(26 .07.2022) గరుడ యాప్ వినియోగం, ఓటరు నమోదుపై విస్తృత ప్రచారం కల్పించాలి : రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన
తేది 26 .07.2022, వనపర్తి.

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో పేరు నమోదు చేయాలని, గరుడ యాప్  వినియోగంపై విస్తృత ప్రచారం కల్పించాలని రాష్ట్ర  ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అధికారులకు ఆదేశించారు.
మంగళవారం హైదరాబాద్ నుండి ఓటరు నమోదుపై ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఓటర్ల నమోదుకు జనవరి 1వ. తేదీ ప్రమాణికంగా వుండేదని, ఈ సంవత్సరం నుంచి జనవరి 1వ, ఏప్రిల్ 1వ, జూలై 1వ, అక్టోబర్ 1వ. తేదీలను సైతం ప్రామాణికంగా తీసుకుంటూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు కల్పించేలా కార్యాచరణ  అమలు చేయాలని ఆయన తెలిపారు. జిల్లాలో ఓటరు జాబితా నమోదు ప్రక్రియపై అన్ని రాజకీయ పార్టీలతో  సమావేశం నిర్వహించాలని అయన సూచించారు.  ఓటర్ల జాబితాలో ఉన్న లాజికల్, డెమోగ్రాఫికల్ పొరపాట్లను పూర్తి స్థాయిలో సవరించాలని అధికారులకు ఆయన ఆదేశించారు.
ఆగస్టు 4వ. తేది నుండి అక్టోబర్ 24, 2022వ తేది వరకు ప్రీ రివిజన్ నిర్వహించి, నవంబర్ 9, 2022 న ముసాయదా ఒటరు జాబితాను విడుదల చేయాలని, డిసెంబర్ 8, 2022 వరకు సదరు జాబితాపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలని, రెండు శనివారాలు, ఆదివారాలు  ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని, డిసెంబర్ 26, 2022వ తేది లోగా అభ్యంతరాలను, ఓటర్ క్లెయిమ్స్ ను పూర్తి స్థాయిలో పరిష్కరించి, జనవరి 5, 2023న తుది ఓటరు జాబితా రూపొందించాలని ఆయన తెలిపారు. ఓటరు నమోదుకు సంబంధించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం వారిగా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేయాలని ఆయన సూచించారు. ఓటు ప్రాముఖ్యతను వివరిస్తూ జిల్లా వ్యాప్తంగా స్వీప్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని, స్విప్ కార్యక్రమాల నిర్వహణ పట్ల జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని ఆయన తెలిపారు. ఎన్నికల కమిషన్ ఫారం 6, ఫారం 7, ఫారం 6 బీ, ఫారం 8 నూతనంగా ప్రారంభించి, ఫారం 8ఏ రద్దు చేసిందని, ఫారం 6 లో  నూతన ఓటర్ నమోదు మాత్రమే ఉంటుందని, ప్రతి బూత్ స్థాయి అధికారి వద్ద నూతన ఫారంలు మాత్రమే అందుబాటులో ఉండే విధంగా జిల్లా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఆగష్టు 1, 2022 నుండి ఇంటింటి సర్వే నిర్వహించి, ఓటర్ల వద్ద నుండి ఆధార్ వివరాలు సేకరించాలని, ఆధార్ వివరాలు అందించడం ఐచ్చికం మాత్రమేనని, ఓటర్ల ఆధార్ వివరాలు లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. గరుడ యాప్ వినియోగంపై విస్తృత ప్రచారం కల్పించాలని, బుత్ స్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వాలని ఆయన తెలిపారు.
ఈ వీడియో కాన్పరెన్సులో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, ఎలక్షన్ సూపరింటెండెంట్ రమేష్ రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్, అధికారులు, తదితరులు పాల్గోన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.
………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post