52 మంది కవులకు సన్మానం, జ్ఞాపికలు, పారితోషికాలు అందచేత, కవి సమ్మేళనంలో పాల్గొన్న మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్,

పత్రిక ప్రకటన

తేదీ : 02–06–2022

 

తెలంగాణ ప్రభుత్వం కవులు, కళాకారులను ఎంతో గౌరవిస్తోంది,

జిల్లా కలెక్టరేట్లో ఘనంగా కవిసమ్మేళనం,

52 మంది కవులకు సన్మానం, జ్ఞాపికలు, పారితోషికాలు అందచేత,

కవి సమ్మేళనంలో పాల్గొన్న మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్,

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ కవులు, కళాకారులకు ఎంతో గౌరవాన్నిస్తున్నారని తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర ఎంతో కీలకమని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్  అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ‘ తెలంగాణ స్ఫూర్తి’ అనే అంశంపై  జిల్లా కలెక్టర్ అధ్యక్షతన  ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలో జిల్లా నుంచి 52 మంది కవులు పాల్గొని వారివారి కవితలను వినిపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ ఒక కవిత్వంలో ఎన్నో అర్థాలు ఉంటాయని కవిత్వం ద్వారా ప్రతి వ్యక్తిలో మంచి స్ఫూర్తి వచ్చేలా చేయడం కవులకే సాధ్యమని అన్నారు. మంచి కవిత్వాల ద్వారా ప్రజలకు కవులు తమలో దాగి ఉన్న కలను తెలియజేయాలని కోరారు.. ఒక్క కవిత్వం వంద మంది వ్యక్తులను ప్రభావితం చేస్తోందని అందుకే మంచిని ప్రోత్సహించేలా కవితలను రాయాలని కోరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కవితలతో ప్రతి వ్యక్తిలో స్ఫూర్తిని నింపారని వారి పాటలు ప్రతి ఒక్కరికీ చేరాయని అన్నారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 52 మంది కవులు తమ కవితల ద్వారా కవి సమ్మేళనం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని కలెక్టర్ తెలిపారు. కవులంటే ప్రతి ఒక్కరికీ గౌరవమని అన్నారు. దీంతో పాటు ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగా రాష్ట్ర ఏర్పాటు జరిగిందని పోరాడి సాధించుకొన్న తెలంగాణ  అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తూ  ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. కవులు తమ  రచనల ద్వారా  సమాజంలోని వివిధ అంశాలను స్పృశించి  ప్రజలను   చైతన్యవంతులను చేయాలని కోరారు.  రాష్ట్ర అభివృద్దే అమరులకు అసలైన నివాళి అని తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లో కవులకు ప్రభుత్వం మరింత గౌరవాన్ని ఇవ్వనుందని అరవై సంవత్సరాల్లో కవులకు ఎప్పుడూ జరగని గౌరవం ప్రస్తుత ప్రభుత్వహయాంలో జరుగుతుందని ఇది ఎంతో ఆనందకరమైన విషయమని  కలెక్టర్ హరీశ్  స్పష్టం చేశారు. ఈ కవిసమ్మేళనంలో పాల్గొన్న 52 మంది కవులు, కళాకారులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి పారితోషికాలను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, ఘట్కేసర్ ఎంపిపి సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, జిల్లా యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ బల్రామ్, జిల్లా కో–ఆపరేటివ్ ఆఫీసర్ శ్రీనివాసమూర్తి, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post