2021-23 సంవత్సరానికి గాను జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు కార్యక్రమం పూర్తి : జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య

జనగామ నవంబరు 20 : జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు లక్కీ డ్రా కార్యక్రమం ప్రశాంతంగా పూర్తయినట్లు జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య అన్నారు. శనివారం నందన గార్డెన్స్ లో అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మద్యం దుకాణాల లక్కీ డ్రా కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 47 మద్యం దుకాణాలకు గానూ, 1512 దరఖాస్తులు వచ్చాయని, ప్రభుత్వ నిబంధనల మేరకు దరఖాస్తులు తక్కువగా ఉన్న కారణంగా జనగామ మునిసిపల్ పరిధి లో ఒకటి , పెంబర్తి లో ఒకటి ఉన్న ఈ రెండు మద్యం దుకాణాలకు డ్రా తాత్కాలికంగా నిలిపివేయడం జరిగిందని తెలిపారు. శనివారం మొత్తం 45 మద్యం దుకాణాలకు గాను లక్కీ డ్రా నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ డిసెంబర్, 1 వ తేదీ నుండి మద్యం దుకాణాలు దక్కించుకున్న అభ్యర్థుల గడువు మొదలై రెండు సంవత్సరాల పాటు ఉంటుందని తెలిపారు. ఈ లక్కీ డ్రా కార్యక్రమం దరఖాస్తుదారుల సమక్షంలో పూర్తిగా పారదర్శకంగా నిర్వహించడం జరిగిందని, ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియోగ్రఫీ చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కాగా అబ్కారీ శాఖ అధికారులు ఈ కార్యక్రమ నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విడతల వారిగా అభ్యర్థులను అనుమతిస్తూ, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టి డ్రా కార్యక్రమం నిర్వహించామని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్. మహిపాల్ రెడ్డి, ఏసిపి జి. కృష్ణా, సిఐ బాలాజీ వరప్రసాద్, ఎక్సైజ్ సిఐలు సిహెచ్.నాగేశ్వర్ రావు, బి.ముకుందరెడ్డి, ఎం.బ్రహ్మానందరెడ్డి, మద్యం దుకాణల దరఖాస్తుదారులు పాల్గొన్నారు.

Share This Post