10వ. తరగతి, ఇంటర్మీడియేట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా

పత్రిక ప్రకటన.      తేది. 28.04.2022, వనపర్తి.

మే నెలలో నిర్వహించనున్న 10వ. తరగతి, ఇంటర్మీడియేట్ పరీక్షలను సజావుగా నిర్వహించేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.
గురువారం హైదరాబాద్ నుండి 10వ. తరగతి, ఇంటర్మీడియేట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేనతో కలిసి జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలు వార్షిక పరీక్షలు నిర్వహించలేదని, ఈ సంవత్సరం పరీక్షలు ప్రత్యేక పరిస్థితులలో నిర్వహించడం జరుగుతుందని ఆమె అన్నారు. రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షలకు 9,07,396 మంది విద్యార్థులు, 10వ. తరగతి పరీక్షలకు 5,09,275 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు ఆమె తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆమె ఆదేశించారు. మే నెలలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం దృష్ట్యా విద్యార్థులకు సమస్యలు తలెత్తకుండా పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు సమయానికి చేరుకునే విధంగా అన్ని రూట్లలో ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలని, పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యార్థులు ఎవరైనా ఆందోళనకు గురైతే అలాంటి విద్యార్థులకు మానసిక ధైర్యం కల్పించే విధంగా చూడాలని, పరీక్షల నిర్వహణ సమయంలో హైదరాబాద్ నుండి ముగ్గురు మానసిక వైద్య నిపుణులను ఏర్పాటుచేసి, టోల్ ఫ్రీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. ఆందోళన చెందే విద్యార్థులను టోల్ ఫ్రీ నెం. 1800-5999333 నెంబరుకు విద్యార్థులతో మాట్లాడించాలని, ఈ నెంబరు ప్రతి పరీక్ష కేంద్రంలో ప్రిన్సిపాల్ వద్ద అందుబాటులో ఉండే విధంగా చూడాలని ఆమె సూచించారు. పరిక్షా నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పోలీస్, రెవెన్యూ, వైద్య, పోస్టల్ శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని ఆమె సూచించారు.
జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష మాట్లాడుతూ  జిల్లాలో మొత్తం 7వేల 306 మంది విద్యార్థులు, 35 పరీక్షా కేంద్రాల్లో పరీక్షకు పదవ తరగతి విద్యార్థులు హాజరు అవుతున్నట్లు ఆమె వివరించారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ లో 12,632 మంది విద్యార్థులు, 22 పరీక్ష కేంద్రాలను, 10 ప్రశ్నాపత్రాల భద్రతా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. పరీక్షా కేంద్రాలకు అన్నీ రూట్లలో ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు, సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసి వేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. వైద్యశాఖ, ఆర్టీసీ, విద్యుత్, పోలీస్ శాఖ, పోస్టల్ శాఖల సహకారంతో పదవ తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్, (రెవెన్యూ) వేణుగోపాల్, డి.ఈ.ఓ. రవీందర్, పరీక్ష నిర్వహణ అసిస్టెంట్ కమిషనర్ మధుకర్, ఏ.ఎస్.పి. షాకీర్ హుస్సేన్, విద్యా శాఖ, వైద్య, రెవెన్యూ, పోలీస్, విద్యుత్, ఆర్.టి.సి, ట్రాన్స్పోర్ట్, పోస్టల్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష 10వ. తరగతి పరీక్షలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్టీసీ ద్వారా అన్ని రూట్లలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని, పోలీస్ శాఖ ద్వారా ఎస్కార్ట్ లను ఏర్పాటు చేయాలని, వైద్య శాఖ వారు ఏఎన్ఎం, ఆశా వర్కర్ లను ఏర్పాటు చేయాలని, ప్రతి పరీక్ష కేంద్రాల వద్ద ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లను, మెడికల్ కిట్ లను అందుబాటులో ఉంచాలని, డి పి ఓ, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, విద్యుత్ శాఖ వారు పరీక్ష సమయాలలో విద్యుత్ సరఫరా అందించాలని ఆమె సూచించారు. పరీక్షా కేంద్రాలకు సెల్ ఫోన్ లను అనుమతి లేదని, సీ.సీ. కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఒక్క నిమిషం ఆలస్యం అయినా అనుమతించరాదని ఆమె తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో పరీక్షలు సజావుగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయనైనది.

Share This Post