10వ. తరగతి పరీక్షల ఏర్పాట్లపై సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రిక ప్రకటన.    తేది:25.04.2022, వనపర్తి.

మే, 23వ తేది నుండి జూన్ 1వ. తేది వరకు నిర్వహించనున్న 10వ. తరగతి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆదేశించారు.
సోమవారం ఐ.డి.ఓ.సి. సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో 10 వ తరగతి పరీక్షల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మే 23వ. తేది నుండి  జూన్ 1వ. తేది వరకు, ఉదయం గం. 9.30 ని.ల నుండి మధ్యాహ్నం గం.12.45 నీ.ల వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు. విద్య, వైద్య, రెవెన్యూ, పోలీస్, విద్యుత్, ఆర్.టి.సి, (ట్రాన్స్పోర్ట్) పోస్టల్ శాఖల అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆమె అన్నారు. ఉపాధ్యాయులు, అధికారులు అందుబాటులో ఉండాలని, పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని ఆమె సూచించారు. పరీక్షలు సాజావుగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ద్వారా పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని, ప్రశ్నపత్రాల తరలింపుకు ఎస్కార్ట్ ను ఏర్పాటు చేయాలని, పరీక్ష కేంద్రాల వద్ద పరీక్ష సమయంలో 144 సెక్షన్ అమలు చేయాలని, పరీక్ష నిర్వహించే పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆమె తెలిపారు. ఫ్లైయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేయాలని, పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్.టి.సి. బస్సులు అన్ని రూట్లలో నడిపించాలని, వైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రతి పరీక్ష కేంద్రంలో ఎ.ఎన్.ఎమ్. లను ఏర్పాటు చేసి అవసరమైన మెడికల్ కిట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, త్రాగునీరు సదుపాయాలు కల్పించాలని, పరీక్షలు పూర్తి అయ్యేంత వరకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు ఆమె సూచించారు.
జిల్లాలో మొత్తం 7వేల 306 మంది విద్యార్థులు, 35 పరీక్షా కేంద్రాల్లో పరీక్షకు హాజరు అవుతున్నట్లు, 9 కేంద్రాలలో ప్రశ్నపత్రాలు భద్రపరుస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్లను ఆన్లైన్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలని, సెల్ ఫోన్ లను పరీక్షా కేంద్రాలకు అనుమతించరాదని, సి.సి. కెమెరాలను ఏర్పాటు చేయాలని, ఒక్క నిమిషం ఆలస్యం అయినా అనుమతించేది లేదని, మాల్ ప్రాక్టీస్ జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పరీక్షలు సజావుగా నిర్వహించేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్, (రెవెన్యూ) వేణుగోపాల్, డి.ఈ.ఓ. రవీందర్, పరీక్ష నిర్వహణ అసిస్టెంట్ కమిషనర్ మధుకర్, విద్యా శాఖ, వైద్య, రెవెన్యూ, పోలీస్, విద్యుత్, ఆర్.టి.సి, ట్రాన్స్పోర్ట్, పోస్టల్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
—————–
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post