30.08.2021 Nalgonda Dist భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి*

నల్గొండ, ఆగస్టు 30: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. సోమవారం డిజిపి ఎం. మహేందర్ రెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, నీటిపారుదల శాఖ అధికారులతో గత రెండు రోజుల నుండి కురుస్తున్న  వర్షాల కారణంగా తీసుకోవలసిన   చర్యలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ, గ్రామాల్లోని చెరువు కట్టలను, అలుగు, తూములను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున పశువులు, మనుషులు అటువైపు వెళ్లకుండా పోలీసులు నిఘా ఏర్పాటు చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లు నీట మునిగిన వారిని, ఇండ్లు కూలిన వారిని, శిథిలావస్థలో, కూలే స్థితిలో ఉన్న ఇళ్లను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించి భోజన వసతి కల్పించాలని తెలిపారు. పూర్తిగా ఇండ్లు ధ్వంసం అయిన వారికి ప్రభుత్వ పరంగా సహాయం వెంటనే అందేలా చూడాలన్నారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల వద్దకు సందర్శకులు రాకుండా చూడాలన్నారు. ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండి ఫ్లడ్‌ ప్రోటోకాల్‌ను పాటించి లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. లో లెవల్‌ బ్రిడ్జ్‌ , కాజ్‌వేలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి లో లెవల్‌ బ్రిడ్జ్‌, కాజ్‌వేల వద్ద గ్రామ సేవకులు, ఇంజనీరింగ్ సిబ్బంది కాపలా ఉంచాలన్నారు. ప్రమాద సంకేతంగా ఎర్రజెండాలు పాతి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. వాహనాలు, పాదచారుల రాకపోకలను నియంత్రించాలన్నారు. ఎటువంటి ప్రాణ, అస్తి నష్టం సంభవించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎస్ ఆదేశించారు. భారీ వర్షాలతో అవాంఛనీయ ఘటనలు జరిగితే ఎప్పటికప్పుడు రిపోర్ట్‌చేయాలని అన్నారు. దెబ్బతిన్న రోడ్లు, చెరువులు, కుంటలు, విద్యుత్ స్తంభాలు, కమ్యూనికేషన్ వ్యవస్థను వెంటనే పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలన్నారు. వచ్చే రెండు రోజులు భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
    వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అదనపు కలెక్టర్ వి. చంద్ర శేఖర్ మాట్లాడుతూ భారీ వర్షాల సూచనల మేరకు ఎటువంటి అవాంఛ నీయ పరిస్థితులు తలెత్తకుండా తహశీల్దార్,ఎం.పి.డి.ఓ.,పొలీస్, ఇరిగేషన్,మండల,గ్రామ అధికారులను అప్రమత్తం చేసినట్లు  తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రాణ,ఆస్తి నష్టం వాటిల్లకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉన్నట్లు, పరిస్థితిని అనునిత్యం సమీక్షిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
      ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు ఎస్.పి. నర్మద,ముఖ్య ప్రణాళిక అధికారి బాల శౌరి తదితరులు పాల్గొన్నారు.
———————————————-                  సహాయ సంచాలకులు,
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, నల్గొండచే జారిచేయనైనది.

Share This Post