(05.06.2022) “ప్రపంచ పర్యావరణ దినోత్సవం” సందర్భంగా ర్యాలీ : జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్.లోకనాథ్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్

పత్రికా ప్రకటన
తేది:05.06.2022, వనపర్తి.

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ విధిగా పాల్గొనాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్.లోకనాథ్ రెడ్డి ఆదేశించారు.
ఆదివారం “ప్రపంచ పర్యావరణ దినోత్సవం” సందర్భంగా కాలుష్య నియంత్రణ బోర్డు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుండి రాజస్వ మండల అధికారి కార్యాలయము (ఆర్.డి. ఓ) వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీలో జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తో కలిసి జడ్పీ చైర్మన్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా జడ్పి చైర్మన్ మాట్లాడుతూ “ప్రపంచ పర్యావరణ దినోత్సవం” సందర్భంగా ప్రతి ఒక్కరు పర్యావరణం కాపాడడానికి ముందుకు రావాలని, చెట్లు నాటడం వల్ల పర్యావరణం పరిరక్షణ జరుగుతుందని, ప్లాస్టిక్ నిరోధానికి చర్యలు తీసుకోవాలని, కాలువలు, చెరువులు, గట్లలో మొక్కలు నాటడం వల్ల పచ్చదనం పెరుగుతుందని ఆయన అన్నారు. మనకు 33 శాతం అటవీ సంపద ఉండాల్సి ఉండగా, వనపర్తి జిల్లాలో కేవలం 5 శాతం మాత్రమే ఉందని, హరితహారం కార్యక్రమం ద్వారా 10 శాతం వరకు పచ్చదనం పెంచాలని ఆయన సూచించారు. గత పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా విరివిగా లక్షలాది చెట్లు నాటడం జరిగిందని, దీని ద్వారా కేవలం ఒక్క శాతం మాత్రమే అటవీ సంపద పెరిగిందని, ప్రస్తుతం జరిగే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా మరింత పచ్చదనం పెంచాలని ఆయన తెలిపారు.
జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ మాట్లాడుతూ పట్టణంలోని రోడ్లు, మైదానాలు, కార్యాలయాలు, చెరువులు, కాలువల పొడవునా మొక్కలు నాటడం జరుగుతుందని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆయన సూచించారు. చెరువులను పరిరక్షించాలని, ప్లాస్టిక్ లాంటి వ్యర్థ పదార్థాల ద్వారా నీరు కలుషితమవుతాయని, ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించాలని ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని, తద్వారా పర్యావరణాన్ని కాపాడేందుకు దోహదపడిన వారము అవుతామని ఆయన అన్నారు.
మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన అన్నారు. విద్యార్థి దశ నుండే పాఠ్యపుస్తకాలలో కాలుష్యం నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని, గ్రామాలలో, మున్సిపాలిటీలలో అవగాహన కల్పించి ప్లాస్టిక్ నిర్మూలించాలని, ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ప్రజలచే పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, జడ్పీ సీఈవో వెంకట్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, డి ఈ ఓ రవీందర్, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి మల్లికార్జున్, డి ఆర్ డి ఓ నరసింహులు, డి ఎం హెచ్ ఓ రవిశంకర్, జిల్లా మైనార్టీ అధికారి అనిల్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post