15-18 సం॥ల వయస్సు వారికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

కొవిడ్‌ వైరస్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భాగంగా 15 నుండి 18 సం॥ల వయస్సు గల పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రజల సహకారంతో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళుతుందని, ఈ మేరకు 15 సం॥ల నుండి 18 సం॥ల వయస్సు గల పిల్లలకు వ్యాక్సిన్‌ అందించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని, అందరు సహకరించి స్వచ్చందంగా ముందుకు వచ్చి కొవిడ్‌ టీకా తీసుకోవాలని తెలిపారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ వైరస్‌ విసృతంగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరు మరింత మరింత అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలిపారు. జిల్లాలో మొదటి డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నవారు 103 శాతం ఉండగా రెండవ డోసు తీసుకున్న వారు 77 శాతం ఉన్నారని, ప్రతి ఒక్కరు రెండు డోసుల వ్యాక్సినేషన్‌ తీసుకొని వైరస్‌ను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని, అధికార యంత్రాంగానికి సహకరించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. కొమురం బాలు, ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు డా. అరవింద్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెంట రాజయ్య, వైద్యాధికారులు బాలాజీ, ఫయాజ్‌ ఖాన్‌, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post