అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద, కాలువ గట్లపై పచ్చదనం పెంపు, పది శాతం కన్న తక్కువ అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లాల్లో ప్రత్యేక ప్రణాళికతో పచ్చదనం పెంచటం ఎనిమిదవ విడత హరితహారం ప్రాధాన్యాతాంశాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. ఈ వర్షాకాలంలో చేపట్టబోయే తెలంగాణకు హరితహారం కార్యక్రమం ముందస్తు ఏర్పాట్లుపై శుక్రవారం సంబంధిత శాఖల కార్యదర్శులు, జిల్లాల కలెక్టర్లు, అధికారులతో చీఫ్ సెక్రటరీ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో పచ్చదనం పెంపు కార్యక్రమానికి జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయని, దీనిని నిరంతరాయంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఈసారి చేపటాబోయే హరితహారం కార్యక్రమంలో 19.54 కోట్ల మొక్కలను రాష్ట్ర వ్యాప్తంగా నాటడం లక్ష్యంగా నిర్దేశించినట్లు ఆయన వెల్లడించారు. అన్ని సాగునీటి ప్రాజెక్టులు, కాలువ గట్ల వెంట పచ్చదనం పెంచుటకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని అందుకనుగుణంగా జిల్లాలో నీటిపారుదల శాఖ క్రింద ఉన్న చెరువులు,కాలువలు, బెడ్ ల పొడవు ఆధారంగా ఎన్ని మొక్కలు అవకారమో గుర్తించి వారం రోజుల్లో యాక్షన్ ప్లాన్ ను సిద్దం చేయాలని కలెక్టర్లకు సూచించారు. అదేవిధంగా అతి తక్కువ అటవీ శాతం ఉన్న జిల్లాల్లో ప్రత్యేక ప్రణాళికతో పచ్చదనం పెంపు కార్యక్రమాలను చేపట్టాలని చీఫ్ సెక్రటరీ తెలిపారు. అన్ని రహదారుల వెంట మల్టీ లెవల్ అవెన్యూ ప్లాంటేష చేపట్టాలని అన్నారు. అన్ని గ్రామాల్లో చేపట్టిన పల్లె ప్రకతి వనాలకు మంచి స్పందన వస్తోందని, వీటిల్లో చిక్కటి పచ్చదనం పెంచటం, మండలానికి కనీసం ఐదు బృహత్ పల్లె ప్రకతి వనాలను పెంచటం లక్ష్యంగా పెట్టుకోవాలని చీఫ్ సెక్రటరీ సూచించారు. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపు కోసం ప్రతీ మున్సిపాలిటీకి ప్రణాళిక ఉండాలని చెప్పారు. ఖాళీ స్థలాలను గుర్తించి, చిక్కటి పచ్చదనం పెంచటం లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున హరితహారం మొక్కలకు వారంలో రెండు, మూడు సార్లు నీటి వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ జిల్లాలో కలెక్టర్ నేతత్వంలో జిల్లా అటవీ అధికారి, ఇరిగేషన్ అధికారి, ఇతర సంబంథిత అధికారులు ఒక బృందంగా ఏర్పడి హరితహారం ప్రణాళికలను పూర్తి చేయాలని సి.ఎస్. ఆదేశించారు. నేల తత్త్వం, ప్రతాన్ని బట్టి మొక్కలు విరివిగా పెంచేలా కృషిచేయాలని సూచించారు.
మేడ్చల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ మాట్లాడుతూ ఈ వర్షాలకాలంలో వివిధ శాఖల ద్వారా జిల్లాలో 34 లక్షల 42 వేల మొక్కలు నాటుటకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, లక్ష్యాన్ని అధిగమించుటకు అధికారులకు దిశా నిర్దేశం చేశామని అన్నారు. జిల్లాలో 2016-17 నుండి విజయవంతంగా హరితహారం కార్యక్రమం చేపట్టడం వల్ల నేడు జిల్లా అటవీ విస్తీర్ణం 20.58 శాతం ఉందని, ప్రజలు, ప్రజాప్రథినిధుల భాగస్వామ్యంతో దీనిని మరింత మెరుగుపరచుటకు చక్కటి ప్రణాళికతో ముందుకుపోతున్నామని అన్నారు. అందులో భాగంగా 2023 లో 35 లక్షల 92 వేలు, 2024 లో 33 లక్షల 92 వేల మొక్కలు నాటుటకు కార్యాచరణ రూపొందించామని కలెక్టర్ వివరించారు. ఫారెస్ట్ బ్లాక్ లలో మొక్కలు నాటుటకు కంపా, ఉపాధి హామీ పధకం ద్వారా నర్సరీలలో మొక్కలు పెంచుతున్నామని అన్నారు. అలాగే ప్రధాన రహదారులు, అంతర్గత రహాదారుల వెంట మల్టి లెవెల్ అవెన్యూ ప్లాంటేషన్ కు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈసారి నీటిపారుదల శాఖ క్రింద ఉన్న చెరువులు, కాలువల పొడవునా చెట్లు నాటుటకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని, పట్టన ప్రాంతాలలో కూడా చిక్కటి పచ్చదనం కనిపించేలా ప్రభుత్వ సంస్థలు,ఖాళీ స్థలాలలో చెట్లు నాటుటకు మునిసిపల్ కమీషనర్లకు దిశా నిర్దేశం చేశామని కలెక్టర్ తెలిపారు. పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు ద్వారా ఆయా ప్రాంతాలలో ఆహ్లాద వాతావరణం నెలకొంటున్నదని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శరవణన్, డి.ఎఫ్.ఓ. రవి ప్రసాద్ , డి.ఆర్.డి.ఓ. శ్రీనివా,స్ డి.పి .ఓ. తరుణ్ కుమార్, పంచాయత్ రాజ్ ఎస్.ఈ. కనకరత్నం, ఆర్.డి .ఓ. సాయి రామ్, మునిసిపల్ కమీషనర్లు శ్రీహరి, శ్రీనివాస్, మోహన్ తదితర అధికారులు పాల్గొన్నారు.