2022 మేడారం శ్రీ సమ్మక్క- సారలమ్మ జాతర పనుల కొరకు ప్రతిపాదనలు అందజేయాలని రాష్ట్ర గిరిజన అభివృద్ధి మరియు మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్

 

ప్రచురణార్థం
ములుగు జిల్లా

సెప్టెంబర్ 21 (మంగళవారం).

2022 మేడారం శ్రీ సమ్మక్క- సారలమ్మ జాతర పనుల కొరకు ప్రతిపాదనలు అందజేయాలని రాష్ట్ర గిరిజన అభివృద్ధి మరియు మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధ్యక్షతన 2022 సంవత్సరంలో నిర్వహించనున్న మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో ముందస్తు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ గతంలో నిర్వహించిన మేడారం జాతరను దృష్టిలో పెట్టుకొని అత్యధిక సంఖ్యలో హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించి ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా ఆదేశించడం జరిగిందని అన్నారు. రామప్పగుడి అభివృద్ధి పనుల కొరకు ఇరిగేషన్, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ తదితర శాఖల అధికారులచే గత వారంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన సమావేశం నిర్వహించి పనులను గుర్తించడం జరిగిందని, రామప్ప పరిసర ప్రాంతాల్లో తెలంగాణ స్టేట్ సీడ్స్ కార్పొరేషన్ వారికిగల 23 ఎకరాల స్థలం లోంచి కొంత భాగంలో పర్యాటక రంగ అభివృద్ధికి ఉపయోగించేందుకు చర్యలు చేపడుతున్నామని, రామప్ప అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్నoదున రామప్ప చెరువులో ఐలాండ్ నిర్మాణం, వాటర్ స్పోర్ట్స్, సమాచార కేంద్రం, టూరిజం విలేజ్ ఏర్పాటు తదితర ఏర్పాట్లు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుందని మరో 40 వేల మందికి మాత్రమే వ్యాక్సినేషన్ చేయాల్సి ఉందని దానిని వారం రోజుల్లో పూర్తి చేస్తామని వివరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర గిరిజన అభివృద్ధి మరియు స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ రెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర 2022 ఫిబ్రవరి 16, 17, 18, 19 తేదీలలో నాలుగు రోజులు జరుపుకునేందుకు ఆలయ పూజారులు నిర్ణయించారని జాతర సమయం కూడా నిర్ణయం జరిగినందున ఆలస్యం చేయకుండా వెంటనే సంబంధిత శాఖల అధికారులు పనులను గుర్తించి ఎక్కువ కాలం మన్నేలా పర్మనెంట్ పనులకోసం ప్రతిపాదనలు అందజేయాలని అన్నారు. ముఖ్యంగా మేడారానికి దారి తీసే అన్ని వైపుల నుండి ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖల ద్వారా గుర్తించిన రహదారుల మరమ్మతు పనులు, వర్షాలతో దెబ్బతిన్న రహదారుల నిర్మాణ పనుల కోసం ప్రతిపాదనలు అందించాలని అదేవిధంగా అధిక వర్షాలతో దెబ్బతిన్న జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రహదారులు, వంతెనల మరమ్మతుల కొరకు ప్రత్యేకంగా ప్రతిపాదనలు పంపించాలని అన్నారు. జాతర సమయంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా అదనంగా త్రాగునీరు, వసతి, విద్యుత్తు, మరుగుదొడ్ల సౌకర్యాలను కల్పించేందుకు తాత్కాలికంగా మరియు శాశ్వత పద్ధతిలో ప్రతిపాదనలు పంపించాలని, దేవాదాయశాఖ ద్వారా చేపట్టిన భవన నిర్మాణ పనులను పూర్తిచేయాలని, జంపన్న వాగు వద్ద నీటి ప్రవాహంతో ప్రమాదాలు జరగకుండా జంపన్న వాగు అభివృద్ధి పనులు ఇరిగేషన్ శాఖ ద్వారా చేపట్టాలని,స్నాన ఘట్టాలు డ్రెస్ చేంజింగ్ రూమ్ లను నిర్మించాలని, జల్లు స్నానాలకు బ్యాటరీ అప్ టాప్ లను ఏర్పాటు చేయాలని, వాగులో గల బావులలో ఇసుక పూడిక తీయాలని అన్నారు. జాతర సమయంలో పారిశుద్ధ పనుల్లో లోపం కలగకుండా ముందస్తుగా కార్యాచరణ రూపొందించుకోవాలని పంచాయతీ అధికారులను, కోవిడ్ నేపథ్యంలో భక్తులకు అవసరమైన వైద్య సేవలను అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, గిరిజన సాంప్రదాయాలకు విఘాతం కలగకుండా ఆలయ పూజారులతో సమన్వయం చేసుకొని ఆలయ పరిసర ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దాద్ధి ఇతర పూజా కార్యక్రమాలను గిరిజన సంప్రదయాలతో నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని, మేడారంతో పాటు కొండాయి, పునుగుండ్ల గుడుల వద్ద అభివృద్ధి పనులు చేపట్టాలని దేవాదాయశాఖ అధికారులను ఆదేశించారు. జాతరకు వచ్చే ప్రజల రద్దీకి అనుగుణంగా టిఎస్ ఆర్టిసి వారు వాహనాలను నడపాలని, పోలీస్ శాఖవారు నిరంతరం అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షించాలని అన్నారు.

యునెస్కో గుర్తింపుతో రామప్పకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చి పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని పెరుగుతున్న పర్యాటకులకు సరిపడు సౌకర్యాలను అభివృద్ధి చెందాలని, అదేవిధంగా రామప్ప నుండి విడుదలయ్యే నీటిని రామప్ప ఆలయ అభివృద్ధి కొరకు చేపట్టనున్న నిర్మాణాలకు ఇబ్బంది కలగకుండా మోరంచవాగులోకి మళ్ళించే విదంగా సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించాలని, పంచాయతీ రాజ్ మరియు ఆర్అండ్బి శాఖల అధికారులు అవసరమైన రహదారులు నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని, తూర్పు సైడ్ హై లెవల్ వంతెనను పంచాయతీ రాజ్ శాఖ వారు చేపట్టాలని అన్నారు. 40 కోట్ల రూపాయల నిధులతో జంగాలపల్లి ఎక్స్ రోడ్ నుండి రామప్ప ఆలయం వరకు నాలుగు వరసల రహదారి నిర్మాణానికి ప్రభుత్వం చెర్యలు చేపట్టిందని అన్నారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్ నగరం, వరంగల్ నగరంలో జిల్లాలోని టూరిజం ప్రాంతాల వివరాలను తెలుపుతూ బోర్డులను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు.
జిల్లాలో అధికారుల సమన్వయంతో కోవిడ్-19 వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతుందని అభినందించి కోవిడ్ వ్యాక్సిన్ తోపాటు ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ సోకకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. దొడ్డు రకం బియ్యం, బాయిల్డ్ బియ్యంను ఎఫ్సిఐ వారు కొనుగోలు చేసేందుకు విముఖత చూపుతున్నారు కాబట్టి వాటికి ప్రత్యామ్నాయంగా పామాయిల్, ఇతర వాణిజ్య పంటలను, ఉద్యానవన పంటలను పండించేందుకు రైతులను చైతన్యవంతం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దేశం మొత్తం రామప్ప వైపు చూస్తుందని ప్రభుత్వం రామప్ప అభివృద్ధి కోసం తీసుకుంటున్న పనులను అధికారులు మనసుపెట్టి పూర్తిచేయాలని అన్నారు. అధిక వర్షాలతో రామప్ప పరిసర రహదారులు ఎప్పటికీ మరమ్మతులకు గురవుతున్నందున 11800 క్యూసెక్కుల నీటిని రామప్ప నుండి వదిలిన తట్టుకునేలా కెనాల్ ను నిర్మించాలని, రామప్ప గుడి వాస్తు రోడ్డు, తూర్పు రోడ్డు, పశ్చిమ రోడ్లను ఆలయానికి అనుగుణంగా సరైన పద్ధతిలో నిర్మించాలని, రామప్ప ఆలయ అభివృద్ధికి నిధులను అందించేందుకు అనేక కంపెనీలు సిఎస్ఆర్ నిధులను అందించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
జిల్లా ఎస్పి సంగ్రామ్ సింగ్ పాటిల్ మాట్లాడుతూ మేడారంలో జాతర సందర్భంగా పోలీస్ శాఖ వారికి శాశ్వత ఆవాసం లేకపోవడం మూలంగా వర్షాలు కురిసిన సమయంలో అనేక ఇబ్బంది కలుగుతుందని పోలీస్ శాఖకు మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ సమావేశంలో ములుగు ఏఎస్పి సాయి చైతన్య, జిల్లా రెవెన్యూ అధికారి రమాదేవి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి మాకిడి ఎర్రయ్య, మేడారం ఆలయ కార్యనిర్వాహక అధికారి రాజేందర్, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్. అప్పయ్య, ఏటూరునాగారం ఐటిడిఎ ఏపీవో (జనరల్) వసంతరావు, ఇఇ ఆర్డబ్ల్యూఎస్ బి.మణిక్యరావు, పంచాయతీరాజ్ ఇఇ రాంబాబు,టీఎస్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ విజయభాస్కర్, అగ్నిమాపక శాఖ అధికారి బి. మల్లికార్జున యాదవ్, టూరిజమ్ అధికారి శివాజీ, ట్రైబల్ వెల్ఫేర్ ఇఇ హేమలత, విద్యుత్, ఇరిగేషన్, ఆర్ అండ్ బి తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post