5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ప్రచురణార్థం

ఖమ్మం, జూన్ 3:

5 వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని రఘునాధపాలెం మండలం జికే బంజర గ్రామంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గురువారం లాంఛనంగా ప్రారంభించి పలు అభివృధ్ది పనులకు ప్రారంబోత్సవాలు చేసారు. రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన జికే బంజర గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని, జికే బంజర గ్రామంలో రూ. 53.75 లక్షలతో నిర్మించిన సైడ్ కాల్వలను, రూ. 1.51 కోట్ల వ్యయంతో నిర్మించిన 30 రెండు పడకల ఇండ్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమంతో నేడు పట్టణాల్లో, గ్రామాల్లో గుణాత్మక మార్పు కనిపిస్తుందని అన్నారు. పల్లెలు పచ్చదనం-పరిశుభ్రతతో విలసిల్లుతున్నాయని ఆయన అన్నారు. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, వైకుంఠదామాలు, సెగ్రిగేషన్ షెడ్లు, నిర్మించుకున్నామని, ఈ దఫా పల్లె ప్రగతిలో క్రొత్తగా తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసుకుంటున్నామని అన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమం చేపట్టి పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కల్పనతో ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటున్నట్లు ఆయన తెలిపారు. గ్రామాల్లో హరితహారం, పల్లె ప్రకృతి వనాల ద్వారా పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణం, తెలంగాణా క్రీడా ప్రాంగణాలతో ఆరోగ్యపరంగా ఫిట్ నెస్ తో ఆరోగ్య తెలంగాణ రూపుదిద్దుకుంటుందని మంత్రి అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, గ్రామాల్లో పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వచ్చే వర్షాకాలానికి సీజనల్ వ్యాధుల పట్ల జాగురుకతతో ఉంటూ, నియంత్రణకు అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. చెత్తా చెదారం లేకుండా పరిసరాలు పరిశుభ్రత పాటించాలని, సైడ్ కాల్వల్లో ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ, నీటి నిలువలు లేకుండా చూడాలని అన్నారు. లోతట్టు ప్రదేశాల్లో ఎక్కడా నీరు నిల్వలు లేకుండా చూడాలని అన్నారు. డెంగ్యూ పట్ల అప్రమత్తంగా వుండాలని, దోమలు వ్యాప్తి చెందకుండా చూడాలని, ఫాగింగ్, కాల్వల్లో యాంటి లార్వా చర్యలు, ఖాళీ ప్రదేశాల్లో శుభ్రత చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రజల్లో సీజనల్ వ్యాధుల పట్ల పూర్తి అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామాల్లో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని ఆయన అన్నారు.
అనంతరం రఘునాధపాలెం మండలం చిమ్మపుడి గ్రామంలో ఏర్పాటుచేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మొగిలి స్నేహాలత, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఏఎంసి చైర్ పర్సన్ లక్ష్మీప్రసన్న, మండల తహసిల్దార్ నర్సింహారావు, ఎంపిడివో రామకృష్ణ, జెడ్పిటిసి ప్రియాంక, ఎంపిపి గౌరీ, సర్పంచ్ పిన్ని సరిత, వైస్ చైర్మన్ కొట్టేముక్కల వేంకటేశ్వర్లు అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.

Share This Post