09.08.2021 NALGONDA DIST. *పత్రికా ప్రకటన* *తెలంగాణ పోలీసింగ్ దేశానికే ఆదర్శం : రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి* – – డిజిపి, ప్రజా ప్రతినిధులు, పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి భరోసా సెంటర్, టిటిఐ ప్రారంభోత్సవం – – తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణలో పోలీస్ శాఖకు అధిక ప్రాధాన్యం, సౌకర్యాల కల్పన – – శాంతి భద్రతలు సమర్ధవంతంగా అమలవుతున్న రాష్ట్రం తెలంగాణ

నల్లగొండ,ఆగస్ట్ 9. తెలంగాణ పోలీసింగ్ యావత్ భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తుందని, శాంతి భద్రతల పరిరక్షణలోనూ తెలంగాణ అగ్ర స్థానంలో ఉన్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.
సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఎస్.పి. రెడ్డి, గుమ్మి రాంరెడ్డిల సహకారంతో నిర్మించిన భరోసా సెంటర్ ను, అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ను ఆయన డిజిపి మహేందర్ రెడ్డి, శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్థానిక శాసన సభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి, విమెన్ సేఫ్టీ వింగ్ అదనపు డిజి స్వాతి లక్రా, ఐజి శివశంకర్ రెడ్డి, డిఐజి ఏ.వి. రంగనాధ్ లతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం భరోసా కేంద్రంలో డిఐజి రంగనాధ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ
ఇతర రాష్ట్రాలు నేరాల అదుపు తెలంగాణ పోలీసుల సహకారం తీసుకోవడమే తెలంగాణ పోలీస్ పనితీరుకు నిదర్శనమన్నారు. సమర్ధవంతమైన పోలీసింగ్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో నేరం చేయాలంటే భయపడే పరిస్థితి ఉన్నదని, ఇది ఎంతో గర్వకారణమన్నారు. దేశంలో మెరుగైన సమాజం, సమర్ధమైన శాంతి భద్రతలు అమలవుతున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. ఇతర రాష్ట్రాల పోలీసులు సైతం తెలంగాణ పోలీసుల నుండి అనేక సందర్భాలలో సూచనలు, ఇక్కడ అమలవుతున్న విధానాల గురించి సహకారం తీసుకోవడమే తెలంగాణ పోలీస్ అగ్రస్థానంలో ఉందని చెప్పడానికి నిదర్శనమని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ పోలీస్ వ్యవస్థలో అనేక నూతన విషయాలను ప్రయోగాత్మకంగా అమలు చేయడంతో పాటుగా అనుభవంతో కూడిన పాలన సాగిస్తున్న మన ముఖ్యమంత్రి కెసిఆర్ కు దేశంలో ఎవరూ సాటిలేరన్నారు. ఆయన పాలనా అనుభవం, అవగాహన కారణంగానే తెలంగాణలో సమర్ధవంతంగా పోలీసింగ్ అమలు కావడమే కాక, ఎన్నో రకాల ఇబ్బందుల నడుమ విధి నిర్వహణ చేస్తున్న పోలీసుల పరిస్థితులు ఎలా ఉన్నాయని ఆలోచించిన తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ అని తెలిపారు. అందుకే దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ పోలీసులకు అన్ని రకాల సౌకర్యాలు, వాహనాల ఏర్పాటు, ఇలా ప్రతి స్థాయిలో పోలీస్ శాఖకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు. అదే సమయంలో విధి నిర్వహణలో సైతం పోలీసులు ఎలాంటి వత్తిడి లేకుండా ప్రజలకు నాణ్యమైన, సమర్ధవంతమైన సేవలు అందించేలా పరిస్థితులు కల్పించాలని పోలీస్ శాఖలో అనేక మార్పులు తీసుకువచ్చారని ఆయన తెలిపారు. మహిళ భద్రత విషయంలోనూ తెలంగాణ ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల నుండి వచ్చిన *షి టీమ్స్* ఏర్పాటు ద్వారా ప్రజా మన్ననలు పొందిందని గుర్తు చేశారు. ఇక భరోసా కేంద్రం ఏర్పాటు దేశంలోనే తొలి ప్రయోగమని ఆయన చెప్పారు. అత్యాచారానికి గురైన మహిళలు, యువతులకు అన్ని రకాలు న్యాయం అందించడం లక్ష్యంగా ఏర్పాటు జరిగిన భరోసా కేంద్రంలోకి రావాలని ఎవరూ కోరుకోవద్దని, తప్పనిసరి పరిస్థితులలో ఇతరుల చేత బాధించబడినప్పుడు, ఒకే చోట మంచి పద్ధతిలో న్యాయం అందించేలా భరోసా కేంద్రం ఏర్పాటు జరిగిందని తెలిపారు. బాధిత మహిళలకు న్యాయ సహాయం అందిస్తూ, వైద్యం అందిస్తూ నేరస్తులకు శిక్ష పడేలా చేయడమే భరోసా కేంద్రం లక్ష్యమని ఉమ్మడి జిల్లా మహిళలకు భరోసా కేంద్రం ద్వారా ధీమా కల్పించేలా పని చేయాలని ఆకాంక్షించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ట్రాఫిక్ పోలీసులకు అదనంగా జీతం, హోం గార్డులకు మంచి వేతనాలు రాష్ట్రంలో అమల వుతున్నాయని ఆయన చెప్పారు. ఎక్కడైనా శాంతి భద్రతలు సక్రమంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని, ఈ పరిస్థితి మన రాష్ట్రంలో ఉన్న కారణంగానే తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయని, దీని ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. శాంతి భద్రతలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలలో పోలీసులను భాగస్వామ్యం చేస్తూ ప్రజలు, ప్రభుత్వం మెచ్చుకునేలా తెలంగాణ పోలీసులు పని చేయడం అభినందనీయమన్నారు. మరిన్ని మెరుగైన సౌకర్యాలను భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసే విధంగా సహకరిస్తామని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు.
శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తర్వాత దేశానికే మార్గదర్శకంగా తెలంగాణ పోలీసులు నిలిచారని, పోలీసింగ్ లో తెలంగాణ పోలీస్ కీలకంగా పని చేస్తోందని, మన పోలీసులు చేస్తున్న ఎన్నో కార్యక్రమాల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణమని ఆయన అన్నారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్  పోలీస్ వ్యవస్థకు ప్రత్యేక గుర్తింపు ఇస్తూ అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రం ద్వారా మహిళలకు మరింత భద్రత కల్పించేలా పని చేయాలని సూచించారు.
తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ జిల్లా తాను చదువుకున్న జిల్లా అని, ఈ జిల్లాలో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి భరోసా కేంద్రం ప్రారంభంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉన్నదని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ శాఖకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా శాంతి భద్రతలు సమర్ధవంతంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని భావించి రాష్ట్ర ఏర్పాటు తర్వాత పోలీస్ వ్యవస్థలో అనేక మార్పులు చేసి, అధికారంలోకి వచ్చిన మొదటి మూడు నెలల కాలంలోనే సీనియర్ పోలీస్ మహిళా అధికారులతో కమిటీ వేసి అందరి అభిప్రాయాలను తీసుకొని మహిళా భద్రత కోసం అనేక చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. సమాజంలో 50%మహిళలకు భద్రత పోలీస్ శాఖ బాధ్యత అని చెప్పడమే కాకనఆయన ఆలోచనల నుండి *షి టీమ్స్* దేశంలో మొదటగా మన రాష్ట్రంలో ఏర్పాటు చేశారని అన్నారు. ప్రజలకు నాణ్యమైన, సమర్ధవంతమైన సేవలను అందించేలా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకంగా ఉండేలా చర్యలు తీసుకొని మహిళల భద్రత కోసం దేశంలోనే ఎక్కడా లేని విధంగా విమేన్ సేఫ్టీ వింగ్ ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ అన్నారు. పోలీస్ శాఖ ద్వారా ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నా ఇంకా చాలా చేయాల్సి ఉందని చెప్పారు. రాబోయే రోజులలో గ్రామీణ ప్రాంతాల మహిళలకు మరింత సమర్ధవంతంగా సేవలు అందించే విధంగా మహిళా స్వయం సహాయక సంఘాలన్నింటిని భాగస్వామ్యం చేస్తూ మహిళల రక్షణ కోసం *షి టీం పోలీస్* గ్రామీణ స్థాయిలోనూ పని చేసే విధంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. అదే విధంగా పాఠశాల స్థాయిలో సైతం సమాజంలోని అన్ని వర్గాల సహకారంతో రాష్ట్ర స్థాయిలో విధ్యా శాఖతో కలిసి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో *గర్ల్ సేఫ్టీ క్లబ్స్* ఏర్పాటు చేసి ఎలాంటి సమస్యలు వస్తే ఎవరిని సంప్రదించాలి, పోలీసులకు ఎలా పిర్యాదు చేయాలో తెలియజేసే విధంగా సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులను సైతం భాగస్వామ్యం చేసి బాలికల రక్షణకు కృషి చేయడంతో పాటు ట్రైన్ ది ట్రైనర్స్ కార్యక్రమాలు నిర్వహించేలా ముందుకు సాగుతున్నామని చెప్పారు.  నేరం జరగకుండా చూడడమే పోలీస్ శాఖ ప్రధమ లక్ష్యంగా తెలంగాణ పోలీస్ పని చేస్తుందని, శాంతి భద్రతలు సమర్ధవంతంగా ఉంటేనే పెట్టుబడులకు అవకాశం, అభివృద్ధి  సాధ్యమని చెప్పారు. రాష్ట్రంలో తొమ్మిది లక్షల సిసి  కెమెరాలు ఉన్నాయని, కమ్యూనిటీ పోలీసింగ్, నేను సైతం ద్వారా రాష్ట్రంలో ప్రజల భాగస్వామ్యంతో చేస్తున్న కార్యక్రమమని చెప్పారు. ఒక్క సిసి కెమెరా వంద మంది పొలీసులతో సమానమని, తెలంగాణ ఏర్పాటు జరిగిన ఏడు సంవత్సరాల కాలంలో శాంతి భద్రతలను కఠినంగా అమలు చేస్తూ ప్రజా మన్ననలు పొందేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ఎక్కడైనా  సంఘటన జరిగిన 10 నిమిషాలలో పోలీస్ వాహనం అక్కడికి చేరుకునే విధంగా తెలంగాణ పోలీస్ శాఖ పని చేస్తూ,  పోలీస్ వ్యవస్థ ప్రజల కోసం పని చేసే వ్యవస్థ అనే నమ్మకం ప్రజల్లో కల్పించేలా ముందుకు సాగుతున్నామని చెప్పారు. నేరాలు చేసిన వారికి ఖచ్చితంగా జైలు శిక్షలు పడేలా కృషి చేస్తూ కేసులలో శిక్షల శాతాన్ని పెంచగలిగామని తెలిపారు. రాష్ట్రంలో మహిళా భద్రత తొలి ప్రాధాన్యంగా కృషి చేస్తూ ఎన్నో చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. మంచిగా ఉండే వాళ్లకు మాత్రమే ఫ్రెండ్లి పోలీసింగ్ అని నేరాలు, అసాంఘిక  కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
విమెన్ సేఫ్టీ వింగ్ అదనపు డిజి స్వాతి లక్రా మాట్లాడుతూ నల్లగొండలో భరోసా సెంటర్ ప్రారంభం చాలా సంతోషంగా ఉందని, మొట్ట మొదట భరోసా కేంద్రం హైదరాబాద్ లో 2016లో ఏర్పాటు చేశామని, దీని నిర్వహణ కోసం భరోసా సొసైటీ ఏర్పాటు చేసి లైంగిక దాడికి గురైన మహిళలకు, యువతులకు అన్ని రకాలుగా అండగా నిలవడం, వారికి అవసరమైన అన్ని రకాల సహకారం అందించడం లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. ఒకే చోట అన్ని రకాల సౌకర్యాలతో పాటు వారిలో మానసిక ధైర్యం నింపడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. భరోసా కేంద్రాల ఏర్పాటు ఆలోచన వచ్చిన సమయంలో తమకు చాలా స్వచ్చంద సంస్థలు ముందుకు వచ్చి సహకారం అందిస్తామని చెప్పారని గుర్తు చేశారు. ప్రాధమిక చికిత్స కోసం డాక్టర్ సైతం అందుబాటులో ఉండేలా, పోలీస్ అధికారులు, వీడియో కాన్ఫరెన్స్ విధానంతో పాటుగా త్వరలో భరోసా కేంద్రంలో పొక్సో కోర్టు ఏర్పాటు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సంగారెడ్డి, వరంగల్ లో భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని, త్వరలో పాతబస్తీ, సైబరాబాద్, రాచకొండ లో ఏర్పాటు చేయనున్నామని, త్వరలో సూర్యాపేట, ఖమ్మం, మెడ్చల్ జిల్లా కేంద్రాలలో భరోసా కేంద్రాలు ఏర్పాటు కానున్నాయన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ భరోసా కోసం ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్ రూపొందించామని, భరోసా సెంటర్ల సిబ్బంది రకాల శిక్షణ ఇస్తున్నట్లు ఆమె చెప్పారు. సుప్రీం కోర్టు సైతం తెలంగాణలో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాల ఏర్పాటును అభినందించి హైదరాబాద్ లో ఉన్న భరోసా సెంటర్ల మాదిరిగా దేశంలో అన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేయాలని పేర్కొనడం తెలంగాణ పోలీస్ శాఖకు దక్కిన గొప్ప గౌరవం, గర్వకారణమని స్వాతి లక్రా చెప్పారు.
నల్లగొండ శాసన సభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ భరోసా కేంద్రం ఏర్పాటు ఒక మంచి కార్యక్రమమని, దీనిని నల్లగొండలో ఏర్పాటు సంతోషంగా ఉన్నదని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అభివృద్ధి, పోలీస్ స్టేషన్లకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారని చెప్పారు. పోలీస్ శాఖ సంఘటనలు జరగక ముందే మహిళలకు భరోసా కల్పించేలా చూడాలని కోరారు ఇంటర్ విద్యార్థినీలకు చట్టాల పట్ల అవగాహన కల్పించి వారిలో మానసిక ధైర్యాన్ని నింపాలని సూచించారు. గంజాయి కారణంగా అనేక కుటుంబాలు నాశనం అవుతున్నాయని, గంజాయి వాడకం, రవాణా లాంటి కేసుల పట్ల మరింత కఠినంగా  వ్యవహరించాలని కోరారు.
డిఐజి, జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ మాట్లాడుతూ భరోసా సెంటర్ అంటే రకరకాల సమస్యల వచ్చే మహిళలు, యువతులు, అత్యాచారానికి గురైన మహిళలకు కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒకే ప్రాంతంలో అన్ని సౌకర్యాలు, బాధిత మహిళల స్టేట్ మెంట్లు సైతం ఇక్కడే రికార్డు చేయడం, కోర్టుకు అవసరమైన స్టేట్ మెంట్ల రికార్డు సైతం ఆన్ లైన్, వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా చేసే విధంగా అన్ని రకాల సౌకర్యాలతో భరోసా సెంటర్ ఒక వేదికగా ఏర్పాటు చేశామని తెలిపారు. షి టీమ్స్ మహిళా భద్రతలో కీలకంగా పని చేస్తూ అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నదని, సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత మహిళలకు జరుగుతున్న మోసాల విషయంలోమహిళల పేర్లు సైతం బయటికి విచారణ పూర్తి చేస్తూ వారికి న్యాయం అందించేలా రాకుండా చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నామని,  మహిళా రక్షణ విషయంలో నిరంతర కృషి చేస్తూ మహిళలకు భరోసా ఇచ్చే విధంగా జిల్లాలో పోలీస్ శాఖ పని చేస్తోందని చెప్పారు.
*షి టీమ్ వీడియో సాంగ్ ను ఆవిష్కరించిన మంత్రి, డిజిపి*
జిల్లాకు చెందిన పోలీస్ అధికారులు బి. సురేష్ కుమార్, ఎస్.ఎం. బాషా, ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, నరేష్, రేవతి తదితరులు నటించగా సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ సంగీత దర్శకత్వంలో కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీ చరణ్ సమర్పణలో రూపొందించిన *షి టీమ్* పాటను మంత్రి జగదీష్ రెడ్డి, డిజిపి మహేందర్ రెడ్డి, ఇతర అధికారుల సమక్షంలో ఆవిష్కరించారు. అనంతరం ఎల్.ఈ.డి స్క్రీన్ ద్వారా వీడియో సాంగ్ ను వీక్షించి అభినందించారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా జడ్జి రమేష్, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సతీష్ చోడగిరి, అదనపు ఎస్పీ శ్రీమతి నర్మద, డిఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, రమణా రెడ్డి, రవీందర్, సురేష్ కుమార్, అటవీ అధికారి రాంబాబు, మున్సిపల్ చైర్మన్ మందడి సైది రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, ఆర్క్ గ్రూప్.చైర్మన్ గుమ్మి రాంరెడ్డి, టర్మీనస్ గ్రూప్ సిఎండి ఎస్.పి. రెడ్డిలతో పాటు పలువురు సిఐలు, ఆర్.ఐ.లు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
*ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ప్రారంభం*
భరోసా కేంద్రం ప్రారంభం అనంతరం జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మంత్రి జగదీష్ రెడ్డి డిజిపి మహేందర్ రెడ్డి, సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఇతర పోలీస్ అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. టిటిఐలో ఏర్పాటు చేసిన సిమిలేటర్, కౌన్సిలింగ్ గది జ్ ఇతర సౌకర్యాలను పరిశీలించి డిఐజి రంగనాధ్ ను ప్రత్యేకంగా అభినందించారు. హైదరాబాద్ నగరం తర్వాత అన్ని సౌకర్యాలతో నల్లగొండలో టిటిఐ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. దీని ద్వారా ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కల్పించడం, మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి కౌన్సిలింగ్ ద్వారా రోడ్డు ప్రమాదాలు నివారించడం చేయవచ్చన్నారు.

Share This Post