18 సం॥లు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

18 సం॥లు నిండిన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమవేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌తో కలిసి రాజస్వ మండల అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం-2022 పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు పాత్ర చాలా కీలకమైనదని, సమర్థవంతమైన నాయకత్వం ఎన్నుకోవడం ద్వారా అభివృద్ధి, ప్రజల సంక్షేమ పథకాలు సక్రమంగా పొందడంతో పాటు ప్రజలు ప్రశాంతమైన జీవనం గడపవచ్చని, ఓటు రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అని తెలిపారు. తేది : 01-01-2022 నాటికి 18 సం॥ల వయస్సు నిండి ప్రతి ఒక్కరు తమ వివరాలను నమోదు చేసుకొని ఓటు హక్కు పొందాలని తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు రెండు / మూడు ఎపిక్‌ కార్డులు కలిగిన వారి వివరాలు, చిరునామా మారిన వారి వివరాలు, చనిపోయిన వారి వివరాలు తొలగించడం, బూత్‌ స్థాయి అధికారులచే ఇంటింటి సందర్శన / పరిశీలన చేయడం, సెక్షన్ల ఏర్పాటు, పోలింగ్‌ కేంద్రాల హేతుబద్దీకరణ చేయడం జరుగుతుందని తెలిపారు. నవంబర్‌ 1వ తేదీన సమీకృత ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ చేయడం జరుగుతుందని, నవంబర్‌ 30వ తేదీ వరకు అభ్యంతరాలు, వినతులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. నవంబర్‌ 1వ తేదీ నుండి 30వ తేదీ మధ్య గల రెండు శనివారాలు, రెండు ఆదివారాలలో ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం జరరుగుతుందని, డిసెంబర్‌ 20వ తేదీ వరకు అభ్యంతరాలు, వినతులను పరిష్కరించడం జరుగుతుందని, తేది : 05-01-2022 నాడు ఓటర్ల జాబితా తుది ప్రచురణ చేయడం జరుగుతుందని తెలిపారు. ఒక పోలింగ్‌ కేంద్రానికి 1500 మంది ఓటర్లను కేటాయించడం జరుగుతుందని, పోలింగ్‌ కేంద్రం పరిధిలో అంతకంటే అధికంగా ఉన్నట్లయితే సమీప కేంద్రాలలో తక్కవ సంఖ్య ఉన్న కేంద్రాలకు విభజించడం జరుగుతుందని, పోలింగ్‌ కేంద్రాల మధ్య ఎన్నికల కమీషన్‌ నిబంధనల ప్రకారం 2 కిలోమీటర్లకు మించి ఎక్కువ దూరం ఉండకూడదని, జిల్లాలోని మూడు నియోజకవర్ధాల పరిధిలో ఏమైనా అభ్యంతరాలు, సమస్యలు ఉన్నట్లయితే రాజకీయ పార్టీల ప్రతినిధులు దరఖాస్తు రూపంలో అందించినట్లయితే పరిశీలిస్తామని తెలిపారు. ఓటర్లు తమ వివరాలు నమోదు చేసుకునేందుకు గాను ప్రభుత్వం ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌ను రూపొందించడం జరిగిందని, ఈ ద్వారా ఓటరు సేవలు, సదుపాయాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని, 18 సం[॥[లు నిండిన ప్రతి ఒక్కరు ఈ యాప్‌ను వినియోగించుకొని ఫారం-6 ద్వారా తమ వివరాలు నమోదు చేసుకోవడంతో పాటు అసెంబ్లీ నియోజకవర్గం మారినప్పుడు ఫారం-6, చిరునామా మారినప్పుడు ఫారం-8ఎ, ఏవైనా సవరణలు ఉన్నట్లయితే-8, జాబితాలో పేరు తొలగింపు కొరకు ఫారం-7 ద్వారా సరి చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం ఓటర్‌ హెల్ప్‌లైన్‌ సంబంధిత గోడప్రతులను విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు వేణు, శ్యామలాదేవి, ఎన్నికల ఉప తహశిల్దార్‌ శ్రీనివాస్‌, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post