6.9.2021 వినాయక చవితి, నిమజ్జన ఏర్పాట్లు జాయింట్ టీముల పర్యవేక్షణతో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు

Press note. 6.9.2021

వినాయక చవితి, నిమజ్జన ఏర్పాట్లు జాయింట్ టీముల పర్యవేక్షణతో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు.
సోమవారం నాడు కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో ఈనెల 10వ తేదీన వినాయక చవితి పండుగ సందర్భంగా మండపాల నిర్వహణ, నిమజ్జనం ఏర్పాట్లపై జిల్లా శాంతి సంఘం సమావేశం జరిగింది. శాంతి సంఘం సభ్యులు, ఆర్డీవోలు, డీఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు, ఐబి, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ ఇంజనీర్లు, డివిజనల్ పంచాయతీ అధికారులు, విద్యుత్ ఇంజనీర్లు, వివిధ శాఖల అధికారులతో ఆయన మాట్లాడుతూ, అందరం కలిసి కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి పండుగ జరుపుకోవాలని కోరారు. నిమజ్జనం గురించి చెరువులలో ఎక్కడ జరుపవచ్చు, ఎక్కడి వరకు విగ్రహాలు రావాలి, ఎక్కడి వరకు రాకూడదు అనేది గుర్తించి ఏర్పాటు చేయాలని, అలాగే పెద్ద చెరువుల వద్ద సిబ్బందితో పర్యవేక్షణ చేపట్టాలని నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీరును ఆదేశించారు. మత్స్యశాఖ గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. నిమజ్జనం కోసం పంచాయతీ, మున్సిపాలిటీ రోడ్లు బాగు చేయాలని ఆర్ అండ్ బి, మున్సిపల్ అధికారులకు సూచించారు. వర్షాకాలం అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున గణేష్ మండపాల వద్ద శానిటేషన్ పరిశుభ్రంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. త్రాగు నీటి వ్యవస్థకు అంతరాయం లేకుండా చూసుకోవాలని సూచించారు. మున్సిపాల్టీ పరిధిలో వీధి వర్తకులకు అవగాహన కల్పించాలని, ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండపాలలో తప్పనిసరిగా విద్యుత్ కనెక్షన్లు విద్యుత్ శాఖచే పొందాలని, ప్రభుత్వం నామినల్ రేట్లకే విద్యుత్ కనెక్షన్లు అందిస్తున్నందున, ప్రతి ఒక్క మండపం దగ్గర ట్రాన్స్ కో డిపార్ట్మెంట్ వారితో పొందాలని దీనికి అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని, లూజు వైర్లను గమనించి వెంటనే బాగు చేయాలని సూచించారు. నిమజ్జనం రోజున మేజర్ చెరువుల వద్ద అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని వైద్యశాఖకు సూచించారు. నిర్వాహకులు రోడ్ల పైన గణేష్ విగ్రహాలను పెట్టకుండా, కమ్యూనిటీ హాల్స్, గ్రౌండ్స్ లో విగ్రహాలను పెట్టుకుని పూజలు చేయాలని సూచించారు.

జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎన్. శ్వేత మాట్లాడుతూ, గణేష నవరాత్రి ఉత్సవాలలో ఎలాంటి సంఘటనలు జరగకుండా, ఎవరికీ ఇబ్బంది కలగకుండా పోలీస్ శాఖ, జిల్లా యంత్రాంగం సన్నద్థంగా ఉన్నామని అన్నారు. ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా పోలీసు శాఖ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. నిర్వాహకులు గణేష్ మండపాలకు అనుమతి తీసుకోవాలని, తద్వారా మేము అన్ని ఏర్పాట్లను అందిస్తామని తెలిపారు. పోలీస్ శాఖ ఇచ్చే ఫార్మాట్ ప్రకారం మండపాలు ఏర్పాటు చేసే వివరాలు ఇవ్వాలని, అలాగే ఎక్కడ నిమజ్జనం చేస్తారు, విగ్రహం సైజు వివరాలను ఇవ్వాలని, తద్వారా మైక్, విద్యుత్తు, శానిటేషన్ ఏర్పాట్లు కల్పిస్తామని, అలాగే నిమజ్జనం చేసే వాహనం నెంబరు వివరాలు ఇవ్వాలని అందుకు తగ్గట్లుగా మేము ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు డీజే పర్మిషన్ లేదని అన్నారు. కోవిద్ నిబంధనలను మన బాధ్యత గా పాటిస్తూ పండుగ జరుపుకోవాలని అన్నారు. జాయింట్ టీములు రెండు షిఫ్ట్లలో 24 గంటలు పని చేస్తాయని అన్నారు.

సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ డి.వెంకట మాధవరావు, కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్ పర్సన్ ఇందూ ప్రియ, అడిషనల్ ఎస్పీ అన్యోన్య, బాన్సువాడ ఆర్డీవో రాజా గౌడ్, శాంతి సంఘ సభ్యులు, డీఎస్పీలు, జిల్లా అధికారులు, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.

…..DPRO. KMR.

Share This Post