ఓటరు జాబితా ప్రత్యేక సవరణ 2022 క్రింద ఓటర్ల జాబితాలో సవరణలు, తొలగింపులు,మార్పులు, చేర్పుల వంటివి చేసి తుది ఓటరు జాబితాను ప్రచురించాలని జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు అన్నారు.
శుక్రవారం తన ఛాంబరులో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ పై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కొత్త ఓటర్ల నమోదు, చనిపోయిన, ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఓటర్ల తొలగింపు, మార్పులు, చేర్పుల పై వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి తుది జాబితా ప్రచురించడం జరుగుతుందని అన్నారు.
నవంబర్, 1వ తేదీన ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ముసాయిదా ఓటరు జాబితాను అన్ని పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని, ఓటర్లకు ఓటరు జాబితాలో ఏమైనా పేర్లలో మార్పులు ఉన్నా ,ఫోటో లేకపోయిన తదితర సమస్యలు ఉంటే వాటిని నవంబర్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించి సరిచేయాలని చెప్పారు. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను పరిష్కరించిన అనంతరం 2022 జనవరి, 5 న తుది ఓటరు జాబితాను ప్రచురించాలని అధికారులకు సూచించారు.
అదనపు పోలింగ్ స్టేషన్లు, లేదా పోలింగ్ కేంద్రాల మార్పు ఉన్నచోట రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించి వారి సూచనలను తీసుకుని మార్పులను చేయాలని చెప్పారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జనవరి, 1 2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి అయిన యువతి, యువకులు ఆన్లైన్ ద్వారా లేదా ఫారం- 6 ద్వారా కానీ ఓటరు జాబితాలో తమ పేర్లను ఓటరుగా నమోదు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకునే విధంగా చూడాలని, రాజకీయ పార్టీల వారిగా బూతు లెవెల్ ఏజంట్ల లిస్టును ఇవ్వాలని ఆదేశించారు.
ముసాయిదా ఓటరు జాబితాను ప్రతుల రూపంలోనే ఇవ్వాలని,ఒకవేళ ఓటరు మరో చిరునామాకు మారినట్లైతే అక్కడే ఓటు వేసే అవకాశం కల్పించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు అదనపు కలెక్టర్ తిరుపతి రావును కోరారు.
ఈ సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.