింద మంచి నీటి సమస్య తీరిందని తెలిపారు. లిఫ్ట్ ల ఏర్పాటు వల్ల ఎగువ ప్రాంతాలకు సాగునీరు వస్తుందని, తద్వారా నాగార్జునసాగర్ ఆయకట్టు అభివృద్ధి చెందుతుందని అన్నారు. విద్యుత్ ఉత్పత్తి సంస్థ దక్షిణ తెలంగాణలో లేదని , రాష్ట్రంలో పవర్ బ్యాలెన్స్ ఉండాలని‌, దీనికోసం దక్షిణ తెలంగాణలో ఒక పవర్ ప్లాంట్ దామరచర్ల వద్ద 30 వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసుకుంటున్నామని, తద్వారా దామరచర్ల లక్ష మందితో దినదినాభివృద్ధి చెందుతున్నట్లు తెలిపారు. 4 వేల మెగావాట్ల అల్ట్రా మెగా ప్లాంట్ నల్గొండ జిల్లాలో ఏర్పాటు అవుతున్నట్లు తెలిపారు. గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా ప్రకటించుకొని అభివృద్ధి చేసుకుంటున్నామని, అలాగే బంజారా సోదరులకు బంజారా భవనం నిర్మించి ఇస్తామని తెలిపారు. పోడు భూముల గురించి మాట్లాడుతూ 2005 సంవత్సరం వరకు కటాఫ్ డేట్ ఉందని, అవకాశం ఉన్న అందరికీ పోడు భూముల సమస్యలు తీరుస్తామని, త్వరలోనే దానికి శ్రీకారం చుడతామని అన్నారు. రాష్ట్రంలో 12,790 గ్రామ పంచాయతీలలో ట్రాక్టర్ , ట్రాలీ, ట్యాంకర్ల ఏర్పాటుతో పల్లెసీమలలో పచ్చదనం, పరిశుభ్రతతో అభివృద్ధి చేసుకుంటున్నామని, ద్వారా సీజనల్ వ్యాధులు తగ్గుతున్నాయని అన్నారు. సామాజిక అడవుల పెంపకంలో భాగంగా చెట్లను విరివిగా పెంచాలని అంటూ, నల్లగొండ జిల్లాలో అడవులు తక్కువగా ఉన్నాయి కాబట్టి హరితహారం కార్యక్రమంలో పెద్ద ఎత్తున చెట్లు నాటాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. తెలంగాణలో 3 కోట్ల వరి ధాన్యం దిగుబడిపై పార్లమెంట్లో కేంద్ర మంత్రి స్వయంగా ప్రశంసించారని, అలాగే ప్రపంచంలోనే అతి మేలైన పత్తి పంట తెలంగాణలో పండుతున్నట్లు, ఇప్పటివరకు ఒక కోటి 75 లక్షల క్వింటాళ్ల పత్తి సీసీఐ కి ఇచ్చి దేశంలోనే నెంబర్ వన్ గా ఉన్నామని అన్నారు. కెసిఆర్ కిట్స్ ద్వారా తల్లుల, పిల్లల మరణాలు తగ్గాయని, మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతున్నట్లు తెలిపారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో చైతన్యవంతమైన ప్రజలు ఉన్నారని, రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి కూడా తీసిపోని విధంగా నాగార్జునసాగర్ ను అభివృద్ధి చేస్తామని అన్నారు. దళితుల అభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన దళిత బంధు పథకం కోసం లక్ష కోట్లు అయినా ఖర్చు చేస్తామని, దళిత బంధు పథకంలో ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దని, రాష్ట్రంలో 16 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయని, వీటిలో 12 లక్షల దళిత కుటుంబాలకు మేలు జరుగుతుందని, పది లక్షల రూపాయలు ఎవరి పెత్తనం లేకుండా స్వయంగా లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సంవత్సరం ప్రతి నియోజకవర్గంలో 100 దళిత కుటుంబాలకు సహాయం అందిస్తామని, రాబోయే సంవత్సరం నుండి దశల వారీగా పెంచుకుంటూ దళిత బందు సహాయం అందిస్తామని తెలిపారు. దళిత బంధు పథకం ఎవరూ అడగక ముందే ప్రభుత్వం ప్రకటించిందని, దీనిని 100 శాతం అమలు చేస్తామని అన్నారు. తెలంగాణ దళిత జాతి అభివృద్ధి దిశలో భారతదేశంలోని అందరి దృష్టి ఆకర్షిస్తుందని తెలిపారు. సమైక్య పాలనలో తెలంగాణ దెబ్బతిన్నదని, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచి నీరు అందిస్తున్నామని, అలాగే 24 గంటల నాణ్యమైన కరెంటును అందిస్తున్నామని, రేషన్ కార్డులు, ఆసరా పింఛన్లు, 57 సంవత్సరాలకు పెన్షన్ తదితర సంక్షేమ, అభివృధి కార్యక్రమాలను అమలు చేసుకుంటున్నామని,అవి మన కళ్ళు ముందే కనపడుతున్నాయని, వీటిని నిరాటంకంగా కొనసాగిస్తామని అన్నారు. నిన్న ఆదివారం నాడు నాగార్జున సాగర్ ఎడమ కాలువ నీటిని విడుదల చేశామని‌, కృష్ణా నీటిలో మన వాటాను ఖచ్చితంగా ఉపయోగించుకుంటామని, రెండు పంటలకు సాగునీరు అందిస్తామని అన్నారు. ముందుకు సాగే తెలంగాణ ప్రస్థానంలో సమస్యలను పరిష్కరించుకుంటూ, పేదలు, రైతుల సంక్షేమం కోసం ముందుకు సాగుతామని అన్నారు. రైతు బంధు, రైతు బీమా తో రైతులలో ధీమా వచ్చిందని, ఎగతాళి చేయబడ్డ తెలంగాణలో ఇప్పుడు మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి దేశానికే అన్నం పెడుతున్నామని అన్నారు. దేశంలో తలసరి విద్యుత్ వాడకం 1100 యూనిట్లు అయితే తెలంగాణలో అది 2070 తలసరి యూనిట్ లతో ముందుకు పోతున్నామని అన్నారు. ప్రగతి మార్గాన్ని కొనసాగిస్తామని ఎవరికి ఏ సమస్య ఉన్నా చెప్పాలని, స్థానిక ఎమ్మెల్యే ద్రృష్టి కి తేవాలని వాటి పరిష్కారానికి అధికారులు ప్రజా ప్రతినిధులు కృషి చేస్తారని అన్నారు.

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్రెడ్డి మాట్లాడుతూ, నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకుంటూ, నల్లగొండ జిల్లా మొత్తాన్ని సస్యశ్యామలం చేస్తూ మిగిలిపోయిన సమస్యలను స్వయంగా పరిష్కరించడానికి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలిపారు. నల్లగొండ జిల్లా 35 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడితో దేశంలోనే మొదటి స్థానంలో ఉండడం జిల్లా పట్ల ముఖ్యమంత్రి గారి ప్రేమకు నిదర్శనమని అన్నారు. కేవలం ఏడు సంవత్సరంలోనే జిల్లా పై ప్రత్యేక శ్రద్ధతో జిల్లా రైతాంగానికి ధైర్యం చెప్పారని అన్నారు. దళితులు వెలుగులోకి రావాలనే ఆకాంక్షతో దళితుల సాధికారతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి దళితుల జీవితాల్లో వెలుగులు నింపడానికి వచ్చిన సీఎం గారికి కృతజ్ఞతలు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీమతి స్మితాసబర్వాల్, నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె. పాటిల్, నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భరత్, శాసనసభ సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిషోర్, శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్ , చిరుమర్తి లింగయ్య, పైల శేఖర్ రెడ్డి, ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్ మహేందర్ రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, గ్రామ పంచాయితీ సర్పంచులు, మున్సిపాలిటీ మెంబర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Share This Post