అర్జీలను వెంటనే పరిష్కరించాలి — జిల్లా కలెక్టర్ శశాంక

ప్రచురణార్ధం

అర్జీలను వెంటనే పరిష్కరించాలి — జిల్లా కలెక్టర్ శశాంక

మహబూబాబాద్, 2021 నవంబర్-29 :

ప్రజలు ఇచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు.  సోమవారం కలెక్టరేట్ ప్రగతి సమావేశ మందిరంలో కలెక్టర్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించి, దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా వెంటనే పరిష్కరించి అర్జీదారుడు మరలా గ్రీవెన్స్ సెల్ కు రాకుండా చూడాలని ఆదేశించారు.

మహబూబాబాద్ మండలం సాలార్ తండ గ్రామానికి చెందిన బానోత్ మంగ్యా తనకు హై వే రోడ్డు ప్రక్కన 255/1/57 సర్వే నెంబర్ లో రెండు ఎకరాల భూమి ఉండగా, నూతన కలెక్టరేట్ భవన నిర్మాణానికి ఒక ఎకరం ఒక గుంట భూమి  తీసుకొనుటకు  నోటిఫికేషన్ ఇచ్చినారని, మిగిలిన 39 గుంటల భూమికి పట్టా పాస్ పుస్తకం ఇప్పించాలని కోరారు.

మహబూబాబాద్ పాత బజారు మాలవాడకు చెందిన చింతమల్ల వెంకటయ్య తనకు గుమ్ముడూరు సర్వే నెంబర్ 287/331 లో రెండెకరాల పొలం తన తండ్రి పేరున ఉండగా, తండ్రి మరణానంతరం తనకు తెలియకుండాఅట్టి భూమిని ఇతరులు ఆక్రమించుకొని అమ్మడం జరిగినదని, అట్టి భూమిని తిరిగి తన పేరున ఇప్పించాలని కోరారు.

మహబూబాబాద్ మండలం జమాండ్లపల్లి గ్రామానికి చెందిన గండమల్ల రాజేశ్వరి తన చిన్న తనంలో తండ్రి మరణించారని, తల్లి వేరొకరిని పెఌ చేసుకోవడం వలన అమ్మమ్మ సంరక్షణలొ పెరిగానని, తనకు 14/41 సర్వే నెంబర్ లో రావలసిన 2 ఎకరాల 20 గుంటల భూమిని తనకు కాకుండా, వేరే వారి పేరున పట్టా చేశారని, తన జీవన భృతి కొరకు అట్టి భూమిని తన పేరున పట్టా చేయాలని కోరారు.

తొర్రూర్ మండలం పటేల్ గూడేం కు చెందిన తాటికొండ శోభ తొర్రూర్ మండలం వెలికట్ట గ్రామ శివారు రెవెన్యూ సర్వే నెంబర్ 531/ఇ2, 532/ఎ, 538/డి3 లో గల వ్యవసాయ భూమిని పట్టాదార్ పాస్ పుస్తకములో నమోదు చూపలేదని, నమోదు చేయాలని కోరారు.

వావిలాల కొండెంగుల గుట్ట తండాకు చెందిన మాలోతు హచ్చి  తన భర్త మరణం అనంతరం తనకు రైతు భీమా కోసం దరఖాస్తు చేసుకోగా డాక్యుమెంట్లు పరిశీలించకుండ రిజెక్ట్ చేయడం జరిగిందని, డాక్యుమెంట్లు పరిశీలించి రైతు భీమా మంజూరు చేయాలని కోరారు.

తొర్రూర్ గ్రామానికి చెందిన దరావత్ దేవేందర్ 2021-22 సంవత్సరానికి తొర్రూర్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో అంగడి టెండర్ లో కమేలా వేలం దక్కించుకొని నిర్వహించుకుంటున్నామని, కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్ నుండి జూన్ వరకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అంగడి కమేలా వసూలు చేయలేదని, అగ్రిమెంట్ ప్రకారం మున్సిపాలిటికి చెల్లించాల్సిన అట్టి మూడు నెలల కిస్తీలను మినహాయించాలని కోరారు.

మహబూబాబాద్ మండలం బేతోలు గ్రామ నివాసి షేక్ జబ్బార్ మియా 1984 నుండి 2020 అక్టోబర్ వరకు పోలీస్ శాఖలొ 36 సంవత్సరాలు హోం గార్డుగ పనిచేసి ప్రభుత్వ నిబంధనల మేర రిటైర్ అయ్యాయని, రిటైర్ మెంట్ తర్వాత తనకు పెన్షన్ సౌకర్యం లేనందున పేద కుటుంబానికి చెందిన తనకు జీవనోపాధికై ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో అవుట్ సోర్సింగ్ ద్వారా వాచ్ మెన్, సెక్యూరిటి గార్డు గా పని కల్పించి అదుకోవాలని కోరారు.

బయ్యారం మండలం జగ్నా తండ నివాసి భూక్య బలరాం తాను జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ నక్సలైట్ అని,  జన జీవన స్రవంతిలోకి వచ్చిన నక్సలైట్ లకు 5 ఎకరాల భూమి ఇస్తామని తన పేరును రికార్డులలో రాసి కొత్తపేట గ్రామ రెవెన్యూ పరిధిలో 62, 63 లో గల ఒక ఎకరం భూమిని  వివాదంలో ఉందని ఇవ్వలేదని, విచారణ చేపట్టి 5 ఎకరాల భూమిని ఇప్పించాలని కోరారు.

ఈ గ్రీవెన్స్ సెల్ లో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.
—————————————————————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి, మహబూబాబాద్  కార్యాలయం చే జారీ చేయనైనది.

Share This Post