22 న వైభవంగా వజ్రోత్సవాల ముగింపు వేడుకలు – కమిటీ చైర్మన్ కేశవరావు

భారత స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా ఈ నెల 22 వ తేదీన ఎల్.బి స్టేడియం లో నిర్వహించాలని వజ్రోత్సవ కమిటీ చైర్మన్, ఎం.పి. కె. కేశవరావు అధ్యక్షతన నేడు బీఆర్కేఆర్ భవన్ లో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, శ్రీనివాస గౌడ్, హైద్రాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యే రసమయి బాల కిషన్, భాషా సాంస్కృతిక విభాగం సలహాదారు రమణా చారి, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ పలువురు సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా కమిటీ చైర్మన్ కె. కేశవ రావు మాట్లాడుతూ, ఈనెల 8 తేదీ నుండి నిర్వహిస్తున్న భారత స్వతంత్ర వజ్రోత్సవాల కార్యక్రమాలన్నింటినీ విజయవంతంగా నిర్వహిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులను అభినందించారు. ఈనెల 21 తేదీన పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.

22 వ తేదీన ఎల్.బి స్టేడియంలో జరిగే ముగింపు ఉత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారని వెల్లడించారు. ఈ సందర్బంగా శంకర్ మహదేవన్, శివమణి డ్రమ్స్, దీపికా రెడ్డి బృందంచే నృత్యం, తెలంగాణా జానపద కార్యక్రమాలు, లేజర్ షో ఉంటాయని వివరించారు. కార్యక్రమం ముగింపు సందర్బంగా పెద్ద ఎత్తున క్రాకర్ ప్రదర్శన ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమాలన్నీ దేశ స్వతంత్ర పోరాటం, దేశభక్తి ప్రధానంగా ఉంటాయని వెల్లడించారు. పూర్తి కార్యక్రమాలు ఏవిధంగా ఉంటాయనేవి జీఏడీ కార్యదర్శి ఆధ్వర్యంలోని అధికారుల కమిటీ నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. ఈ ముగింపు కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలనుండి దాదాపు 20 వేలకు పైగా హాజరవుతారని కేశవ రావు తెలిపారు.

ఈ సమావేశంలో ఐ.టి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి,  నగర పోలీస్ కమీషనర్ సి.వీ. ఆనంద్, అడిషనల్ డీజీపీ జితేందర్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్  కుమార్ సుల్తానియా, ఉన్నత విద్యా శాఖ కమీషనర్ నవీన్ మిట్టల్, జీహెచ్ ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, హైదరాబాద్ కలెక్టర్ అమయ్ కుమార్, సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Share This Post