18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరు జాబితాలో నమోదయ్యేలా ప్రత్యేక దృష్టి సారించాలి

18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరు జాబితాలో నమోదయ్యేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఓటరు జాబితా( ఎలక్టోరల్ రోల్) పరిశీలకులు (చేనేత, జౌళి శాఖ కమిషనర్) శైలజా రామయ్యర్ సూచించారు.

ప్రత్యేక ఓటరు నమోదు, సవరణ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆమె సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి, రెవిన్యూ డివిజనల్ అధికారులు, సంబంధిత అధికారులతో ప్రత్యేక ఓటరు నమోదు, సవరణ, తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తప్పులు లేని ఓటరు జాబితాను రూపొందించాలన్నారు. జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలన్నారు. మరణించిన వారి పేర్లను అన్ని
ఎవిడెన్స్ తో జాబితా నుండి తొలగించాలన్నారు.

ఓటర్ నమోదు విషయమై ముమ్మర ప్రచారం చేయాలన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో అవగాహన కల్పించి, చైతన్య పరచాలని సూచించారు. ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. ఓటరు జాబితాలో లాజికల్ , డెమోగ్రాఫిక్ పొరపాట్లు లేకుండా సవరించాలన్నారు. ఆయా దరఖాస్తులు రాగానే వెంటవెంటనే పరిశీలించాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ తప్పులు లేని ఓటరు జాబితా నవీకరణ కు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నవంబర్ 1న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశామని ,గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించామని తెలిపారు. వారి సహకారంతో జిల్లాల్లో అర్హులైన వారందరిని ఓటరు జాబితాలో నమోదయ్యేలా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు.

ఓటరు నమోదుకు ఈ నెల 6, 7, 27, 28 తేదీలలో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ప్రత్యేకించి 18 సంవత్సరాలు పైబడిన వారందరిని ఓటరుగా నమోదు చేయడం, చనిపోయిన ఓటర్లను తొలగించడం పై దృష్టి సారించామని తెలిపారు. ప్రత్యేక శిబిరాలలో భాగంగా అన్ని బూత్ లలో బూత్ లెవల్ అధికారి వద్ద అన్ని రకాల ఫారాలు అందుబాటులో ఉంచామన్నారు. ఓటర్లు మీసేవ ద్వారా, ఫిజికల్ గా ఆన్లైన్లో దరఖాస్తు చేస్తున్నారని, పట్టణ ప్రాంతాల్లో ఓటరు నమోదు పెరిగిందని అబ్జర్వర్ కు వివరించారు. అన్ని రాజకీయ పార్టీలు బూత్లెవల్ ఏజెంట్లను నియమించేలా సూచించామని తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితా పై అభ్యంతరాలను ఈ నెల 30 వరకు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. తాజా ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

అనంతరం సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి, పసల్ వాది గ్రామాలలో, అందోల్, జోగిపేటలో ఓటర్ నమోదు ప్రత్యేక క్యాంపెయిన్ ను ఆమె పరిశీలించారు. సంబంధిత బూత్ లలో బిఎల్ వో ల వద్ద ఉన్న ఓటరు జాబితాలను పరిశీలించారు. ఆయా బూత్ లలో ఎంతమంది ఓటర్లుగా నమోదయ్యారు, అందులో 18 సంవత్సరాలు నిండిన వారు ఎంతమంది, చనిపోయిన వారిని తొలగిస్తున్నారా, ఏ విధంగా తొలగిస్తున్నారు? నోటీసులు ఇస్తున్నారా? నిబంధనలు పాటిస్తున్నారా, ఓటరు నమోదు, ఇతర ఫారాలు ,అందుబాటులో ఉన్నాయా అన్న వివరాలను బూత్ లెవల్ అధికారులను ఆరా తీశారు. ఆయా బూత్ పరిధిలో 18 ఏళ్ళు నిండిన వారందరినీ ఓటరుగా నమోదు చేయడంలో కీలకపాత్ర పోషించాలని బి ఎల్ ఓ లకు సూచించారు. జిల్లాలో ఓటరు నమోదు, సవరణ కార్యక్రమం సమర్థవంతంగా జరుగుతుందని ఆమె సంతుప్తిని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి రాధిక రమణి, రెవిన్యూ డివిజనల్ అధికారి అంబదాస్, తహసీల్దార్ స్వామి, ఎన్నిక విభాగం అధికారులు, సిబ్బంది, ఆయా బూత్ లెవెల్ అధికారులు పాల్గొన్నారు.

Share This Post