2019, 2020 వ సంవత్సరాలలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కల గణనను పకడ్బందీగా నిర్వహించాలి- రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి.

2019, 2020 వ సంవత్సరాలలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కల గణనను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి జిల్లా కలెక్టర్లు, అటవీశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో మొక్కల గణనపై జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో 2019, 2020 సంవత్సరాలకు సంబంధించిన హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కల 1% సంరక్షణ గణనను సెప్టెంబర్ 1వ తేదీ నుండి సెప్టెంబర్ 15వ తేది వరకు పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
2019, 2020 సంవత్సరాల లో చేసిన హరితహారం ప్లాంటేషన్ మూల్యాంకనం సెప్టెంబర్ 1వ తేది నుండి 15వ తేది వరకు రాష్ట్ర వ్యాప్తంగా అటవీ మరియు సంబంధిత శాఖల ద్వారా చేపట్టబడుతుందన్నారు. జిల్లాల కలెక్టర్లు, అధికారులు హరితహారం మొక్కల గణనకు సంసిద్ధంగా ఉండాలన్నారు. మొక్కల గణనకు టీం లను ఏర్పాటు చేయాలని, మొక్కల గణనకు సంబందించి వివరాలు ఏ రోజుకు ఆ రోజు ఎక్సల్ షీట్లో అప్ లోడ్ చేయాలని అన్నారు. అటవీ శాఖ అధికారుల సమన్వయంతో పని చేయాలని సూచించారు.
ఈ సందర్బంగా రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ జిల్లాలో మొక్కల గణనకు టీంలను ఏర్పాటు చేసి ముక్కల గణన చేపడతామని, తమరు సూచించిన అన్ని అంశాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో జిల్లా నుండి గ్రామీణాభివృద్ధి అధికారి ప్రభాకర్ , అటవీశాఖ అధికారి జానకి రామ్, మున్సిపల్ కమీషనర్లు , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ 2019, 2020 సంవత్సరాలలో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కల గణనకు అటవీ అధికారులను భాగస్వామ్యం చేస్తూ టీం లను ఏర్పాటు చేసి మొక్కల గణన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మొక్కల గణనలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Share This Post