12-08-2021*నేర విచారణ మరింత సమర్ధవంతంగా ఉండాలి : డిఐజి ఏ.వి. రంగనాధ్*

నల్లగొండ : నేర విచారణ మరింత సమర్ధవంతంగా చేయడంతో పాటు కేసులను సత్వరం పరిష్కరించే విధంగా పోలీస్ అధికారులంతా సమర్ధవంతంగా పని చేయాలని డిఐజి ఏ.వి. రంగనాధ్ చెప్పారు.
గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నేర విచారణ మరింత సమర్ధవంతంగా, అన్ని స్థాయిలలో అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ ముందుకు సాగాలని అన్నారు. పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 14 రకాల వర్టీకల్స్ ను అన్ని స్థాయిల పోలీస్ అధికారులు సమర్ధవంతంగా అమలయ్యే విధంగా చూడాలని ఆదేశించారు. సమావేశంలో ఫంక్షనల్ వర్టీకల్స్ పై సమీక్ష నిర్వహించారు. ఫంక్షనల్ వర్టీకల్స్ విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. వర్టీకల్స్ కు సంబందించిన అన్ని అంశాలను ఆన్ లైన్ నమోదులో రిసెప్షన్, సిసిటిఎన్ఎస్ ఆపరేటర్ల పాత్ర చాలా కీలకమని చెప్పారు. పిర్యాదుదారులకు సంబందించిన అన్ని రకాల డాక్యుమెంట్స్ ఎప్పటికప్పుడు ఆన్ లైన్ ద్వారా సమర్పించడం ద్వారా పోలీస్ అధికారుల పనితీరును రాష్ట్ర, జిల్లా స్థాయిలలో అంచనా వేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. పోలీస్ శాఖలో అమలు చేస్తున్న 14 రకాల వర్టీకల్స్ విషయంలో ప్రతి పోలీస్ అధికారి శ్రద్ద వహించాలని సూచించారు. డయల్ 100కు వచ్చే ప్రతి ఫోన్ కు విధిగా స్పందించడంతో పాటు సాధ్యమైనంత త్వరితంగా ఘటనా స్థలానికి చేరుకోవడం ద్వారా ప్రజలలో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని మరింత పెంచేలా పని చేయాలని, తద్వారా నేర నియంత్రణలో కీలకంగా పని చేయాలని సూచించారు. అదే సమయంలో కోర్టు కానిస్టేబుల్స్ పనితీరు మెరుగు పర్చుకుంటూ శిక్షల శాతం పెరిగేలా చేయడం ద్వారా పోలీస్ శాఖ గౌరవం మరింత పెరుగుతుందని చెప్పారు. అదే సమయంలో విధి నిర్వహణలో మరింత బాధ్యతాయుతంగా పని చేస్తూ ప్రజలకు సేవలందించాలని రంగనాధ్ సూచించారు.
సమావేశ అనంతరం పోలీస్ శాఖలో సమర్ధవంతమైన సేవలందించిన పోలీస్ అధికారులను డిఐజి రంగనాధ్ అభినందించి వారికి పతకాలు అందజేశారు.
*డిఐజికి కృతజ్ఞతలు తెలిపిన పోలీస్ అధికారుల సంఘం*
జిల్లా పోలీసు శాఖలోని ఉద్యోగులకు నూతన పి.ఆర్.సి. అమలు జరిగేలా అన్ని చర్యలు తీసుకోవడం ద్వారా జులై నెల నూతన పి.ఆర్.సి.తో కూడిన వేతనం ఉద్యోగుల అకౌంట్లలో జమ అయ్యేలా చర్యలు తీసుకున్న సందర్భంగా పోలీస్ అధికారులు సంఘం జిల్లా అధ్యక్షుడు బి. జయరాజ్, నాయకులు సోమయ్య డిఐజి ఏ.వి. రంగనాధ్ కు పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.
సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీమతి నర్మద, డిఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, రవీందర్, రమణా రెడ్డి, సురేష్ కుమార్, సిఐలు బాలగోపాల్, చంద్ర శేఖర్ రెడ్డి, నిగిడాల సురేష్, పి.ఎన్.డి. ప్రసాద్, ఆదిరెడ్డి, సత్యం, నాగరాజు, సత్యనారాయణ, గౌరు నాయుడు, శంకర్ రెడ్డి, రాఘవులు, వెంకటేశ్వర్లు, రౌతు గోపి, రవీందర్, ఆర్.ఐ.లు స్పర్జన్ రాజ్, నర్సింహా చారి, శ్రీనివాస్, కృష్ణారావులతో పాటు ఎస్.ఐ.లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post